మందుబాబుల మత్తు వదల కొడతాం..ఇల్లీగల్ డీ అడిక్షన్‌ రీహాబిలిటేషన్‌ సెంటర్ల అక్రమ దందా.. టీవీ9 నిఘాలో విస్తుకొలిపే నిజాలు!

వీళ్లకు డబ్బులిస్తే చాలు అక్రమంగా నిర్భందిస్తారు. అవసరమైతే.. బలవంతంగా ఇళ్ల నుంచి కిడ్నాప్ తరహాలో ఎత్తుకొస్తారు. గదుల్లో బంధించి చిత్రహింసలకు గురిచేస్తారు.

మందుబాబుల మత్తు వదల కొడతాం..ఇల్లీగల్ డీ అడిక్షన్‌ రీహాబిలిటేషన్‌ సెంటర్ల అక్రమ దందా.. టీవీ9 నిఘాలో విస్తుకొలిపే నిజాలు!
Rehabilitation

TV9 Nigha: వీళ్లకు డబ్బులిస్తే చాలు అక్రమంగా నిర్భందిస్తారు. అవసరమైతే.. బలవంతంగా ఇళ్ల నుంచి కిడ్నాప్ తరహాలో ఎత్తుకొస్తారు. గదుల్లో బంధించి చిత్రహింసలకు గురిచేస్తారు. ఈ మాటలన్నీ వింటే.. ఏదో మాఫియా ముఠాలు గురించి మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారా? కానీ కాదు.. మత్తు వదిలించే సెంటర్లు పేరుతో సాగుతున్న అరాచకాలు ఇవి. వీళ్లకు ఎలాంటి అనుమతులు అక్కరలేదు. ఎవరి అజమాయిషీ ఉండాల్సిన పనిలేదు. ఇల్లీగల్ రిహాబిలిటేషన్‌ సెంటర్లపై టివి9 నిఘాలో బయటపడ్డ కఠోర వాస్తవాలివి.

మద్యానికి బానిసైన వ్యక్తిని అమాంతం నిర్బంధించి తీసుకువెళ్ళడం ఇల్లీగల్ డీ అడిక్షన్‌ రీహాబిలిటేషన్‌ సెంటర్ల లో ఒకపార్టు. దీనికి నిజంగానే ఆవారా.. గూండా గ్యాంగ్‌ లను ఉపయోగిస్తారు. కొంతకాలం క్రితం టివి9 చేసిన స్ట్రింగ్‌ ఆపరేషన్‌ లో ఈ విషయాలు బయటపడ్డాయి. ఇప్పటికీ ఇవి ఇలానే నడుస్తున్నాయి.

డీ అడిక్షన్‌ రీహాబిలిటేషన్‌ సెంటర్లంటే..

మద్యానికి.. మత్తుకు బానిసలైన వారి వల్ల వారికే కాదు.. కుటుంబానికి.. సమాజానికి కూడా నష్టం జరుగుతోంది. అసాంఘిక శక్తులుగా మారే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకే ఇలాంటివారిని బయటకు తీసుకువచ్చేందుకు.. డీ అడిక్షన్‌ రీహాబిలిటేషన్‌ సెంటర్లలో వీరికి ట్రీట్‌ మెంట్ చేస్తారు. కానీ ఇదే ముసుగులో అనేక ఇల్లీగల్‌ సెంటర్లు పుట్టుకొచ్చాయి. ఈ సెంటర్ల అసాంఘిక శక్తులకు కేరాఫ్ అడ్రస్ అవుతున్నాయి. ఈ ఇల్లీగల్ సెంటర్లు ఎన్ని ఉన్నాయంటే..ప్రభుత్వం అనుమతిచ్చిన సెంటర్లు 20లోపు ఉంటే.. అనధికారికంగా కొనసాగుతున్న సెంటర్లు 200 వరకూ ఉన్నాయి. దీనిని బట్టి ఈ దందా ఏస్ధాయిలో జరుగుతోందో అంచనా వేయొచ్చు.

డీ అడిక్షన్‌ రీహాబిలిటేషన్ లు ఏస్ధాయిలో అరాచకాలు కొనసాగిస్తున్నాయి. డబ్బులిస్తే ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాయా? కట్టి కొట్టడం ఇక్కడ ట్రీట్మెంట్ లో ఒక భాగమా? అవుననే అంటున్నాయి.. ఈ ఇల్లీగల్ సెంటర్లు.

కొంపల్లిలో ఉన్న ఒక డీ అడిక్షన్‌ రీహాబిలిటేషన్ పరిశీలిస్తే..ఇక్కడ చుట్టూ జనావాసాలు. మధ్యలో ఓ బూత్ బంగ్లాలాంటి భవనం. చుట్టూ.. వ్యూకటర్స్. ఈభవనంలో ఏం జరుగుతుందో.. ఎవరికీ తెలిసే అవకాశంలేదు. కానీ ఇక్కడ సుమారు 40 మందికి పైగా మద్యానికి బానిసలైన వారికి చికిత్స జరగుతోంది. చికిత్స అనేకంటే.. అక్రమ నిర్భందం అని చెప్పాలి. ఎందుకంటే.. ఈ సెంటర్ కు ప్రస్తుతం ఎలాంటి లైసెన్సు లేదు.
టివి9 టీమ్.. తమ ఇంటిలో మద్యానికి బానిసైన వ్యక్తి ఉన్నాడంటూ ఎంటర్ అయింది… అప్పుడు షాకింగ్ నిజాలు ఎన్నో బయటపడ్డాయి.నిజానికి మత్తుకు బానిసైన వ్యక్తిని తరలించాలంటే.. దానికి బోలెడంత తతంగం. కుటంబ సభ్యుల అనుమతితో పాటు మాసనిక వైద్యుల, పోలీసులు..అవసరమైతే న్యాయస్థానం అనుమతి కూడా ఉండాలి. కానీ ఇక్కడ ఎంత సింపుల్‌ అంటే… 3,500 రూపాయలు ఇస్తే చాలు. ఇంటి నుంచి ఓ వ్యక్తిని ఎలాంటి నిర్థారణ లేకుండా అక్రమంగా నిర్భందించి తరలించేస్తారు. దీనికి ముఠాలనే మెయింటైన్ చేస్తారు. నమ్మలేకపోతున్నారా? ఆ సెంటర్ నిర్వాహకుడు స్వయంగా చెప్పిన నిజం ఇది.

ఎంతో మందిని ఇలా మత్తునుంచి ఈయన బయటకు తెచ్చాడు. మధ్య మధ్యలో అక్కడకు వచ్చిన కస్టమర్లను నమ్మించడం కోసం .. ఓ ఏర్పాటు కూడా ఉంటుంది. ఓ వ్యక్తి ఇక్కడకు చాలా భయంకరమైన పరిస్థితుల్లో వచ్చినట్లు .. ఆయనను పూర్తిగా మారినట్లు.. వచ్చి తన వివరాలు చెబుతూ.. తాను ఎలా మత్తుకు బానిసైంది..ఎలా మారింది వివరిస్తూ ఉంటాడు. ఇలా అతను వివరించే విధానానికి చాలామంది పడిపోతారు. తమ వారిని ఎలాగైనా ఇక్కడ చేర్పించేస్తే.. మత్తు వదిలిపోతుంది అని భావిస్తారు.

నిబంధనలు ఇలా.. దందాలు అలా..

నిబంధనల ప్రకారం మూడు నెలలు అంటే… 90 రోజులుమాత్రమే రీహాబిలిటేషన్‌ సెంటర్లలో ట్రీట్మెంట్‌ జరగాలి. కానీ ఈసెంటర్లలో నాలుగు నెలలు నుంచి 6 నెలలు వరకూ నిర్భందించేస్తున్నారు. ఎందుకంటే… ప్రతినెలా కేవలం రీహాబిలిటేషన్‌ కు 25వేల 30వేలు వసూలు చేస్తున్నారు. అంటే… ఇంకా ఇతర మెడికల్‌ ట్రీట్మెంట్లు..మందులు పేరుతో 2లక్షలు. ఇందులో డబ్బు ను బట్టి ప్యాకేజీలు కూడా ఉన్నాయి.

ఎక్కడా తగ్గేదేలే!

సెంటర్లే ఇల్లీగల్‌ .. ఇందుకే ఇక్కడ ఇల్లీగల్‌ చర్యలకు తగ్గేదే లేదు. మత్తుకు బాసినైన వారి బిహేవియర్‌ లో చాలా మార్పులు. అందుకే ఇలాంటి వారిని కంట్రోల్ చేయడానికి ఇక్కడ నిర్భందమే కాదు .. అవసరమైతే చావచితక్కొడతారు. ఈ మాటలను చాలా ధైర్యంగా నిర్వాహకులే చెబుతారు.
ఎల్బీనగర్‌ ప్రాంతం. చుట్టూ మార్కెట్ వాతావరణం. ఇక్కడ ఒక రీహాబిలిటేషన్‌ సెంటర్ ఉందంటే ఎవ్వరూ నమ్మలేరు. చూడటానికి ఓ డాబా ఇల్లు. ముందు ఓ షెడ్‌. గేట్లకు తాళాలు. ఎంక్వైరీచేస్తే… వీళ్ల ప్రశ్నలకు చాలా సమాధానాలు చెప్పిన తర్వాత గానీ గేట్లు ఓపెన్‌ కావు. ఎందుకంటే.. ఇల్లీగల్ సెంటర్లు కదా.. ఆమాత్రం జాగ్రత్తలు తీసుకుంటారు.

ఈ సెంటర్ లోని తమ సోదరుడు గాంజాకు బానిసయ్యాడని అడుగుపెట్టింది టివి9…. ఇక్కడ ఓ షాట్ టీషర్టలో … చెవులకు ఇయర్ ఫోన్స్ తో కన్పిస్తున్న వ్యక్తి తాను సైకాలిస్టుగా పరిచయం చేసుకున్నాడు. అంతా దందా స్టైల్. హా ఏంటి సమస్య.. అని మొదలు పెట్టి….. మత్తుకు బానిసయ్యే వారి మెదడు ఎలా ఉంటుందో ఈయన చెబితే.. కళ్లుబైర్లు కమ్ముతాయి. ఈయన మాటల్లో తాగుడు బానిసల్లో మెదడు ఓ పక్క కరిగిపోతుందంట. మరి గాంజా తాగేవారిలో అయితే… చెప్పాల్సిన అవసరమేలేదు. ఇంకా చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనాలు నుంచి.. చిన్నచిన్న గొడవలు వరకూ.. మన తాగుడుకు లింగ్‌ ఉంటుందంట.. ఇలా అతను చెప్పే మాటలకు మారు మాట్లాడకుండా తమవారిని అక్కడ వేలకు వేలు కట్టి అప్పగించేసి వచ్చేస్తారు జనాలు. వారి ఆశ వారిది. తమ వారు వ్యసనం నుంచి బయటపడి కుటుంబానికి ఉపయోగాపదతారనే భావన అది.

మత్తు బానిసనలు చాలా అగ్రసివ్ గా.. ఉంటారు. మరి ఈ సెంటర్లలో అలా ఉన్నవార్నితీసుకువచ్చిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? మంచాలకు కట్టేస్తారు. చావ చితక్కొడతారు. ఈ విషయాన్ని చాలా సగర్వంగా సెంటర్ నిర్వాహకులు ప్రకటిస్తారు.

రీహాబిలిటేషన్‌ సెంటర్లకు లైసెన్సు ఉండాలా? ఎలాంటి అనుమతులు ఉండాలి? ఎవరిస్తారు. కానీ ఇల్లీగల్‌ గా ఈ సెంటర్లు ఎందుదకు నడుస్తున్నాయి. ఈ ఇల్లీగల్ సెంటర్ నిర్వాహకులు దీన్ని ఏమని చెబుతారు?
రాజేంద్రప్రసాద్ అనే రిటైర్డ్ పోలీసు ఆఫీసర్ డీ అడిక్షన్ సెంటర్ల నిర్వహణ ..తనిఖీ కమిటీలో సభ్యునిగా పనిచేసిన వ్యక్తి చెప్పే మాటలు వింటే… ఆశ్చర్యం కాదు.. ఆందోళన పడాల్సిందే. ఎలాంటి అనుమతులు లేకుండా ఈ సెంటర్లు నడవడానికి ప్రధానంగా ఇందులో వస్తున్న లక్షల రూపాయల ఆదాయం. అంతకంటే.. ఈ సెంటర్లను నియంత్రించాల్సిన వ్యవస్థల వైఫల్యం.

రాజేంద్రప్రసాద్ చెబుతున్నదాని ప్రకారం ఒక సెంటర్ పెట్టాలంటే…. అనేక అనుమతులు. ప్రధానంగా సైక్రియాట్రిస్ట్ ఉండాలి. ఆతరువాత క్లీనికల్ సైకాలజిస్ట్. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అనుమతులుండాలి. ఒక సెంటర్‌ నిర్వహణకు అనుమతి కోరుతూ అన్ని ఉన్నాయని అప్లికేషన్‌ పెట్టిన తరువాత… దీనిపై నిర్ణయించిన కమటీ తనిఖీలు చేయాలి.. ఆ తరువాతే ఆ సెంటర్ కు అనుమతి . కానీ ఇలాంటి వాటికి దూరంగానే అనేక సెంటర్లు వస్తున్నాయి. నామ్ కే వాస్తే అప్లికేషన్‌ పెట్టి… సెంటర్లు నడిపేస్తున్నారు. అందుకే… ఒక్క హైదరాబాద్‌ పరిధిలో ఉన్న అనుమతి ఉన్న సెంటర్లు కేవలం 20 లోపు మాత్రమే కానీ, ఇల్లీగల్ గా వందల సెంటర్ల నడుస్తున్నాయి. అప్లికేషన్ల ప్రాథమిక దశలోనే కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోకపోవడమే కారణం దీనికి కారణం అని నిపుణులు అంటున్నారు.

అయితే…. లీగల్… అనేది ఇల్లీగల్ సెంటర్లకు చాలా చిన్న విషయం. దాన్ని అసలు పరిగణలోనికి తీసుకోకూదని ఓ క్లాసే చెబుతున్నారు. క్లైంట్‌ రూపంలో వెళ్లిన టివి9 దీనికి లైసెన్సు ఉండాలా? ఇలా లేని సెంటర్లలో చేరవచ్చా..అనే సందేహాలకు వీరి నుంచి వచ్చే సమాధానాలు చూస్తే ఆశ్చర్యమే కలుగుతోంది. ఈ లైసెన్సులు వల్ల ఉపయోగమే లేదని తేల్చేస్తున్నాడు ఓ సెంటర్ నిర్వాహకుడు. ఎక్కడ మంచి ట్రీట్ మెంట్ జరుగుతుందో చూడాలంటూ చెబుతున్నాడు

అయితే… లైసెన్సు తో అన్ని అనుమతులతో రీహాబిలిటేషన్ సెంటర్లుపెట్టడం సాధ్యం కాదని తేల్చేస్తున్నాడు మరో సెంటర్ నిర్వాహకుడు. సైక్రియారిటీ డాక్టర్ తో సెంటర్‌ నిర్వహిస్తే ఆయనకు లక్షల రూపాయల ఫీజు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మేము కూడా లక్షల రూపాయలు క్లైంట్స్ నుంచి వసూలు చేయాలి. కొన్ని చోట్ల లైసెన్సులతో నడుస్తున్న సెంటర్లు చూడండి. లక్షల రూపాయలు వసూలుచేస్తున్నారంటున్నారు.

ఇంతకీ.. రీ హాబిలిటేషన్ సెంటర్లు ఎలా ఉండాలి? ఎలా ఉన్నాయి? అంటే… ఆశ్చర్యపోయే విషయాలే కన్పిస్తున్నాయి.

ఒక డిఅడిక్షన్ రీహాబిలిటేషన్‌ సెంటర్ నిర్వహించాలంటే.. చాలా నిబంధనలు ఉన్నాయి. దీనిపై మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017 లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇందులో ఒక సింగల్ బెడ్‌ రూమ్‌ లో ఇద్దరి కంటే.. ఎక్కువ మందిని ఉంచడానికి వీల్లేదు. మరోవైపు సైకియారిటిస్టు, క్లీనికల్‌ సైకాలజిస్టు, కౌన్సిలర్లు, నర్సులు,సాధారణ రోగాలు చూడటానికి ఒక ఎంబిబిఎస్ డాక్టర్ 24ఇన్‌టు 7 ఉండాలి. పదిమంది పేషంట్లకు ఒక క్వాలిఫైడ్‌ నర్స్ ఉండాలి. ప్రతి 10మంది పేషంట్లకు ఒక అటెండర్ వంటి అనేక నియమాలు ఉండాలి. కానీ వీటన్నింటికీ భిన్నంగానే ఈ సెంటర్లు నడుస్తున్నాయి.

టివి9 నిఘా చేసిన కొంపల్లి… ఎల్‌బినగర్‌.. బండ్లగూడ మన్సూరాబాద్‌… ప్రాంతాల్లో ఈ రీహాబిలేటషన్‌ సెంటర్లు చూస్తే అర్థమవుతుంది.. ఏ విధంగా ఉన్నాయో.. ఈ సెంటర్లు లో 20 నుంచి 40 కిపైగా పేషంట్లను పెట్టి.. నడుపుతున్నారు. ఒక్కసారి ఈసెంటర్ లో ఉన్న పరిస్థితి చూస్తే ఈ దందా ఎంత పక్కగా దారుణమైన పరిస్థితుల్లో సాగుతోందో అర్ధం అవుతుంది

ఇలా అనేక సెంటర్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని… వీటినిపై తనిఖీలు, నియంత్రణ లేకపోవడం వల్ల.. పరిస్థితులు దారుణంగా తయారయ్యాయంటున్నారు. పట్టుబడిన సెంటర్లపై కూడా కఠిన చర్యలు లేకపోవడం వల్ల కూడా ఇలాంటి ఇల్లీగల్‌ సెంటర్లు ఎక్కువగా పుట్టుకు రావడానికి కారణమవుతున్నాయంటున్నారు. తాము గతంలో ఫిర్యాదుల చేసినా… ఫలితం లేకుండా పోయిందంటున్నారు కొందరు బాధితులు.

వారూ కాదనలేకపోతున్నారు..

ఈ ఇల్లీగల్‌ డీ అడిక్షన్‌ రీహాబిలిటేషన్‌ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన విషయాన్ని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు సైతం కాదనలేకపోతున్నారు. ఈ సెంటర్ల తీరుపై టివి9 అడిగిన వివరాలకు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 8 మాత్రమే ప్రైవేటు డి అడిక్షన్‌ సెంటర్లు ఉన్నాయని తేల్చి చెబుతున్నారు తెలంగాణ డిఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డి ఈ విషయంపై స్పందించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డి అడిక్షన్ సెంటర్ పేరు తో పుట్టగొడుగు ల్లా చాలా పుట్టుకొచ్చాయి అన్నారు . నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న డి అడిక్షన్ సెంటర్ , రిహబిలెషన్ సెంటర్ లలో ట్రీట్మెంట్ కు వెళ్ళ వద్దని…వైద్యశాఖ అనుమతి ఉన్న వాటి లో మాత్రమే చికిత్స కు వెళ్ళాలని సూచించారు. ప్రైవేట్ డి అడిక్షన్ సెంటర్ ల పై వైద్య ఆరోగ్యశాఖ నిఘా ఉందని..ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసినట్టు ఫిర్యాదు అందితే మాత్రం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డి ఎం ఈ రమేష్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది డి అడిక్షన్ సెంటర్ లు మాత్రమే రన్ అవుతున్నాయని..ఇవి కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల లో సైక్రియాటిస్ట్ సిబ్బంది ఉన్న ఆసుపత్రులలో వార్డ్ లను ఏర్పాటు చేశామన్నారు.

ఇదీ ఇల్లీగల్‌ డీఅడిక్షన్‌ సెంటర్ల పరిస్థితి.. అందులో కొనసాగుతున్న దారుణాలు. వీటిని కంట్రోల్‌ చేయకపోతే.. మద్యం, మత్తు పదార్థాలు వాడకం వల్ల వ్యక్తులకు సమాజానికి జరిగే నష్టం కంటే… ఈ సెంటర్లు వల్ల జరిగే నష్టమే అత్యధికంగా ఉండే పరిస్థితి కన్పిస్తోంది.

ఇవి కూడా చదవండి: Green Peas Benefits: బఠానీలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలిపెట్టరు..

Viral Photo: ఈ బూరెబుగ్గల చిన్నది మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది.. ఎవరో గుర్తుపట్టారా!

Antibiotics defects: విచ్చలవిడి యాంటీ బయాటిక్స్‌తో పెను ప్రమాదం.. కరోనా కాలంలో మరింత డేంజర్‌.. హెచ్చరిస్తోన్న ఆరోగ్య నిపుణులు..


Published On - 4:35 pm, Tue, 30 November 21

Click on your DTH Provider to Add TV9 Telugu