వివిధ ఆఫర్లు, రాయితీలకు టీఎస్ఆర్టీసీ మారుపేరుగా నిలుస్తోంది. పండుగలు, వీకెండ్స్ సందర్భంగా షాపింగ్ మాల్స్, ఈ కామర్స్ సైట్స్ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. కానీ ఈ మధ్య కాలంలో ఆర్టీసీ కూడా రాయితీలు, ఆఫర్లు ప్రకటిస్తూ ప్రయాణీకులను ఆకర్షిస్తోంది. సంస్థను లాభాల బాటలోకి తీసుకువచ్చేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే దసరా సందర్భంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన అధికారులు.. వాటిలో అదనపు ఛార్జీలు ఏమీ లేవని, సాధారణ ఛార్జీలే వసూలు చేస్తామని ప్రకటించారు. మరోవైపు.. హైదరాబాద్ చారిత్రక ప్రాంతాలకు నిలయం. నగరంలో చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో. జిల్లాల నుంచి సందర్శనార్థం భాగ్యనగరానికి వచ్చే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ దర్శన్ పేరుతో మంగళవారం కొత్త బస్సులను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఏడు చారిత్రక ప్రదేశాల్లో 12 గంటల పాటు జర్నీ సాగనుంది. అంతే కాకుండా ఫుడ్ కూడా అందజేస్తారు. ఉదయం 8.30 గంటలకు టూర్ స్టార్ట్ కాగా.. రాత్రి 8 గంటలకు ముగియనుంది.
అల్ఫా హోటల్ నుంచి టార్ ఉదయం 8.30 గంటలకు స్టార్ట్ అవుతుంది. ముందుగా బిర్లా మందిర్ కు తీసుకువెళ్లి, తర్వాత చౌమహల్లా ప్యాలెస్, మధ్యాహ్నం తారామతీ బారదరీ రిసార్ట్ వద్ద ఉన్న హరిత హోటల్‌లో లంచ్ చేస్తారు. భోజనం పూర్తయ్యాక గోల్కొండ ప్యాలెస్, దుర్గం చెరువు పార్క్, కేబుల్ బ్రిడ్జ్, హుస్సేన్ సాగర్ వద్ద ఉన్న ఎన్టీఆర్ పార్క్ కు తీసుకువెళ్తారు. మెట్రో ఎక్స్ ప్రెస్‌లో పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.130 తీసుకుంటారు. అదే మెట్రో లగ్జరీలో పెద్దలకు రూ.450, పిల్లలకు రూ.340 తీసుకుంటారు. ముందు వచ్చిన కస్టమర్లకు 10 శాతం డిస్కౌంట్ అందిస్తారు. టీఎస్ఆర్టీసీ ఆఫీషియల్ వెబ్ సైట్ నుంచి కస్టమర్లు తమ టూర్ బుక్ చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు. 040-23450033, 040-69440000 రెండు హెల్ప్ లైన్ నంబర్లు కూడా ఏర్పాటు చేసింది. ఈ స్కీమ్ పర్యాటకులకు, సిటీ ప్రజలకు కూడా ఉపయుక్తంగా ఉండనుంది.
ఒక్క రోజులో హైదరాబాద్ చూడాలంటే ప్లానింగ్ కావాలి. ఇప్పుడు TSRTC అందిస్తుంది పక్కా ప్లానింగ్.#TSRTCHyderabadDarshan #WorldTourismDay pic.twitter.com/4fpZjI0iPx
— Managing Director – TSRTC (@tsrtcmdoffice) September 27, 2022
రోజు రోజుకు నగర విస్తరణ నేపథ్యంలో హైదరాబాద్‌లో పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. వారిని దృష్టిలో పెట్టుకుని నగరంలోని అన్ని పర్యాటక,ఆధ్యాత్మిక ప్రాంతాలు, చరిత్రాత్మక కట్టడాలను వీక్షించేలా ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు ప్రత్యేక ‘హైదరాబాద్ దర్శన్’ పేరుతో ఒక ప్రత్యేక బస్సు సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ దర్శన్ ప్రత్యేక సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. శని, ఆదివారాల్లో ఈ సర్వీసులను నడుపుతున్నట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ రిజీయన్ మేనేజర్ సీహెచ్.వెంకన్న తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో 60 శాతం ఆర్టీసీలు ప్రైవేట్ పరం అయ్యాయని, మన రాష్ట్రంలో సంస్థను బతికించుకోవాలనే ఆశయంతో అందరం కష్టపడుతున్నట్లు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..