తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ 6 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఎట్టకేలకు దీక్ష విరమించారు. ఆహారం గానీ, పానీయాలు గానీ తీసుకోకుండా నిమ్స్ ఆస్పత్రిలో దీక్ష చేస్తున్న ఆయన నిన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన బీపీ లెవల్స్, షుగర్ స్థాయి తగ్గిపోయినట్లు డాక్టర్లు తెలిపిన నేపథ్యంలో.. దీక్ష విరమించాలని కుటుంబసభ్యులు, కార్యకర్తలు కోరారు. అయితే అందుకు ఆయన అంగీకరించలేదు. ఇవాళ నిమ్స్‌లో లక్ష్మణ్‌ను పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి హన్స్ రాజ్ అహిర్ పరామర్శించారు. ఈక్రమంలో లక్ష్మణ్ చేత మంత్రి దీక్షను విరమింపజేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఫోన్లో లక్ష్మణ్‌తో మాట్లాడారు. దీక్ష విరమించాలని ఆయన సైతం కోరడంతో లక్ష్మణ్ ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారు.