తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చాంద్రాయణగుట్ట (Chandrayanagutta) ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. దీనిని మంత్రి కేటీఆర్ ప్రారంభించాల్సి ఉండగా రాజాసింగ్ వ్యాఖ్యలు, ఆయన అరెస్ట్‌తో పాతబస్తీలో ఉద్రిక్తత నెలకొంది. రాజాసింగ్ (Rajasingh) కామెంట్స్ పై ఎంఐఎం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటం, పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. దీంతో అధికారులు ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా.. ప్రజల మౌలిక అవసరాలు పూర్తి చేయడంలో బల్దియా వేగంగా అడుగులు వేస్తోంది. నగరంలో నలువైపులా GHMC ఆధ్వర్యంలో చేపట్టిన 41 పనుల్లో దాదాపు 30 పూర్తయ్యాయి. నగరంలో ఇప్పటివరకు మొత్తం 15 ఫ్లై ఓవర్లు పూర్తయ్యాయి. సిటీలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు, మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు, ఆర్‌ఓబీలను నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ ను రూ. 45.79 కోట్ల వ్యయంతో నిర్మించారు. మొత్తం నాలుగు లైన్లను రెండు వైపులా 674 మీటర్ల పొడవుతో నిర్మాణం పూర్తి చేశారు.
కందికల్ గేట్, బార్కస్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ ఉచ్చులో పడిపోకుండా నేరుగా ఫ్లై ఓవర్ పై నుంచి వెళ్లవచ్చు. తద్వారా ప్రమాదాలు జరగకుండా ఉండటంతో పాటు ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చు. ఈ ఫ్లై ఓవర్ విస్తరణతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎల్బీనగర్ మీదుగా నల్లగొండ, వరంగల్ వెళ్లేందుకు మార్గం సుగమమవుతుంది. నాగోల్ వద్ద చేపట్టిన ఫ్లైఓవర్ పనులు తుదిదశకు చేరాయి. ఈ నేపథ్యంలో ఆరాంఘర్ నుండి ఉప్పల్ జంక్షన్ వరకు రవాణా మెరుగు పరచడమే కాకుండా సిగ్నల్ ఫ్రీ రవాణా మెరుగవుతుంది. కాగా.. వాయిదా పడిన చాంద్రాయణ గుట్ట పై వంతెన ప్రారంభోత్సవం ఈ నెల 27 న జరిగే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..