BJP Executive Meet: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్‌.. కమలనాథుల ఆగ్రహం..

|

Jul 03, 2022 | 1:38 PM

బీజేపీ జాతీయ సమావేశాల్లోకి తెలంగాణ ఇంటెలిజెన్స్‌ అధికారుల (Telangana Intelligence) ప్రవేశం కలకలం రేపింది. రెండో రోజు సమావేశాలు ప్రారంభమైన రెండు గంటల తర్వాత తెలంగాణ ఇంటెలిజెన్స్‌ అధికారులను బీజేపీ నేతలు గుర్తించారు.

BJP Executive Meet: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్‌.. కమలనాథుల ఆగ్రహం..
Bjp Executive Meet
Follow us on

BJP Executive Meet: హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో భాగ్యనగర్‌ డిక్లరేషన్‌ పేరుతో కీలక రాజకీయ తీర్మానాన్ని బీజేపీ ఆమోదించనుంది. కాగా.. బీజేపీ జాతీయ సమావేశాల్లోకి తెలంగాణ ఇంటెలిజెన్స్‌ అధికారుల (Telangana Intelligence) ప్రవేశం కలకలం రేపింది. రెండో రోజు సమావేశాలు ప్రారంభమైన రెండు గంటల తర్వాత తెలంగాణ ఇంటెలిజెన్స్‌ అధికారులను బీజేపీ నేతలు గుర్తించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఇంటెలిజెన్స్ అధికారి తీర్మానం ఫొటో తీస్తుండగా ఇంద్రసేనారెడ్డి గుర్తించారు. వెంటనే ఆయనను పట్టుకొని పోలీసులకు అప్పజెప్పినట్లు ఇంద్రసేనారెడ్డి తెలిపారు.

ఇది మంచి పద్దతి కాదు: ఇంద్రసేనారెడ్డి

బీజేపీ సమావేశాల లోపలికి ఇంటెలిజెన్స్‌ అధికారులు ప్రవేశించడంపై ఇంద్రసేనారెడ్డి తీవ్ర అభ్యంతరం చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చిన నిఘా అధికారి శ్రీనివాసరావును పట్టుకున్నట్లు ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తగిన చర్య కాదంటూ మండిపడ్డారు. అంతర్గత సమావేశంలోకి పోలీసులను పంపించి నిఘా పెట్టడం అనేది మంచి పద్ధతి కాదంటూ పేర్కొన్నారు. గతంలో వారు సమావేశం నిర్వహించుకున్నప్పుడు ఎవరు ఇలా చేయలేదన్నారు. పోలీసు ఇంటెలిజెన్స్ అధికారిని పట్టుకొని సీపీకి అప్పజెప్పినట్లు తెలిపారు. లోపల కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ బుక్ ఫోటో తీసే ప్రయత్నం చేశారని వివరించారు. ఆ ఫోటోలన్నింటిని డిలీట్ చేయించామని ఇంద్రాసేనారెడ్డి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మోడీ భద్రత మాకు చాలా ముఖ్యం: జీవన్ రెడ్డి

కాగా.. బీజేపీ నేతల వ్యాఖ్యలపై పియూసీ చైర్మన్ జీవన్ రెడ్డి స్పందించారు. మోడీ భద్రత మాకు చాలా ముఖ్యమంటూ జీవన్ రెడ్డి వివరించారు. స్టేట్ ఇంటలిజెన్స్ పోలీసులు భద్రత కోణంలో కచ్చితంగా ఉంటారన్నారు. పీఎం మోడీతోపాటు కేంద్రమంత్రులు అందరూ ఉన్నారు.. అందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం పోలీసులపై ఉంటుందన్నారు. బీజేపీ నాయకులు పాకిస్తాన్, మతాలు అని అనేక మాటలు మాట్లాడతారన్నారు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే వాళ్ళను ఎప్పటికప్పుడు కనిపెట్టే భాద్యత ఇంటిలిజెన్స్‌కు ఉంటుందని వివరించారు. అందుకే ఇంటెలిజెన్స్ అధికారి బీజేపీ సమావేశాలకు వెళ్లారంటూ పియూసీ చైర్మన్ జీవన్ రెడ్డి తెలిపారు.

ఇంటెలిజెన్స్ వ్యవహారంపై ఆరా..

కాగా.. ఇంటలిజెన్స్ సీఐ వ్యవహారంపై పోలీస్ శాఖ ఆరా తీసింది. కేటాయించిన ప్రదేశంలో కాకుండా లోపలకి వెళ్లడంపై విచారణ జరుపుతున్నట్లు సమాచారం. మోడీ టూర్ ముగిసాక విచారణ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.