హైదరాబాదీలు పడుతోన్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు, సిగ్నల్ రహిత, మెరుగైన రవాణా వ్యవస్థను పటిష్టం చేయడానికి జీహెచ్‌ఎంసీ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా నగర వ్యాప్తంగా ఫ్లైఓవర్‌లు, అండర్‌పాస్‌లను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా నగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి తీసుకురానున్నారు. జీహెచ్‌ఎంసీ అధ్వర్యంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ (SRDP) కార్యక్రమం ద్వారా చేపట్టిన నాగోల్ ఫ్లై ఓవర్‌ను బుధవారం నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఫ్లైఓవర్‌ను రాష్ట్ర మున్సిపల్, పరిపాలన పట్టణాభివృద్ధి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించనున్నారు.
ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన 41 పనులు, మిగతా 6 పనులు ఆయా శాఖ లైన హెచ్.ఎం.డి.ఏ, ఆర్ అండ్ బి, నేషనల్ హై వే ద్వారా మొత్తం 47 పనులు చేపట్టారు. ఎస్.ఆర్.డి.పి పథకం ద్వారా చేపట్టిన పనులు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం 47 పనులలో 31 పనులు పూర్తి కాగా మరో 16 పనులు వివిధ అభివృద్ధి దశలో ఉన్నాయి. పూర్తయిన 31 పనులలో 15 ఫ్లై ఓవర్లు, 5 అండర్ పాసులు, 7 ఆర్.ఓ.బి లు / ఆర్.యు.బి లు, 1 కేబుల్ స్టాయెడ్ బ్రిడ్జి, ఒకటి పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి, ఒకటి పంజాగుట్ట వైడెనింగ్, ఒకటి ఓ.ఆర్.ఆర్ నుంచి మెదక్ రిహబిటేషన్ పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు వివిధ అభివృద్ధి దశలో కలవు.
నాగోల్ ఫ్లై ఓవర్‌కు యుటిలిటీ షిఫ్టింగ్, భూసేకరణ, ప్రాజెక్టుతో కలిపి మొత్తం రూ. 143.58 కోట్లు ఖర్చు అయింది. 990 మీటర్ల పొడవుతో 6 లైన్ల, బై డైరెక్షన్ తో దీనిని నిర్మించారు. ఈ ఫ్లైఓవర్‌తో ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ వరకు సిగ్నల్ ఫ్రీ రవాణా సదుపాయం కలగనుంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆరంఘర్, ఎల్బీనగర్ మీదుగా ఉప్పల్ వరకు అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సులభతరం అవుతుంది.
నగరంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న మాదాపూర్, గచ్చిబౌలి, ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు తీరేందుకు రెండు ఫ్లై ఓవర్లను నిర్మిస్తున్నారు. వీటిలో కొత్తగూడ ఫ్లై ఓవర్ కాగా మరొకటి శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి. ప్రస్తుతం ఈ పనులు పూర్తి దశకకు చేరుకున్నాయి. త్వరలో అందుబాటులోకి రానున్నాయి. శిల్లాలేఅవుట్ ఫ్లైఓవర్‌ను నవంబర్‌లో, కొత్తగూడ ఫ్లై ఓవర్‌ను డిసెంబర్‌లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెండు అందుబాటులోకి వస్తే నగరంలో నిర్మించిన ఫ్లైఓవర్‌ల సంఖ్య మొత్తం 18కి చేరుతుంది.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..