మూడు రోజులలో రైతు బంధు (Rythu Bandhu) ద్వారా రైతుల ఖాతాల్లో రూ.3133.21 కోట్లు జమ చేసినట్లు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. మూడో రోజు రూ.1312.46 కోట్లు జమ చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో రైతుల కష్టాలు తెలిసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అని వ్యాఖ్యానించారు. వ్యవసాయ రంగానికి అత్యధిక బడ్జెట్ కేటాయిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ(Telangana) అని చెప్పారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలలో అత్యధిక శాతం మంది ఉపాధి పొందుతున్న వ్యవసాయ రంగానికి చేయూత ఇవ్వాలన్న ముందుచూపు కేంద్రంలోని బీజేపీ పాలకులకు లేదని మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ అమ్ముతూ ఆఖరుకు ఆహారరంగాన్ని కూడా కార్పోరేట్ల పరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. వ్యవసాయ చట్టాలపై రైతులు పట్టుదలతో పోరాడారన్న మంత్రి.. వారి ఆందోళనలతో కేంద్రం వెనక్కు తగ్గి, చట్టాలను రద్దు చేసినట్లు చెప్పారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన రాష్ట్రంలోని అర్హులైన రైతులందరికీ ఎందుకు రాదని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.
వరి ధాన్యం కొనుగోలు విషయంలో నిబంధనలు మార్చి కేంద్రం రైతుల గొంతుకోయాలని చూస్తోంది. మోదీ పాలనలో దేశం అన్ని రంగాలలో దివాళా తీసింది. తెలంగాణకు ఎనిమిదేళ్లలో కేంద్రం ఏమిచ్చింది?. బీజేపీ కార్యవర్గ సమావేశాలకు వస్తున్న ప్రధానమంత్రి మోడీ దీనికి సమాధానం చెప్పాలి. ఏ రంగంలో విజయం సాధించారని విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారు?. వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రైతుల నడ్డి విరిచినందుకు విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారా?. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని పేదలను మోసం చేసినందుకు, నల్లధనం తెస్తానని దేశ ప్రజలను మోసం చేసినందుకు, నోట్ల రద్దుతో సామాన్యుల నడ్డి విరిచినందుకు విజయ్ సంకల్ప్ సభ నిర్వహిస్తున్నారా. ?
– నిరంజన్ రెడ్డి, తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి
ఉపాధిహామీకి వ్యవసాయ రంగాన్ని అనుసంధానం చేస్తానని చెప్పి, మోసం చేశారని మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తామని చెప్పి, ఆ హామీని విస్మరించారన్నారు. ఎరువుల ధరలు పెంచి, సబ్సిడీలను ఎత్తేసి రైతుల నెత్తిన భారం మోపారని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలను ఎనిమిదేళ్లలో రెట్టింపు చేశారని ధ్వజమెత్తారు. దేశం ప్రజలు ప్రశ్నిస్తున్న వాటికి ప్రధాని మోదీ సమాధానాలు చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు.
తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..