ఇప్పుడు ఉన్న సచివాలయం స్థానంలోనే కొత్త సచివాలయ నిర్మాణ పనుల్ని చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మొత్తం 4 నుంచి 5 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వచ్చే విధంగా.. కొత్త సచివాలయానికి డిజైన్ ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ ఏర్పాటైన తరువాత అధికారం చేపట్టిన కేసీఆర్ సర్కారు కొత్త సచివాలయాన్ని నిర్మించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇప్పుడున్న సచివాలయం స్థానంలోనే కొత్తది నిర్మించాలనే ప్రతిపాదన మొదటి నుంచే ఉండేది. కానీ విభజన నేపథ్యంలో సచివాలయంలోని కొన్ని బ్లాకులు ఏపీ ఆధీనంలోకి వెళ్లాయి. వాటిని తమకు ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం కోరగా.. అందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించలేదు. దాంతో కొత్త సచివాలయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రాంతాలను పరిశీలించింది. అందులో భాగంగా సికింద్రాబాద్‌లోని బైసన్ పోలో గ్రౌండ్‌లో సచివాలయాన్ని నిర్మించాలని అనుకున్నారు. ఇక ఆ భూమి కేటాయింపు కోసం కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసింది. కానీ దానిపై కేంద్రం ఎటూ తేల్చలేదు. ఇక తాజాగా ఏపీలో ప్రభుత్వం మారడం.. సచివాలయ భవనాలన్నీ తెలంగాణ ప్రభుత్వ పరిధిలోకి రావడంతో అక్కడే సచివాలయాన్ని నిర్మించాలని సీఎం నిర్ణయానికి వచ్చారు. ఇక ఏడాది, ఏడాదిన్నరలోగా ఈ కొత్త సచివాలయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకయ్యే అంచనా వ్యయంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.