Telangana: గురువారమే తెలంగాణ కేబినెట్ మీటింగ్.. ప్రధానంగా ఆ విషయంపైనే చర్చ..

తెలంగాణ (Telangana) రాష్ట్ర ఖజానాకు నిధులు సమకూర్చుకోవడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2022–23 బడ్జెట్‌లో ఏకంగా రూ.45 వేల కోట్లు లోటు ఏర్పడుతోంది. దీనిని పూడ్చుకునేందుకు సర్కార్ ప్రత్యేక చర్యలు...

Telangana: గురువారమే తెలంగాణ కేబినెట్ మీటింగ్.. ప్రధానంగా ఆ విషయంపైనే చర్చ..
Cm Kcr
Ganesh Mudavath

| Edited By: Ravi Kiran

Aug 10, 2022 | 11:40 AM

తెలంగాణ (Telangana) రాష్ట్ర ఖజానాకు నిధులు సమకూర్చుకోవడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2022–23 బడ్జెట్‌లో ఏకంగా రూ.45 వేల కోట్లు లోటు ఏర్పడుతోంది. దీనిని పూడ్చుకునేందుకు సర్కార్ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ పరిస్థితుల నడుమ గురువారం(ఆగష్టు 11) తెలంగాణ కేబినెట్ (Cabinet Meeting) సమావేశం కానుంది. ఈ భేటీలో ఆదాయ వనరుల సమీకరణపైనే ప్రదాన చర్చ జరుగుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. రుణ సమీకరణలో కేంద్రం సహాయనిరాకరణ, తెలంగాణ పట్ల వివక్షపై చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఏర్పాటైన సబ్‌కమిటీ సిఫార్సులను కేబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. ప్రజలపై ఎక్కువగా భారం పడకుండా ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ల పేరిట తీసుకునే రుణాలకు ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీని రాష్ట్ర అప్పుల కింద లెక్కగడతామని కేంద్రం ఇటీవల ప్రకటించింది. ఫలితంగా ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిపై ప్రభావం పడుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది.

గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద కేంద్ర సాయం అంచనాల్లో రూ.18 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లు లోటు ఏర్పడుతోందని అంచనా. కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటా పెంచామంటున్నప్పటికీ.. పథకాలకు కోతలతో గతంలో కంటే తక్కువగా నిధులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆగస్టు 15 నుంచి పది లక్షల కొత్త పింఛన్లు ఇస్తుండటంతో రాష్ట్ర ఖజానాపై ఆర్థికంగా భారం పడనుంది. రూ.లక్ష వరకు రుణమాఫీ, నిర్మాణ వ్యయం, రుణాల అసలు, వడ్డీ చెల్లింపులు, వరద నష్టం, ప్రాజెక్టుల మరమ్మతులు వంటివాటికి నిధుల అవసరం భారీగా పెరగనుంది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి కాగ్‌ విడుదల చేసిన గణాంకాల్లో గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ 6 శాతం, కేంద్ర పన్నుల్లో వాటా 5 శాతం మేర మాత్రమే వచ్చాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం రూ.48,724.12 కోట్లు సమీకరించుకోవాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఇప్పటివరకు రూ.14,500 కోట్లు ఆర్‌బీఐ నుంచి సమకూర్చుకుంది. మరో రూ.10 వేల కోట్ల రుణ వెసులుబాటుకు కేంద్రం అంగీకారం తెలిపింది. మరో రూ.25 వేల కోట్లను బహిరంగ మార్కెట్‌ నుంచి రుణాలనే సేకరించాల్సి ఉంది. రాష్ట్రంలో ఇసుక అమ్మకాలు, మైనింగ్‌ రాయల్టీ పెంపు, ఎల్‌ఆర్‌ఎస్‌ అమలు, పన్ను లీకేజీలు, రాజీవ్‌ స్వగృహ ఇండ్లు, నిరుపయోగ భూముల అమ్మకాలను అరికట్టడం వంటి అంశాలపై ప్రభుత్వం ఫోకస్‌ పెట్టనుందని అధికారవర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu