Rammohan Naidu: వీడియో గురించి మాట్లాడాలంటే మాకే సిగ్గుగా ఉంది.. ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) వీడియో వ్యవహారంపై టీడీపీ ఎంపీ రామ్మెహన్ నాయుడు స్పందించారు. గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకుంటే.. వైసీపీలోని సగం మంది నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాధవ్‌ను...
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) వీడియో వ్యవహారంపై టీడీపీ ఎంపీ రామ్మెహన్ నాయుడు స్పందించారు. గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకుంటే.. వైసీపీలోని సగం మంది నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాధవ్‌ను కాపాడేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అతనిపై చర్యలు తీసుకోవడానికి వైసీపీ (YCP) ఎందుకు వెనకడుగు వేస్తోందని ప్రశ్నించారు. ఆయనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. గోరంట్ల మాధవ్ ను వెంటనే బర్తరఫ్ చేయిస్తామని చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఇప్పుడు ఆ విషయాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతల్లో చాలా మందిపై అత్యాచార కేసులు ఉన్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ కు ఎప్పుడూ రాజకీయమే ముఖ్యం గానీ.. ప్రజలు, మహిళల ప్రయోజనాలు కాదనే విషయం ఈ ఘటనతో అర్థమవుతోందని పేర్కొన్నారు. మాధవ్‌పై చర్యలు తీసుకుంటే వైసీపీ సగం ఖాళీ అవుతుందన్న విషయాన్ని గ్రహించి, ఆ విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో వ్యవహారంపై మాట్లాడాలంటేనే ఏదోలా ఉందని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
గోరంట్ల మాధవ్ వీడియోపై మాట్లాడాలంటే మాకే సిగ్గనిపిస్తోంది. కానీ మహిళల రక్షణ, పార్లమెంట్ గౌరవం కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇలాంటి వీడియోల ద్వారా దేశ ప్రజలకు పార్లమెంట్ పై ఉన్న నమ్మకం దిగజరిపోతుంది. అందుకే ఈ విషయంపై స్పీకర్‌కు లేఖ రాశాం. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరాం.
– ఎంపీ రామ్మోహన్ నాయుడు
కాగా.. ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై విచారణ జరుగుతోందని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. నిందితులెవరైనా సరే వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. వీడియో అసభ్యంగా ఉన్నా నాలుగు గోడల మధ్య జరిగిందని వ్యాఖ్యానించారు. మార్ఫింగ్ కాదని తేలితే కచ్చితంగా చర్యలు ఉంటాయని వెల్లడించారు. గతంలోనూ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై సజ్జల స్పందించారు. ఎంపీ వ్యవహారంపై వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ముఖ్యమంత్రి జగన్ సీరియస్‌గా తీసుకున్నారని చెప్పారు. ఎంపీని వివరణ కోరితే దాన్ని ఆయన ఖండించారని, వీడియోపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారని చెప్పారు. చట్టపరమైన విచారణ జరుగుతుందని వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయాలి..