
Talasani Srinivas Yadav Telangana Election 2023: తెలంగాణ రాజకీయాల్లో కీలక నేత.. అలాగే హైదరాబాద్ రాజకీయ నాయకుల్లో ప్రముఖుడు. బీసీ యాదవ సామజిక వర్గానికి చెందిన ఈయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు కేసీఆర్ కేబినేట్‌లో మంత్రి పదవిని దక్కించుకున్నారు. సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక శాఖ మంత్రిగా పని చేస్తోన్న ఈ బీసీ నేత.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు 2023లో సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఇంతకీ ఆయనెవరో ఈపాటికి మీకే అర్ధమై ఉంటుంది. మన తలసాని శ్రీనివాస్ యాదవ్.
అక్టోబర్ 6,1965న జన్మించిన తలసాని శ్రీనివాస్ యాదవ్.. టీఆర్ఎస్(ప్రస్తుతం బీఆర్ఎస్) నాయకుల్లో ప్రముఖుడు. అలాగే హైదరాబాద్ రాజకీయ నేతల్లో ముఖ్యుడు. సనత్‌నగర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న తలసాని.. గతంలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. రాజకీయాల్లో ఆరితేరిన తలసాని శ్రీనివాస్ యదవ్.. మొదటిగా టీడీపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీకి వీరవిధేయుడిగా ఉన్న తలసాని.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సమయంలోనూ అదే పార్టీలో కొనసాగారు. 2014లోనూ సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత రాజకీయ సమీకరణాలు మారడంతో కొద్దిరోజులకే టీఆర్ఎస్(ప్రస్తుతం బీఆర్ఎస్) తీర్ధాన్ని పుచ్చుకున్నారు. ఇక అప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఎదుగుతూ వచ్చారు. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో సనత్‌నగర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు.
1986లో మోండా డివిజన్ నుంచి మోండా మార్కెట్ కార్పొరేటర్‌గా పోటీ చేశారు తలసాని. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి మేరీ రవీంద్రనాథ్‌ను ఓడించి ఎంఎల్‌ఎగా మొదటిసారి గెలిపొందారాయన. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి మరోసారి గెలిచి.. మంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి టి. పద్మారావు గౌడ్ చేతిలో ఓడిపోయారు తలసాని. ఇక 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆ తర్వాత రాజకీయ సమీకరణాలు మారడంతో కొద్దిరోజులకే టీఆర్ఎస్(ప్రస్తుతం బీఆర్ఎస్) తీర్ధాన్ని పుచ్చుకున్నారు. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కేబినేట్‌లో సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు తలసాని శ్రీనివాస్ యాదవ్. అప్పుడు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు చేప పిల్లలు, గొర్రెల పంపిణీలాంటి పధకాలకు శ్రీకారం చుట్టి.. లబ్దిదారులకు మంచి చేకూరేలా కృషి చేశారు. ఇక ఆయన పనితీరును మెచ్చిన కేసీఆర్ రెండో మంత్రివర్గంలోనూ మరోమారు మంత్రి పదవిని కట్టబెట్టారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ హయాంలో పర్యాటక, కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు తలసాని శ్రీనివాస్ యాదవ్.
సనత్ నగర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి భారీ మెజార్టీతో గెలుస్తారని సర్వేలు చెబుతున్నాయి. ఆ నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ.. తలసాని విజయం ఖాయమని తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ ఎన్నికల వార్తల కోసం..