
నట శేఖరుడు, సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. బుధవారం సాయంత్రం అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. అశేష అభిమానుల కడసారి వీడ్కోలు నడుమ హైదరాబాద్ లోని పద్మాలయ స్టూడియోస్ నుంచి ఫిల్‌నగర్‌లోని మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర సాగింది. పోలీసుల అధికారిక వందనంలో కృష్ణను వీడ్కోలు పలికారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన శోభయాత్రకు పెద్ద ఎత్తున అభిమానులు పొటెత్తారు. తమ అభిమాన హీరోను కడసారి చూసేందుకు జనాలు పోటేత్తారు.
కృష్ణ అంతిమయాత్రకు అభిమాన లోకం పెద్ద ఎత్తున తరలివచ్చింది. యావత్ సినీ ప్రపంచం కడసారి చూపులకు కదిలివచ్చింది. బరువెక్కిన హృదయాలు.. కనురెప్పల నిండా నిండిన నీళ్లతో తెలుగు సమాజం ఘట్టమనేని కృష్ణకు వీడ్కోలు పలికింది. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అధికార లాంఛనలతో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. పద్మాలయ స్టూడియో నుంచి మహాప్రస్థానం వరకు సాగిన ర్యాలీకి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సినీ తారలంతా రోడ్డు మార్గాన నడుస్తూ వెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు.
అంతకు ముందు పద్మాలయ స్టూడియోలో కృష్ణ పార్ధివ దేహం ఉంచగా.. అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి కడసారి నివాళి అర్పించారు. ఏపీ సీఎం జగన్, ఎమ్మెల్యే బాలకృష్ణ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సహా సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణకు కడసారి నివాళి అర్పించారు. భయాలకు జడవలేదు, సాహసమే ఊపిరిగా సాగింది కృష్ణ సినీ, రాజకీయ జీవితం. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని సినీతారలంతా కన్నీటి పర్యంతం అయ్యారు. అంతా కలిసి మహేశ్‌బాబును ఓదార్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..