
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు నిత్యం ఎంత రద్దీగా ఉంటుందో చెప్పక్కర్లేదు. ప్రతి రోజూ వేలాది మంది ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి తమ రాకపోకలు సాగిస్తుంటారు. అందుకే ఆ ప్రాంతం మొత్తం వచ్చే పోయే ప్రయాణికులతో సందడిగా ఉంటుంది. రోజూ అందరిలాగే ఓ వ్యక్తి సైతం ఎంతో ప్రొఫెషనల్‌గా రెడీ అయ్యి దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అతని ప్రవర్తన పై అనుమానం వచ్చిన అధికారులు.. అతని లగేజీ చెక్ చేయగా..అసలు విషయం బయటపడింది. విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా గుట్టు రట్టయింది. తన బ్యాగులోని బోల్టులు.. స్క్రూలుగా పసిడిని మార్చి తరలిస్తున్న అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీ చెక్ చేయగా అతని వద్ద 454 గ్రాముల పసిడిని గుర్తించారు. పట్టుబడిన బంగారం ధర రూ. 21.20 లక్షల విలువ ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అధిక లాభాలు వస్తుండడంతో అక్రమార్కులు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడు తన బ్యాగ్ లో స్క్రూలు, కడ్డీల్లా బంగారం అమర్చినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తింంచారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రోజు రోజూకీ బంగారం అక్రమ రవాణా పెరుగుతుండడంతో అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే అనేకసార్లు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఎయిర్ పోర్టులో నిఘా పెట్టిన అధికారులు అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ప్రయాణికుల నుంచి గోల్డ్ సీజ్ చేస్తున్నారు.