తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక పోలింగ్ మాత్రమే జరగాల్సి ఉంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. ఇందులో భాగంగా సభలు, సమావేశాలు, రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఒక్కొక్కరూ ఒక్కో రకమైన ప్రవర్తనను కనబరుస్తూ ఉంటారు. కొందరు బైక్‌లపై నిలబడి ర్యాలీ చేస్తారు. మరి కొందరు కార్లపై నిలబడి ప్రదర్శనలు చేస్తూ, చూస్తూ ఉంటారు. మరి కొన్ని చోట్ల అయితే మేడలపైకి ఎక్కి ప్రచారంలో నాయకుడి ప్రసంగాన్ని వింటూ ఉంటారు. మరి కొందరు విద్యుత్ స్తంభాలు ఎక్కి, సెల్‌ఫోన్ టవర్లు ఎక్కి చూస్తూ ఉంటారు.
తాజాగా ఇలాంటి సంఘటన సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో చోటు చేసుకుంది. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన విశ్వరూప మహాసభలో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రసంగిస్తుండగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. ఈ క్రమంలో ఒక యువతి పాల్పడిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. మోదీ ప్రసంగిస్తూ ఉండగా ఒక యువతి లైట్ పోల్ పైకి ఎక్కేందుకు ప్రయత్నించింది. వెంటనే ఆమెను వారించేందుకు మోదీ తన ప్రసంగాన్ని ఆపేశారు. ‘నీ బాధను తాను ఖచ్చితంగా వింటా. ఇలా చేయొద్దు’ అని సూచించారు. షాట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. దయచేసి కిందకు దిగాలని మోదీ విజ్ఞప్తి చేయడంతో ఆ యువతి కిందకు దిగింది. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
#WATCH | Secunderabad, Telangana: During PM Modi's speech at public rally, a woman climbs a light tower to speak to him, and he requests her to come down. pic.twitter.com/IlsTOBvSqA
— ANI (@ANI) November 11, 2023
ప్రధాని మోదీ సభలో ఆసక్తికరమైన దృశ్యాలు కన్పించాయి. మాదిగ సామాజిక వర్గాన్ని ఆదుకోవడానికి ప్రధాని మోదీ వచ్చారని వేదికపై తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు మందకృష్ణ మాదిగ. స్టేజ్‌పై కంటతడి పెట్టిన మందకృష్ణను హత్తుకొని ఓదార్చారు మోదీ. భుజం తట్టి నేనున్నానని ధైర్యం చెప్పారు. ప్రసంగానికి ముందు సభకు హాజరైన వాళ్లకు నమస్కారం చేశారు మోదీ.. అదే సమయంలో సభికులంతా లేచి మోదీకి ప్రతి నమస్కారం చేయాలని మంద కృష్ణ సూచించారు. దీంతో సభకు హాజరైన వాళ్లంతా మోదీకి లేచి నిలబడి నమస్కారం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.
వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని సభలో మోదీ స్పష్టం చేశారు. త్వరలో వర్గీకరణ కోసం కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మాదిగ సామాజికవర్గ పోరాటానికి పూర్తి సంఘీభావం ప్రకటించారు. దీంతో తమ సెల్‌ఫోన్ల టార్చ్‌లైట్లను ఆన్ చేసి జనం ధన్యవాదాలు తెలిపారు. మోదీకి సంఘీభావం ప్రకటించారు. సభ ముగిసిన తరువాత కూడా మందకృష్ణ పోరాట పటిమను మెచ్చుకున్నారు మోదీ. వేదికపై అప్యాయంగా ఆయన్ను అక్కున చేర్చుకున్నారు. మందకృష్ణ తన తమ్ముడి లాంటి వాడన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..