( Yellender, TV9 Reporter, Hyderabad )
Railway platform ticket price : దేశంలో కొన్ని రోజుల క్రితం కరోనా సెకండ్ వేవ్ విజృంభించింది. దీంతో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు విధించారు. లాక్‌డౌన్, కర్ఫ్యూ లాంటి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టడంతో అన్ని చోట్ల సడలింపులు చేపడుతూ ఆయా ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి. నిబంధనలతోపాటు.. రవాణాపై ఉన్న ఆంక్షలను సైతం ఎత్తేశారు. రైల్వే, బస్, మెట్రో, ఎంఎంటీఎస్ సర్వీసుల సేవలు సైతం అందుబాటులోకి వచ్చాయి. దీంతో లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన వారు ఇప్పుడు దూర ప్రాంతాలకు సైతం ప్రయాణాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో దూర ప్రాంతాల నుంచి వస్తున్న తమ బంధువులను స్టేషన్ నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు, శుభకార్యాలకు సొంతూర్లకు వెళ్తున్న భార్య, పిల్లలను రైలు ఎక్కించేందుకు వస్తున్న వారు పెరిగిన ఫ్లాట్‌ఫాం టికెట్ ధరలతో నానా ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల్లో ఇంటి నుంచి తక్కువ ధరతో వస్తున్నప్పటికీ.. స్టేషన్‌లోపలికి వెళ్లేందుకు వెనకంజ వేయాల్సిన పరిస్థితి నెలకొందంటూ వాపోతున్నారు. కరోనా దృష్ట్యా పండుగ వేళల్లో రైళ్లలో, స్టేషన్లలో రద్దీ ఎక్కువగా ఉంటుందని ఆ సమయానికి తగిన విధంగా 10 రూపాయలు ఉన్న ప్లాట్ ఫామ్ టికెట్ ధరను ముందు 30 రూపాయలకు పెంచారు. ఆ తర్వాత కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రైల్వే స్టేషన్‌లోకి వచ్చే వారి సంఖ్యను తగ్గించేందుకు వీలుగా రైల్వే అధికారులు ప్లాట్ ఫామ్ టికెట్ ధరను అమాంతం రూ. 50కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ టికెట్ ధర 50 రూపాయలు ఉన్నట్టు ప్రయాణికులు చెబుతున్నారు. కరోనా ఉదృతి తగ్గిన నేపథ్యంలో ప్లాట్‌ఫాం టికెట్ల ధరను తగ్గించాలని కోరుతున్నారు. అయితే దీనిపై.. అధికారులు మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు ప్రయాణికులతో వచ్చే వారిని నివారించేందుకు ఇలా టికెట్ ధరను పెంచినట్లు పేర్కొంటున్నారు. పరిస్థితులు అనుకూలంగా మారిన అనంతరం మళ్లీ ప్లాట్ ఫామ్ టికెట్ ధర తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.
Also Read: