Niloufer Kidnap Case: నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. 6 గంటల్లోనే తల్లిఒడికి బిడ్డ! అసలేం జరిగిందంటే

|

Nov 24, 2024 | 4:41 PM

హైద‌రాబాద్ నీలోఫ‌ర్‌ ఆస్పత్రిలో శనివారం కిడ్నాపైన శిశువును పోలీసులు ఎట్టకేలకు తల్లి ఒడికి చేర్చారు. బిడ్డను ఎత్తుకెళ్లిన కిలాడి మహిళను పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా గుర్తించగలిగారు. కర్నూలులో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద ఈ శిశువుతో పాటు మరో శిశువు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు..

Niloufer Kidnap Case: నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. 6 గంటల్లోనే తల్లిఒడికి బిడ్డ! అసలేం జరిగిందంటే
Niloufer Hospital Kidnap Case
Follow us on

హైద‌రాబాద్, నవంబర్‌ 24: హైద‌రాబాద్ నీలోఫ‌ర్‌ ఆస్పత్రిలో తరచూ చిన్నారులు అపహరణకు గురవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో సంఘటన చోటు చేసుకుంది. ఓ గుర్తు తెలియని మహిళ నెల రోజుల శిశువును అపహరించింది. దవాఖాన సిబ్బందిని చెప్పి శిశువును కిడ్నాప్ చేసింది. అయితే ఈ శిశువు క‌ర్నూల్‌లో ప్రత్యక్షమవడం విశేషం. శిశువు కిడ్నాపైన కేవ‌లం ఆరు గంట‌ల్లోనే పోలీసులు ఈ కేసును చేధించారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే..

జహీరాబాద్‌కు చెందిన హసీనా బేగం, గఫార్‌ దంపతులకు చెందిన నెలరోజుల పసికందు అనారోగ్యం బారిన పడటంతో అక్టోబర్‌ 29న హైదరాబాద్‌లోని నీలోఫర్‌ దవాఖానలో అడ్మిట్‌ చేశారు. అప్పటి నుంచి చిన్నారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో శిశువు కోలుకోవడంతో శనివారం ఆస్పత్రి వైద్యులు డిశ్చార్జి చేశారు. అనంతరం దవాఖాన పాత భవనంలోని ఆరోగ్యశ్రీ కౌంటర్‌ వద్ద రవాణా ఖర్చులు తీసుకుని ఫొటో దిగుతున్నారు. ఆ పక్కనే ఉన్న గుర్తుతెలియని మహిళ వచ్చి చిన్నారిని తనకు ఇచ్చి ఫొటో దిగాలని చిన్నారి తల్లిదండ్రులకు సూచించింది. చిన్నారి తల్లి హసీనాబేగం ఆమె మాటలు నమ్మి.. బిడ్డను ఆ మహిళకు ఇచ్చింది. ఫొటో దిగిన తర్వాత చూస్తే అక్కడ సదరు మహిళ కనిపించలేదు. పరుగు పరుగున దవాఖాన మొత్తం కలియతిరిగింది. అయినా బిడ్డను ఎత్తుకెళ్లిన మహిళ కనిపించలేదు.

దీంతో బావురుమంటూ తల్లి హసీనాబేగం నాంపల్లి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఆస్పత్రిలోని సీసీటీవీ ఫుటేజీ సహాయంలో బిడ్డ ఆచూకీ కనుగొన్నారు. వికారాబాద్‌లోని పర్గిలో పసికందును కిడ్నాప్ చేసిన మహిళను, ఆమె సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద శిశువుతో పాటు మరో శిశువు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి నగరానికి తరలించారు. అనంతరం అపహరణకు గురైన పసికందును బిడ్డ తల్లికి అప్పగించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.