
తెలంగాణలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు రవాణా శాఖ ఎన్ఫోర్స్‌మెంట్ వ్యవస్థను మరింత కఠినతరం చేసింది. జిల్లా స్థాయిలో 33 ప్రత్యేక బృందాలు, రాష్ట్ర స్థాయిలో 3 ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కొత్త ప్లాన్ ఆఫ్ యాక్షన్ అమలులోకి తెచ్చింది. రోడ్డు నిబంధనలు తరచూ ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తప్పనిసరి చేసేలా రవాణా శాఖ సిద్ధమైంది.
ఓవర్‌లోడింగ్ లారీలు, బస్సులు, మినరల్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు, సాండ్, ఫ్లైయాష్, స్టోన్, బిల్డింగ్ మెటీరియల్ వాహనాలు, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేని వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. అవసరమైతే వాహనాలను సీజ్ చేసే వరకు చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఒక్కో బృందంలో డీటీసీ, ఎంవీఐ, ఏఎంవీఐతో పాటు అనుభవజ్ఞులైన సిబ్బందిని నియమించనున్నారు. రవాణా శాఖ సిబ్బందికి బ్యాచ్‌ల వారీగా శిక్షణ ఇచ్చి ఎన్ఫోర్స్‌మెంట్ మరింత మందగమనం లేకుండా చూసేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఎన్ఫోర్స్‌మెంట్ బృందాలు ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్ల వంటి వాహనాలను కారణం లేకుండా వేధించరాదని మంత్రి ఆదేశించారు. బస్సుల్లో అనధికార మార్పులు, సీట్ల మార్పు, అత్యవసర నిష్క్రమణ చోట్ల అడ్డంకులు వంటి ఉల్లంఘనలపై తప్పనిసరిగా కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు.
ఈ జిల్లాల్లోని ఆర్టీవోలు వారానికి కనీసం రెండు సార్లు అంతర్‌రాష్ట్ర కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులను తనిఖీ చేయాలని ఆదేశించారు. ఫిట్నెస్ గడువు ముగిసిన వాహనాలు, అతివేగం, బహుళ ఈ–చలాన్స్ ఉన్న వాహనాలను రోడ్డు మీద గనుక గుర్తిస్తే నేరుగా సీజ్ చేయనున్నట్లు హెచ్చరించారు.
గత వారం చెవెళ్లలో జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో ఒక వారం వ్యవధిలో 2,576 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు మంత్రి తెలిపారు. అందులో 352 ఓవర్‌లోడింగ్ లారీలు, 43 బస్సులపై ప్రత్యేక కేసులు ఉన్నాయి.
మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు మహిళా ఆటో అనుమతులు ఇవ్వడంపై శాఖ అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. రాబోయే రోడ్ సేఫ్టీ మంత్‌లో ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు విద్యార్థుల వ్యాసరచన పోటీలు, ఇన్నోవేటివ్ ప్రోగ్రాంలు, ప్రతి జిల్లాలో చిల్డ్రన్స్ అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్‌లెస్ ట్రీట్మెంట్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నది కూడా సూచనలలో భాగమే.