Hyderabad News : త్వరలో హైదరాబాద్‌కి కొత్త కలెక్టర్ రానున్నట్లు సమాచారం. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి బుధవారం రిలీవ్ అవుతున్నట్లు తెలుస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో రెండు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించవచ్చని సమాచారం. హైదరాబాద్ శ్వేతామహంతి విదేశాలకు వెళ్లడానికి ప్రభుత్వ అనుమతి కోసం అప్లై చేశారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివేందుకు గతంలోనే దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని రోజులుగా ఆన్‌లైన్ తరగతులకు కూడా హాజరవుతున్నారు. అయితే ఈ నెల 12న అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. శ్వేతామహంతి కొన్ని నెలలుగా మేడ్చల్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు.
గతంలో వనపర్తి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆమె పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు కూడా బోధించారు. బదిలీపై హైదరాబాద్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి సిన్సియర్ కలెక్టర్‌గా పేరు సంపాదించుకుంది. 2011 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శ్వేతా మహంతి వనపర్తి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడే మంచి పేరు తెచ్చుకున్నారు. ఇంజనీరింగ్ చేసి మంచి ఉద్యోగం సాధించి ఆత్మసంతృప్తి కలగక సివిల్స్ వైపు అడుగులు వేసి రెండో ప్రయత్నంలో ఏకంగా ఆల్‌ఇండియా రెండో ర్యాంకు సాధించి కలెక్టర్ అయ్యారు ఆమె.
ఒడిశా రాష్ట్రానికి చెందిన ఈ యువ ఐఏఎస్ తండ్రి ప్రసన్నకుమార్ మహంతి కూడా ఐఏఎస్ ఆఫీసర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రెటరీగా పనిచేసి రిటైరయ్యారు. విద్యాభ్యాసం హైదరాబాద్‌లోనే సాగింది. చదువుకునే రోజుల నుంచే ఎన్‌జీవోలతో కలిసి పనిచేసిన ఆమె ప్రజాసేవ లక్ష్యంగా కలెక్టర్ అయినట్లు పలు సంధర్భాల్లో వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పరిపాలనలో కలెక్టర్ల ప్రాధాన్యత పెంచేందుకు అడుగులు వేస్తుంది. ఇప్పటికే యువ కలెక్టర్లను అందుకు తగ్గట్లుగా ముఖ్యమైన ప్రాంతాలకు బదీలీలు చేస్తుంది.