
హైదరాబాద్‌లో పలువురు నేరస్థులు పార్క్‌ను క్లీన్ చేశారు.. చెత్తను ఊడ్చి.. ఎత్తి పోశారు.. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని యూసఫ్‌గూడ కృష్ణ కాంత్ పార్క్ (Krishna Kanth Park) లో చోటు చేసుకుంది. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నపాటి గొడవలు, ప్రజా శాంతిభద్రతకు భంగం కలిగించే చర్యలు, అసాంఘిక ప్రవర్తన.. తదితర కేసుల్లో నిందితులుగా ఉన్న 35 మందిపై పోలీసులు పిట్టీ కేసులు నమోదు చేశారు. వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
కేసుల వివరాలు పరిశీలించిన నాంపల్లి కోర్టు, వీరికి జైలు శిక్షకు బదులుగా సమాజ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక ప్రత్యేక తీర్పును ఇచ్చింది. నిందితులంతా సమాజ సేవ చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు మధురానగర్ పోలీసులు 35 మందిని కృష్ణకాంత్ పార్క్‌కు తరలించారు. అక్కడ పార్క్ పరిశుభ్రత, చెత్త తొలగింపు, మొక్కలకు నీళ్లు పోయడం, పార్క్‌లోకి వచ్చే సందర్శకులకు క్రమశిక్షణ పాటించేలా సూచనలు ఇవ్వడం వంటి సేవల్లో ఉంచారు.. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సమాజ సేవ కొనసాగగా, పోలీసులు ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించారు.
పట్టణంలో శాంతిభద్రతలు కాపాడటమే కాకుండా, నిందితులకు సామాజిక బాధ్యతను గుర్తు చేయడంలో ఇటువంటి చర్యలు ప్రయోజనకరమని పోలీసుల అభిప్రాయ పడ్డారు.. చిన్నపాటి నేరాలకు పాల్పడిన వారు సమాజ సేవ చేస్తే తమ తప్పు గ్రహించే అవకాశం ఎక్కువగా ఉంటుందని, భవిష్యత్తులో ఇలాంటి ప్రవర్తనకు దూరంగా ఉంటారని అధికారులు భావిస్తున్నారు. నగర పోలీసుల ఈ వినూత్న పద్ధతికి స్థానికులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
పార్క్‌లో సమాజ సేవ చేస్తూ ప్రజల ముందే పని చేయడం, తమ చేసిన తప్పుకు ప్రత్యక్ష ప్రాయశ్చిత్తం చేసినట్లేనని కొందరు నిందితులు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. యువతలో పెరుగుతున్న ఆకస్మిక గొడవలు, అసాంఘిక కార్యకలాపాలు నియంత్రించడంలో ఇటువంటి కౌన్సెలింగ్ తరహా శిక్షా విధానాలు మరింత ఫలితాన్నిస్తాయని పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..