భార్యాభర్తలిద్దరూ లంచావతారాలే..!
యాభై రోజుల వ్యవధిలో భార్యాభర్తలిద్దరూ అవినీతి నిరోధక శాఖ చేతికి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వైనమిది. భారీ మొత్తం అవినీతి సొమ్ముతో 50 రోజుల కిందట కేశంపేట ఎమ్మార్వో లావణ్య పట్టుబడ్డ ఘటన తెలంగాణలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తాజాగా ఆమె భర్త, జీహెచ్‌ఎంసీలో సూపరింటెండ్‌గా పనిచేసే వెంకటేశ్వర నాయక్ ఏసీబీ అధికారుల చేతికి చిక్కారు. వంగాల రణధీర్ అనే వ్యక్తికి ఆర్‌డీఎంఏ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించేందుకు వెంకటేశ్వర నాయక్ లంచం తీసుకున్నారు. రూ.2.5 లక్షలు […]

యాభై రోజుల వ్యవధిలో భార్యాభర్తలిద్దరూ అవినీతి నిరోధక శాఖ చేతికి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వైనమిది. భారీ మొత్తం అవినీతి సొమ్ముతో 50 రోజుల కిందట కేశంపేట ఎమ్మార్వో లావణ్య పట్టుబడ్డ ఘటన తెలంగాణలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తాజాగా ఆమె భర్త, జీహెచ్‌ఎంసీలో సూపరింటెండ్‌గా పనిచేసే వెంకటేశ్వర నాయక్ ఏసీబీ అధికారుల చేతికి చిక్కారు. వంగాల రణధీర్ అనే వ్యక్తికి ఆర్‌డీఎంఏ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించేందుకు వెంకటేశ్వర నాయక్ లంచం తీసుకున్నారు. రూ.2.5 లక్షలు లంచం సొమ్మును తన బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేయించుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బాధితుడు రూ.2.5 లక్షలు చెల్లించాక మరో రూ.40 వేలు అదనంగా డిమాండ్ చేయడంతో చేసేదేంలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వెంకటేశ్వర నాయక్‌పై నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు ఆయణ్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడితో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన కె ప్రకాశ్ అనే ఉద్యోగిని కూడా అధికారులు అరెస్టు చేశారు. నిందితులిద్దరినీ శనివారం (ఆగస్టు 31) ఏసీబీ కోర్టులో హాజరుపరిచి.. ఆ తర్వాత రిమాండ్‌కు తరలించారు.
రంగారెడ్డి జిల్లా కేశంపేట ఎమ్మార్వోగా పనిచేసిన లావణ్య అవినీతి అక్రమాలకు పాల్పడి రూ.93 లక్షల రూపాయలతో జులై 10న ఏసీబీ అధికారులకు పట్టబడ్డారు. అవినీతి సొమ్మును ఎక్కడ దాయాలో తెలియక ఇంట్లోనే ఉంచినట్లు తేలడంతో ఆ డబ్బును ఏసీబీ అధికారులు సీజ్ చేసి.. ఆమెతో పాటు కొందుర్గు వీఆర్వో అనంతయ్యను అరెస్ట్ చేశారు. ఓ రైతు నుంచి లంచం తీసుకుంటున్న వీఆర్వో అనంతయ్యను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో హయత్‌నగర్‌లోని ఎమ్మార్వో లావణ్య ఇంట్లో సోదాలు నిర్వహించారు. సోదాల్లో భాగంగా రూ.93 లక్షల నగదు, 43 తులాల బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. ఓ వ్యక్తి ఎమ్మార్వో లావణ్య కాళ్లా వేళ్లా పడి వేడుకుంటున్నా ఆమె లంచం విషయంలో వెనక్కి తగ్గని ఉదంతానికి సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లో ఓ ప్రభుత్వ అధికారి నుంచి ఇంత మొత్తంలో అక్రమార్జనను స్వాధీనం చేసుకోవడం గత పదేళ్లలో ఇదే అత్యధికమని ఏసీబీ అధికారులు చెప్పడం గమనార్హం. రెండేళ్ల కిందటే ఉత్తమ తహసీల్దార్‌గా ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్న ఎమ్మార్వో లావణ్య.. అవినీతి మరక అంటించుకొని పరువు పోగొట్టుకోగా.. రోజుల వ్యవధిలోనే ఆమె భర్త కూడా ఏసీబీకి పట్టుబడటం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.