Hyderabad: రోజూ 5 కోట్ల నుంచి 10 కోట్లు చూడందే నిద్రపోడు ఈ శ్రీనివాసరావు.. మాములోడు కాదు
సైబర్ చీటర్ శ్రీనివాసరావును పట్టుకున్నారు ముంబై పోలీసులు. మోసాలకు పాల్పడుతూ రోజు 5 కోట్ల నుంచి 10 కోట్లు సంపాదిస్తున్నాడు కేటుగాడు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి..

వీడు మాములోడు కాదు…! నిత్యం కోట్ల రూపాయలు కళ్ల చూడందే నిద్రపోడట..! ఇదీ మరెవ్వరో కాదు..ముంబై పోలీసులు చెబుతున్న కథనం. ఇలాంటి దొంగను తాము ఇంతవరకూ చూడలేదంటున్నారు. హైలెవల్ టెక్నిక్‌తో నాలుగైదు రాష్ట్రాల పోలీసులనే ముప్పుతిప్పులు పెట్టిన ఘనుడు. పైన ఫోటోలో ముసుగుతో కనిపిస్తున్న వ్యక్తే దాడి శ్రీనివాసరావు. ఇంటర్ చదివిన ఇతగాడు సైబర్ నేరాల్లో ఆరితేరాడు. గజదొంగగా మారాడు. కర్నాటక, ముంబై, తమిళనాడు, కేరళ పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. ఒకప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేసిన దాడి శ్రీనివాసరావు, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓ గ్యాంగ్‌నే ఏర్పాటు చేసి హైలెవెల్ ఛీటర్‌గా ఎదిగాడు. నిత్యం 5 కోట్ల రూపాయల నుంచి పదికోట్ల వరకూ సంపాదించందే అతడు నిద్రకూడా పోడట.
ముంబైలో పుణె, పర్బణి ఏరియాలో ఈ తరహా కేసులు క్రైమ్ బ్రాంచ్ దృష్టికి వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టిన ముంబై క్రైం బ్రాంచ్ స్పెషల్ టీమ్, డేటా సేకరించారు. హైదరాబాద్ తరహా నుంచే మోసాలు జరుగుతున్నాయని గుర్తించి, నిఘా పెట్టారు. తాజాగా హైదరాబాద్‌లోని ఓ హోటల్లో నిందితుడు శ్రీనివాస్, అతడి టీమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ముంబై తరలించారు. ఈ సైబర్ చీటర్‌ను పట్టుకోవడానికి హైలెవల్ ఐటీ ఎక్స్‌పర్ట్స్‌ను ఉపయోగించామన్నారు ముంబై పోలీసులు.
శ్రీనివాసరావు అండ్ ముఠా ఎక్కువగా మహిళలనే లక్ష్యంగా చేసుకొని కొరియర్‌లో డ్రగ్స్ , ఆయుధాలు దొరికాయని చెప్పి భయపెడతారు. అయితే ఆ కొరియర్ తమకు సంబంధం లేదని చెబితే, అది నిర్థారించాల్సింది తామని, వెంటనే బ్యాంక్, లేదా ఆదాయపన్ను వివరాలు పంపాలని డిమాండ్ చేస్తారు. అవి చూసిన తర్వాతే కొరియర్ గురించి తేలుస్తామని బురిడీ కొడతారు. నకిలీ పోలీస్ అవతారం ఎత్తి, పోలీస్ యూనిఫాంలోనే బాధితులకు ఫోన్ కాల్ చేసి బెదిరిస్తున్నారు శ్రీనివాస్ అండ్ గ్యాంగ్. అంతేకాదు ఎనీడెస్క్ లాంటి యాప్‌ను ఉపయోగించి బాధితుల ఫోన్లను నియంత్రణలోకి తీసుకొని వారి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును దోచుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఇలా వేలాది మందిని మోసం చేసింది శ్రీనివాసరావు ముఠా. నిందితుల బ్యాంకు ఖాతాల్లో రోజుకు 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకూ లావాదేవీలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దోచుకున్న సొమ్మును వెంటనే క్రిప్టో కరెన్సీగా మార్చి ఓ చైనా వ్యక్తికి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. దేశవ్యాప్తంగా ఈ తరహా నేరం చేసేంందుకు పలువురు ఏజెంట్లను శ్రీనివాసరావు నియమించుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..