హైదరాబాద్, ఫిబ్రవరి07; మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం వెలుగు చూసింది.. సమతామూర్తి చిట్ఫండ్ పేరుతో వందల సంఖ్యలో మధ్యతరగతి ప్రజలను నిలువున మోసం చేసినటువంటి ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. మధ్యతరగతి ప్రజల వద్ద నుండి భారీగా నగదు జమచేసి అనంతరం వారికి ఇవ్వాల్సినటువంటి నగదును ఇవ్వకుండా ఎగ్గొట్టింది మాదాపూర్ కూకట్ పల్లి, ఎల్బీనగర్ లో సమతామూర్తి చిట్ఫండ్ పేరుతో బ్రాంచ్ లను ఏర్పాటు చేసి ఈ విధంగా భారీ మోసాలకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్లు.
సమతామూర్తి చిట్ఫండ్ పేరుతో తమ వద్ద నుండి భారీగా డబ్బులు తీసుకోవడమే కాకుండా తిరిగి చెల్లించాల్సినటువంటి డబ్బులు ఇవ్వటం లేదని, అడిగితే సమాధానం కూడా చెప్పడం లేదని గత నెల 13 న మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు బాధితులు.. అయినప్పటికీ పోలీసులు స్పందించలేదని అనంతరం సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతిని ఆశ్రయించగా కేసుల నమోదు చేశారని బాధితులు తెలిపారు.
సంస్థ నిర్వాహకులైన శ్రీనివాస్ రాకేష్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సంస్థ డైరెక్టర్ గణేష్, అకౌంటెంట్ జ్యోతి పరారీలో ఉన్నట్లు తెలిపారు. సంస్థ నిర్వాహకులు గతంలో చిన్న జీయర్ స్వామితో దిగిన ఫోటోలను చూపించి తమను నమ్మించి మోసం చేశారంటూ బాధితులు బోరుమంటున్నారు. వారి మాటలు, ఇలాంటి ఫేక్ ఫోటోలు చూసి మోసపోయిన బాధితులు ఒక్కొక్కరూ లక్ష రూపాయలు మొదలుకొని కోటి రూపాయల వరకు చిట్టీలు వేశామని చెప్పారు. తమకు చెక్స్ కూడా ఇచ్చారని చెప్పారు. కానీ, డబ్బులు లేకపోవడంతో అవి బౌన్స్ అయ్యాయని వాపోయారు.
ఈ విధంగా వందల సంఖ్యలో బాధితులు ఇప్పుడు రోడ్డెక్కారు. ఆయా ప్రాంతాల్లో బ్రాంచులు కూడా ఉండడం, సమతా మూర్తి పేరుతో సహా చిన్న జీయర్ స్వామి ఫోటోలను కూడా వాడుకోవడంతో కేటుగాళ్లను నమ్మి మోసపోయామంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నిందితులను అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, చిన్న జీయర్ స్వామి కి ఈ కేసుతో గానీ, సంస్థతో గానీ, ఎటువంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు. సమత మూర్తి పేరు ను చిన్న జీయర్ స్వామి ఫోటోలను నిందితులు పక్కాగా వాడుకున్నారని పోలీసులు తేల్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…