హైదరాబాద్, జులై 25: ఐఐటీ స్టూడెంట్ మిస్సింగ్ మిస్టరీ విషాదంగా మారింది. కొడుకు ఆచూకీ కోసం కంట్లో దీపాలు పెట్టుకుని తిరుగుతున్న తల్లితండ్రులకు తీరని విషాదాన్ని మిగిల్చేలా విశాఖ బీచ్ లో మునిగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కోటి ఆశల సౌధం ఆయిన కొడుకు కళ్లముందు అచేతనంగా పడి ఉండటాన్ని తల్లితండ్రులు జీర్ణించుకోలేక పోయారు. కొండంత ఎత్తైన తమ కలల సౌధం కళ్లముందు కనుమరుగౌతుండడాన్ని తట్టుకోలేక తల్లడిల్లి పోతున్నారు. మరికాసేపట్లో దొరుకుతాడని ఎదురు చూస్తున్న కొడుకు అరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీచ్ లో నిర్జీవంగా పడి ఉన్నారన్న వార్త ఆ తల్లి తండ్రులను కుదిపేసింది. పర్స్ , చెప్పులు అన్నీ గట్టున పెట్టీ బలవన్మరణానికి పాల్పడ్డ కార్తీక్ నాయక్ (21) మృత దేహాన్ని కేజీహెచ్ కు తరలించారు.
ఐఐటీ హెచ్ – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ లో చేరిన కార్తిక్ ఎనిమిది రోజుల క్రితం కళాశాల క్యాంపస్ నుంచి అదృశ్యమయ్యాడు. సంగారెడ్డి రూరల్ కంది పోలీస్ స్టేషన్ ఎస్ ఐ రాజేష్ నాయక్ టీవీ9 తో తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని వాటర్ ట్యాంక్ తండాకు చెందిన సాధారణ రైతు, చిరు వ్యాపారి అయిన ఉమ్ల నాయక్ కుమారుడు కార్తీక్ ఐఐటీ హెచ్లో బీటెక్-మెకానికల్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈనెల 17న ఐఐటీ క్యాంపస్ నుంచి అదృశ్యమయ్యాడు. 17 వ తేదీ ఉమ్లా నాయక్ ఫోన్ చేసినా కార్తీక్ లిఫ్ట్ చేయలేదు.
తర్వాత స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఒక రోజు వేచి చూసిన తల్లిదండ్రులు 19 వ తేదీ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో ముందుగా హాస్టల్ వార్డెన్ గోపీనాథ్ కు ఫిర్యాదు చేశారు. క్యాంపస్ లో కనపడడం లేదని చెప్పడం తో నేరుగా సంగారెడ్డి జిల్లా పరిధి లో ఉన్న ఐఐటి క్యాంపస్ కు వెళ్లారు. తల్లితండ్రులు రావడం, కార్తీక్ ఆచూకీ తెలియకపోవడంతో వార్డెన్ గోపీనాథ్ సంగారెడ్డి రూరల్ పోలీసు స్టేషన్లో 19 వ తేదీ నే ఫిర్యాదు చేశారు. వెంటనే ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కార్తీక్ ఆచూకీ ను గుర్తించే ప్రయత్నం చేశారు పోలీసులు. కార్తిక్ మొదట సంగారెడ్డి నుంచి లింగంపల్లికి చేరుకొని ఎంఎంటీఎస్ ట్రైన్ లో సికింద్రాబాదు రైల్వే స్టేషన్ కు వెళ్లి, అక్కడి నుంచి జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో విశాఖపట్నానికి వెళ్లినట్లు తేల్చారు.
వెంటనే తల్లితండ్రులు ఒక హెడ్ కానిస్టేబుల్ సహాయం తో సంగారెడ్డి నుంచి నేరుగా విశాఖ వచ్చారు. స్థానిక పోలీసుల సహాయంతో వెతుకులాట ను ప్రారంభించారు. సిగ్నల్స్ ఆధారంగా మొదట రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బేకరీ షాప్ కు వెళ్లి కొన్ని తిండి పదార్థాలు తీసుకున్నట్టు గుర్తించారు. తన తండ్రి బ్యాంక్ అకౌంట్ కు చెందిన నెట్ బ్యాంకింగ్ ను వాడుతూ అవసరమైన చోట డబ్బులు కడుతూ వచ్చారు. దాంతో ఆ మెసేజ్ తండ్రికి వస్తుండడం తో వెంటనే అక్కడకు వెళ్లి అరా తీస్తుంటే అక్కడ కనిపించేవాడు కాదు. ఇలా దాదాపు నాలుగు రోజులపాటు బీచ్ రోడ్ తో పాటు అనేక ప్రాంతాలలో సంచరించిన ఆనవాళ్లను సైతం సేకరించారు పోలీసులు. అయినా కార్తీక్ ను సజీవంగా పట్టుకొలేకపోయారు.
అయితే కార్తీక్ బలవన్మరణానికి కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు కార్తీక్. మొదటి సంవత్సరం బ్యాక్ లాగ్స్ ఉన్నట్టు గుర్తించారు. ఆ ఒత్తిడిలో ఉండేవాడని సహ విద్యార్థుల నుంచి సమాచారం వచ్చింది. తల్లి తండ్రులకు కూడా బ్యాక్ లాగ్స్ గురించి చెప్పి బాధపడ్డట్టు విచారణలో తేలింది. దీంతో ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆ సమయంలో సరైన కౌన్సిలింగ్ దొరకక బలవన్మరణానికి పాల్పడాలని నిర్ణయించుకునే తమ తల్లితండ్రులకు తెలియకుండా ఆత్మహత్య చేసుకోవాలని విశాఖ వచ్చి బలవన్మరణానికి పాల్పడి ఉందొచ్చన్న ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు పోలీసులు సైతం
కార్తీక్ బలవన్మరణం తో ఇష్టం లేకుండా తల్లితండ్రుల బలవంతం ,వాళ్ళ ఇష్టాయిష్టాల కోసం ఒత్తిడి పెంచుకుని, ఆ సమయంలో సరైన కౌన్సిలింగ్ లేకపోతే విద్యార్థులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఇదొక ఉదాహరణ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ తల్లితండ్రుల పుత్ర శోకం ఎవరూ తీర్చలేనిది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.