Talasani Srinivas Yadav: వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో హైదారాబాద్‌లో నాలాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గతంతో పోల్చితే ఈ ఏడాది హైదరాబాద్‌లో ముంపు ప్రభావం తగ్గుతుందని మంత్రి తలసాని తెలిపారు. వచ్చే ఏడాది వేసవి నాటికి.. హైదరాబాద్‌లో పూర్తిగా ముంపు ప్రభావం లేకుండా చేస్తామన్నారు. బుధవారం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మంత్రులు తలసాని, మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి పట్టణ ప్రగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో తలెత్తే ఇబ్బందులపైనే పట్టణ ప్రగతిలో ఎక్కువగా దృష్టి సారించినట్లు వివరించారు. ఈ నెల 3 నుంచి 15 రోజులపాటు పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో నాలా, గార్బేజి, హరితహారం వంటివి చేపడతామన్నారు. మంత్రి కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా అయిన తరువాత నగరంలో చాలా దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం దొరికిందని మంత్రి తలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. SNDPతో నగరంలో నాలాల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. పట్టణ ప్రగతి విజయవంతానికి అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహకారం అందించాలని కోరారు.
గత ప్రభుత్వాలు నాలాలను పట్టించుకోలేదని.. టీఆర్ఎస్ ప్రభుత్వం దూరదృష్టితో పనులు చేపడుతుందని తలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది ముంపు ప్రభావం తగ్గుతుందని.. వచ్చే ఏడాది నాటికి ముంపు ప్రభావం లేకుండా చూస్తామన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులతో చర్చించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..