ఎల్బీనగర్‌ ప్రేమోన్మాది.. సైకో ‘శివ’ నేరచరిత్ర.. వెలుగులోకి సంచలన నిజాలు..

|

Sep 04, 2023 | 9:34 PM

సంఘవి అనే యువతిపై కత్తితో దాడి చేసి.. అడ్డు వచ్చిన ఆమె సోదరుడు పృథ్వీని దారుణంగా పొడిచి చంపేశాడు కిల్లర్‌ శివకుమార్‌. అటు.. బాధితురాలు సంఘవికి చికిత్స కొనసాగుతోంది. దాడిలో గాయపడి మృతి చెందిన తమ్ముడు చింటు బాడీకి ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహించారు. సైకో శివను అదుపులోకి తీసుకొని లోతుగా విచారిస్తున్నారు పోలీసులు.

ఎల్బీనగర్‌ ప్రేమోన్మాది.. సైకో శివ నేరచరిత్ర.. వెలుగులోకి సంచలన నిజాలు..
Lb Nagar Accused
Follow us on

ఎల్బీనగర్‌, సెప్టెంబర్ 4: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో ప్రేమోన్మాది దాడి కేసులో షాకింగ్‌ విషయాలు బయటకొస్తున్నాయి. తన ప్రేమను నిరాకరించిందన్న కక్షతో.. ఇంటికి వెళ్లి మరీ.. సంఘవి అనే యువతిపై కత్తితో దాడి చేసి.. అడ్డు వచ్చిన ఆమె సోదరుడు పృథ్వీని దారుణంగా పొడిచి చంపేశాడు కిల్లర్‌ శివకుమార్‌. అటు.. బాధితురాలు సంఘవికి చికిత్స కొనసాగుతోంది. దాడిలో గాయపడి మృతి చెందిన తమ్ముడు చింటు బాడీకి ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహించారు. సైకో శివను అదుపులోకి తీసుకొని లోతుగా విచారిస్తున్నారు పోలీసులు. ఈక్రమంలోనే.. శివ నేర చరిత్రలో నిర్ఘాంతపోయే నిజాలు బయటకు వచ్చాయి. నిందితుడు శివకుమార్‌ స్వస్థలం రంగారెడ్డిలోని నేరెళ్ల చెరువు..! కొందుర్గు మండలానికి చెందిన.. స్కూల్‌లో తనతో పాటు పదో తరగతి వరకూ చదివిన యువతిని ప్రేమించాడు. అప్పటి నుంచే ఆమెను.. ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే.. యువతి పలుమార్లు వ్యతిరేకించడంతో శివకుమార్ కక్ష పెంచుకున్నాడు.

పదో తరగతి తర్వాత యువతి కుటుంబం హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లోని ఓ అద్దె ఇంట్లోకి మారింది. రామాంతపూర్‌లోని హోమియో కాలేజీలో ఆ యువతి నాలుగో సంవత్సరం చదువుతుండగా.. ఆమె సోదరుడు పృథ్వీ ఇంజనీరింగ్ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. అటు.. శివకుమార్ డిగ్రీ పూర్తి చేసి రామాంతపూర్‌లో ఉంటున్నాడు. ఇటీవల యువతిని కలిసి.. మరోమారు తన ప్రేమ విషయం చెప్పగా.. ఆమె మందలించింది. తనకు ప్రేమ వ్యవహారాలంటే ఇష్టం లేదని.. చదువుపై దృష్టి పెట్టినట్లుగా చెప్పింది. దీంతో పగబట్టిన శివకుమార్.. ఆదివారం ఆర్టీసీ కాలనీలోని సంఘవి ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. అక్కడే ఉన్న పృథ్వీ శివకుమార్‌ను అడ్డుకొనే ప్రయత్నం చేయగా అతనిపై కత్తితో దాడి చేశాడు. కత్తిపోటు బలంగా దిగడంతో పృథ్వీకి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో అతను ఇంటి నుంచి బయటకు కొంత దూరం నడుచుకుంటూ వచ్చి రోడ్డుపై పడిపోయాడు. మరోవైపు శివకుమార్‌… యువతిని గదిలో బంధించాడు.

ఇదే సమయంలో.. బాధితురాలి పొరుగింట్లో ఉండే గృహిణి సాహసంతో.. యువతి ప్రాణాలు కాపాడింది. ప్రేమోన్మాది బారిన పడిన యువతిని రక్షించడానికి ఆమె అత్యంత సాహసాన్ని ప్రదర్శించింది. కర్ర పట్టుకుని వెంటపడిన ఆ తల్లి తెగువ, సమయస్ఫూర్తి.. ఓ నిండు ప్రాణాన్ని నిలబెట్టడమే కాకుండా.. అన్యాయంగా నిండు ప్రాణాన్ని బలితీసుకున్న.. నరరూప రాక్షసుడిని పోలీసులకు పట్టించింది. ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన యువతి గట్టిగా కేకలు వేయగా.. పక్కింట్లోనే ఉంటున్న ఝాన్సీ అక్కడికి పరుగులు తీసింది. అప్పటికే కత్తి గాయంతో విలవిల్లాడుతున్న పృథ్వీ.. అక్కపై దాడి జరుగుతున్నట్లు ఆమెకు చెప్పి కిందికి వెళ్లి, పడిపోయాడు. వెంటనే ఝాన్సీ తన ఇంటి నుంచి ఓ కర్రను తీసుకుని బాధిత యువతి గది దగ్గరకు వెళ్లింది. కిటికీ నుంచి పరిస్థితిని గమనించగా.. అప్పటికే యువతి మరో గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. ఝాన్సీ గట్టిగా కేకలు పెడుతూ కర్రతో తలుపును గట్టిగా బాదుతూ నిందితుడిని హెచ్చరించింది.

క్షణాల్లో స్థానికంగా ఉండే పది మంది యువకులను అక్కడికి పిలిచి, తలుపులు, కిటికీలను పగలగొట్టించిన ఝాన్సీ.. వారిని లోపలికి పంపించింది. అలానే.. భర్త సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. స్థానికుల రాకతో భయపడిన శివకుమార్‌.. వెనక్కి తగ్గాడు. కానీ, అప్పటికే తీవ్రంగా గాయపడిన యువతి సోదరుడు పృథ్వీ ప్రాణాలు కోల్పోయాడు. శివకుమార్‌ను చితకబాది పోలీసులకు అప్పచెప్పారు. శివకుమార్‌లో ఈ ఉన్మాద ప్రవర్తన ఈనాటిదే కాదు. గతంలో కూడా నేర చరిత్ర ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. అడ్డదారుల్లో వెళ్లొద్దని మందలించిన తండ్రిని సైతం.. గతంలో దారుణంగా హతమార్చినట్లుగా ఆరోపణలున్నాయి. నాలుగేళ్ల క్రితం కన్న తండ్రిని శివ సుత్తితో కొట్టి హత్య చేశాడని ఆరోపిస్తున్నారు అతని గ్రామస్తులు. ప్రేమ పేరుతో అమ్మాయిని వేధించడం నిందితుడు ఇంట్లో గొడవకు దారి తీసింది. ఈక్రమంలోనే.. తండ్రి గట్టిగా మందలించడంతో ఆగ్రహంతో ఊగిపోయి తండ్రిని హత్య చేశాడు శివ. చిన్న వయసులో చేసిన తప్పుకు భవిష్యత్తు ఏమౌందోననే ఉద్దేశంతో… గ్రామపెద్దలు విషయం బయటకు రాకుండా చూసినట్లు తెలుస్తోంది. తండ్రి హత్యకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. నిందితుడు శివకుమార్‌ నేరచరిత్ర, మానసిక స్థితిపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.

శివకుమార్‌ డిగ్రీ పూర్తి చేశాక.. సినిమా అవకాశాల కోసమంటూ కొన్నాళ్లు హైదరాబాద్ నగరంలో ఖాళీగా తిరిగాడు. ఈక్రమంలోనే.. క్రైమ్‌ తరహాలో వీడియోలు తీయడానికే ఎక్కువుగా ఇష్టపడ్డాడు. శివకుమార్‌ గతంలో చేసిన క్రైమ్‌ ఓరియంటెడ్‌ వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఆ వీడియోల్లోనూ కత్తితో దాడికి వెళ్లిన సీన్‌తో పాటు ఇక్కడ నేను అన్నప్పుడే పగలు.. నేను అన్నప్పుడే రాత్రి.. అన్న డైలాగ్‌ కూడా ఉంది. కత్తులు, తుపాకులతో రీల్సే కాదు.. శివకుమార్‌.. డ్యాన్సులు, జల్సాల వీడియోలు కూడా ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. మూడు రోజుల క్రితమే రాఖీ పండుగ నేపథ్యంలో… స్వగ్రామానికి వచ్చిన యువతి, పృథ్వీ శనివారం తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోయారు. ఆదివారం దాడి ఘటన విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్‌ వెళ్లారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. నిందితుడు శివను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్‌ చేస్తున్నారు యువతి కుటుంబ సభ్యులు. తన కూతురుకు జరిగినట్లుగా.. ఇంకెవరికి జరగకూడదని.. అందుకు కఠిచట్టాలు అమలు చేస్తేనే.. ఇలాంటివి పునరావృతం కావని ఆవేదన వ్యక్తం చేశారు యువతి తండ్రి.

మరోవైపు.. యువతి, ఆమె తమ్ముడు పృథ్వీపై.. అటాక్ చేసిన తీరు తెలుసుకోడానికి శివకుమార్‌ను స్పాట్‌కు తీసుకెళ్లారు పోలీసులు. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. యువతి, పృథ్వీల రూమ్‌లో ఉన్న కత్తితోనే శివకుమార్ దాడికి దిగినట్లు తేల్చారు. అలానే.. నిందితుడు శివకుమార్‌ నేర చర్రితపైనా మరింత లోతుగా విచారణ చేపట్టారు పోలీసులు.