కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య వివాదం సద్దుమణిగినా.. దీనిపై నేతల మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతోంది. అమెరికా నుంచి హైదరాబాద్ తిరిగొచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కౌశిక్‌రెడ్డిని ఆయన ఇంటికెళ్లి పరామర్శించారు. ఇంట్లో ధ్వంసమైన ఇంటి అద్దాలు, ఫర్నిచర్‌ను పరిశీలించారు. దాడి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కౌశిక్‌రెడ్డి ఏం తప్పు మాట్లాడారని ఆయన ఇంటిపై దాడికి పాల్పడ్డారని ప్రశ్నించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తాము కోరుతున్నామన్నారు కేటీఆర్. కాంగ్రెస్‌కు దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు. గ్యారెంటీలు అమలు చేయాలని అడిగితే ఇలాంటి హైడ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇవన్నీ తిరిగి రేవంత్‌కే చుట్టుకుంటాయని కేటీఆర్ హెచ్చరించారు.
కోర్టు తీర్పుతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భయపడుతున్నారన్నారు కేటీఆర్. ఈ అంశంపై ప్రజల దృష్టిమరల్చేందుకే ఈ దాడులు జరిగాయని ఆరోపించారు. 100 మంది గూండాలు ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దాడులకు ప్రోత్సహించిన పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో ఇలాంటి గూండాగిరి గత పదేళ్లలో ఎప్పుడు లేదన్నారు కేటీఆర్. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో ఇప్పటికైనా చెప్పాలన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ప్రజలందరూ తమవారే అన్నారు. ప్రాంతీయతత్వం మీద దాడులు గతంలో లేవని.. ఇప్పుడు కూడా ఉండవన్నారు. బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ ప్రజలు అండగా నిలిచారనే కారణంగా సీఎం రేవంత్ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని కేటీఆర్ విమర్శించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..