కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం అప్పుల ఊబిలోకి కూరుకుపోయిందని మండిపడ్డారు. ప్రమాదంలో పడి కోమా దశలో ఉందని అన్నారు. ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో ప్రధాని మోదీ రూ.55 లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు. 32 కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 2014లో చంద్రబాబుకు సహకారం అందించినట్లు వెల్లడించారు. కనీస అనుభవం లేని జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని మరింత అప్పుల కుప్పగా మార్చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై రూ.7.5 లక్షల అప్పు ఉందని వివరించారు. కేసీఆర్, చంద్రబాబులపై సీబీఐకి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామని, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి, ప్రజా సమస్యలు తెలుసుకుంటామని కేఏ. పాల్ స్పష్టం చేశారు.
కాగా.. కేఏ పాల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ టూర్ (Political Tour) కు రెడీ అవుతున్నారు. ఏపీ, తెలంగాణలో రోడ్‌షోలు, భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేశారు. పాల్ రావాలి-పాలన మారాలి అనే నినాదంతో తెలుగు రాష్ట్రాల్లో పర్యటించబోతున్నట్లు కేఏ పాల్ తెలిపారు. ఏపీలో జులై 9నుంచి పర్యటన మొదలవుతుందన్నారు. జులై 9న వైజాగ్, 10న విజయనగరంలో టూర్ ఉంటుదన్నారు. ఆ తర్వాత వరుసగా శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, అనంతపురం, కర్నూలులో పర్యటించనున్నారు.
జులై 23నుంచి ఆగస్ట్ 1వరకు తెలంగాణలో టూర్ ఉంటుందన్నారు పాల్. ఇక, సెప్టెంబర్ నుంచి రెండు రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్పు కోరుకునేవారికి ఇదే చివరి అవకాశం అంటూ ఓటర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.