Hyderabad: బైపోల్ ఎఫెక్ట్.. జూబ్లీహిల్స్‌లో భారీగా నగదు పట్టివేత.. ఆ డబ్బు ఎవరిదో తెలుసా?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ నోట్ల కట్టలు బయటకు వస్తున్నాయి. హైదరాబాద్‌లో జరుగుతున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల నేపథ్యంలో పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో సోమవారం భారీగా నగదు పట్టుబడింది. కారులో అక్రమంగా తీసుకెళ్తున్న రూ.25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల నేపథ్యంలో నగరంలో పోలీసులు, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ (SST–11B) పెద్దఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో సోమవారం భారీగా నగదు పట్టుబడింది. మైత్రీవనం ఎక్స్‌రోడ్స్, సారథి స్టూడియో సమీపంలో జరిగిన వాహన తనిఖీల్లో కారులో అక్రమంగా తీసుకెళ్తున్న రూ.25 లక్షల నగదును స్వాధీనం చేసున్నారు పోలీసులు. ఈ తనిఖీల సమయంలో TS09FF 6111 నంబర్ గల కారును ఆపి పరిశీలించగా అందులో భారీగా నగదు దొరికింది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తిని విశాఖపట్నం సీతమ్మధారకు చెందిన శ్రీ జైరాం తలాసియాగా గుర్తించారు.
ప్రారంభ సమాచారం ప్రకారం జైరాం తలాసియా ఈ నగదును తన కారులో యూసుఫ్‌గూడ వైపు తీసుకెళ్తున్న సమయంలో తనిఖీలు జరిపిన SST బృందం ఆయనను నిలిపివేసింది. ఎన్నికల సంఘం అమలు చేస్తున్న కఠిన ఆచరణ మార్గదర్శకాల ప్రకారం, ఏవైనా నిబంధనలకు విరుద్ధంగా పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లడం కోడ్ ఉల్లంఘన కిందకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. SST బృందం తక్షణమే నగదును స్వాధీనం చేసుకుని మధురానగర్ పోలీస్ స్టేషన్ SHOకి అప్పగించింది.
ప్రస్తుతం పోలీసులు నగదు మూలం, దాని ప్రయోజనం, ఎవరికి ఇవ్వబోతున్నారన్న కోణంలో విచారణ ప్రారంభించారు. ఎన్నికల సందర్భంగా ఓటర్లకు నగదు పంపిణీ ద్వారా ప్రలోభాలిస్తే అది ఎన్నికల నియమావళి ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ నగదుకు రాజకీయ సంబంధాలున్నాయా.. లేదా వ్యాపార సంబంధాలు అనే విషయాలను ఖరారు చేసేందుకు అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి నివేదికను రాష్ట్ర ఎన్నికల అధికారులకు SST బృందం సమర్పించనుంది. ప్రజలు కూడా ఎన్నికల సమయంలో అనుమానాస్పదంగా కనిపించే నగదు రవాణా, వస్తువుల పంపిణీ వంటి ఘటనలను సంబంధిత అధికారులకు తెలియజేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
