విశ్వనగరం హైదరాబాద్‌లో సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు వణుకుపుట్టిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం అలజడి మరువక ముందే.. ఐటీ సోదాలు హడలెత్తిస్తున్నాయి. అక్రమ ఆస్తుల కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఐటీ వరుస దాడులకు పాల్పడుతోంది. ఐటీ రెయిడ్స్‌తో వ్యాపారులు కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు. ఏ నిమిషాన ఏం జరుగుతుందో తెలియక.. ఎటు నుంచి ఎవరు దాడులు చేస్తారోనన్న భయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వ్యాపార సముదాయాలే లక్ష్యంగా ఉదయం నుంచి ఐటీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో హైదరాబాద్‌లోని పలుప్రాంతాల్లో రెయిడ్స్ చేస్తున్నారు. ప్రత్యేకించి షాపింగ్ మాల్స్, మొబైల్ మార్కెటింగ్ సంస్థలే టార్గెట్‌గా సాగుతున్న దాడులతో వ్యాపారులు భయంభయంగా గడుపుతున్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాలైన కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, హైటెక్‌సిటీ వంటి ప్రధాన వ్యాపారకేంద్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. ఒక్కసారిగా వచ్చిపడ్డ ఐటీ అధికారులతో షాపింగ్ మాల్స్ ఉద్యోగులు వణికిపోయారు. ఎవ్వరినీ బయటకు పోనివ్వకుండా.. సమాచారం చేరవేయకుండా పకడ్బందీగా వ్యవహరించారు. ఉద్యోగుల నుంచి సెల్‌ఫోన్లు లాక్కున్నారు. లోపలి సిబ్బంది బయటకు.. బయట సిబ్బంది లోపలకు రాకుండా మాల్స్‌లో గంటలపాటు సోదాలు జరుపుతున్నారు.
కాగా షాపింగ్ మాల్స్, వస్త్ర దుకాణాలతోపాటు ప్రముఖ మొబైల్ సంస్థల డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు అధికారులు. ఈ దాడుల్లో పలు మాల్స్ డైరెక్టర్ల నుంచి కీలకసమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. భారీస్థాయిలో అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించినట్లు సమాచారం. త్వరలోనే పదుల సంఖ్యలో డైరెక్టర్లను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. దాడుల్లో అధికారులు ఏం స్వాధీనం చేసుకున్నారు?. ఎంతమొత్తంలో అవినీతి సొమ్మను సీజ్ చేశారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ దాడులు మరో రెండ్రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు అనధికారిక సమాచారం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..