Outside Food: ‘ఒక్కసారి’ బయట తింటే ఏమవుతుంది..! హోటల్ టు హాస్పిటల్..
హోటల్ కిచెన్ నిండా బొద్దింకలు, పురుగులు, ఎలుకలు..! కుళ్లిన చికెన్‌తో ఘుమఘుమలాడే ధమ్ బిర్యానీలు..! ప్యూర్ వెజిటేరియన్ హోటల్‌లోనూ దారుణమైన వంటలు..! మురిగిపోయిన కూరగాయలతో వెరైటీ వెజ్ ఐటమ్స్..! మరిగించి.. గ్రీజ్‌లా తయారైన ఆయిల్‌తో కమ్మని వంటలు..! పక్కనే డ్రైనేజ్ పైపులు.. ఆ పక్కనే కిచెన్‌లు..! ఇవేగా ఇటీవలి ఫుడ్ సేఫ్టీ రైడ్స్‌లో మనం చూస్తోన్న దృశ్యాలు....
హోటల్ టు హాస్పిటల్. రెస్టారెంట్ టు రెస్ట్ ఇన్ పీస్. మరీ ఇంత ఘోరమైన స్టేట్‌మెంట్ ఇస్తున్నారేంటండి అని అంటారేమో. అనడానికి కాస్త కష్టంగానే ఉంది నాక్కూడా..! బట్, నిజాలు చెప్పుకోవాలి కదా. హోటల్‌లో తిని అట్నుంచి అటే ఆంబులెన్స్‌లో హాస్పిటల్‌కు వెళ్లినవాళ్లున్నారు. అందుకే ఆ మాట అన్నది. రెస్టారెంట్‌లో తిని, అదే ఆఖరి ముద్ద అయి, రెస్ట్ ఇన్ పీస్‌లోకి వెళ్లిన ఉదంతాలూ ఉన్నాయ్. మొన్న మోమోస్ తిన్నందుకే కదా మహిళ చనిపోయింది. అందుకే ఆ స్టేట్‌మెంట్ ఇచ్చింది. చాలామందికి ఓ ఫీలింగ్ ఉంటుంది. వారానికోసారి బయట తింటే ఏమవుతుంది, నెలకోసారే కదా సరదాగా రెస్టారెంట్‌లో తింటే నష్టమేముంది అని. బహుశా ఇంట్లో పిల్లల నుంచి ఈమాట వినే ఉంటారు మీరు. లేదా.. భార్యామణో, శ్రీవారో ఔటింగ్ పేరుతో ఔట్‌సైడ్ ఫుడ్‌పై ఆశపడుతుంటారు. ఆ ‘ఒక్కసారేగా’ అనే ఆశ, మంకుపట్టు కారణంగా ఏం నష్టమో చెప్పుకుందాం ఈవేళ. దాంతో పాటు కల్తీ గురించి కూడా. ఎప్పుడూ వినే స్టోరీలే కదా అనుకుంటారేమో. కాదు..! హోటల్స్, రెస్టారెంట్స్, ఔట్‌సైడ్ ఫుడ్, కల్తీ ఫుడ్.. ఎంత డేంజరో క్రిస్టల్ క్లియర్‌గా ఎక్స్‌ప్లైన్ చేయబోతున్నాం.. ఇవాళ్టి టీవీ9 ఎక్స్‌క్లూజివ్‌లో.
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో..! బాటమ్ లైన్ ఇది. దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటివంట తినాలి. లేదూ.. మోక్షమే కావాలనుకుంటే బయటి ఫుడ్ తినాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసిన ఓ సర్వేలో ఒక్క ఏడాదిలో 4 లక్షల 20వేల మంది చనిపోతున్నారు. దేనివల్ల.. ‘ఒక్కసారేగా తినేది’ అని బయటికెళ్లి తినడం వల్ల. బయటి ఫుడ్ కారణంగా ఏడాదికి 60 కోట్ల మంది జబ్బుల పాలవుతున్నారు. ఇది అఫీషియల్ రికార్డ్. 20 ఏళ్ల యువకుడు ఫుడ్ తిని చనిపోవడమేంటండి, దారుణం కాకపోతే. రాళ్లైనా అరాయించుకునే వయసు కదా అది. అలాంటిది స్ట్రీట్ ఫుడ్ తిని చనిపోయాడు. కారణం.. ‘ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్’. ఆ 20 ఏళ్ల కుర్రాడు కూడా ‘ఒక్కసారే కదా’ అనే తిని ఉంటాడుగా.
బయటి ఫుడ్ ఎందుకు తినకూడదో చెప్తాను వినండి. మన ఇంట్లో ఎలుక తిరుగుతోందంటే.. దాన్ని బోన్‌లో బందించేంత వరకు మనసు ఊరుకోదు. ఒక్క బొద్దింక కనిపించినా.. ఇల్లు పీకి పందిరి వేసినంత పని చేస్తారు. ఎందుకని..? వాటివల్ల మనకేం జబ్బులు వస్తాయోనని. అలాంటిది.. హోటల్ కిచెన్స్‌లో బొద్దింకలు, ఎలుకలు, పురుగులు తిరుగుతున్న ఆహార పదార్థాలతో వండుతుంటారు. కందిపప్పు, గోధుమపిండి బస్తాలు ఓపెన్ చేయగానే ముందుగా పలకరించేవి ఆ పురుగులు, బొద్దింకలే. వాటితోనే మీరు ఇష్టంగా తినే ఫుడ్ తయారు చేసేది. ‘ఒక్కసారేగా’ అని వెళ్లి కడుపారా తినేది ఎలుకలు, బొద్దింకలు తినగా మిగిలిన పదార్ధాలనే. జనరల్‌గా డ్రైనేజ్ ఉందంటేనే ఆమడ దూరం నుంచి ముక్కు మూసుకుంటాం. కాని, ఆ డ్రైనేజ్ పైప్‌లైన్ పక్కనే కిచెన్ ఉంటుంది చాలావరకు రెస్టారెంట్స్‌లో. ఒక్కోసారి హోటల్స్‌లో కడిగే ప్లేట్లు కూడా ఆ డ్రైనేజ్ వాటర్‌తోనే. ముంచి తీస్తారంతే. మనమేమో.. స్టైలిష్‌గా టిష్యూ పేపర్‌తో ఒకసారి అలా క్లీన్ చేసి, నీట్‌గానే ఉంది ‘అనుకుని’ తినేస్తాం. ఇక.. ప్లేట్‌లో వడ్డించే బిర్యానీలు, వెరైటీ ఫుడ్ గురించి చెప్పుకోవాలి. ముందుగా చికెన్, మటన్, ఫిష్ ఐటమ్స్ గురించి. ప్లేట్‌లోకి వచ్చేవన్నీ చాలా ఫ్రెష్‌గా ‘ఉన్నట్టు’ కనిపిస్తాయి. కాని, కిచెన్‌లో ఎలా ఉంటుందో తెలుసా. ఎప్పుడో వారం పది రోజుల క్రితం తీసుకొచ్చిన మాంసం అది. కొన్ని చోట్ల లైట్‌గా ఫ్రై చేసి ఫ్రీజర్‌లో పెడతారు. ఎందుకంటే.. అప్పటికప్పుడు పాడైపోకుండా ఉండడానికి. కస్టమర్ ఆర్డర్ చేయగానే మరోసారి డీప్ ఫ్రై చేసి పెడతారు. అలా సగం కాల్చిన మాంసాన్ని ఫ్రీజర్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా. పాయిజన్‌గా మారుతుంది. కొందరేమో.. ఫ్రిడ్జ్‌లో, ఫ్రీజర్‌లలో పెడతారు. పేరుకే ఫ్రీజర్లవి. అందుకే, కుళ్లిపోతుంటాయి. చాలా వరకు వాటికి తెల్లని పురుగులు కూడా పడుతుంటాయి. కాకపోతే.. నీళ్లలో ముంచి, మరోసారి గట్టిగా కడిగి, డీప్ ఫ్రై చేసి పట్టుకొస్తారు.
నాన్-వెజ్‌తోనే ఈ ప్రాబ్లమ్.. మేం వెజిటేరియన్స్ అనుకుని హోటల్, రెస్టారెంట్లకు వెళ్తుంటారా. ఎలాంటి కూరగాయలతో వంట చేస్తారో తెలుసా మీకు. బంగాళాదుంపల మీద ఆల్‌మోస్ట్ మొక్క కనిపిస్తూ ఉంటుంది. మొలకెత్తుతున్న ఆలుగడ్డను తినడం అంటే డైరెక్టుగా నోట్లోకి విషం తీసుకుంటున్నట్టే. ఇక టమాటాలు, ఉల్లిపాయలైతే.. ఆల్‌మోస్ట్ కుళ్లిపోయిన స్టేజ్‌లో ఉంటాయి. పైగా ఎలాంటి చోట పెడతారో తెలుసా వాటిని. అటుఇటు తిరుగుతుంటే బురద బురదగా మారుతుంది చూశారూ.. అలాంటి ప్లేస్‌లో కూరగాయలను పెడతారు. కాదు.. అలా విసిరేసి ఉంచుతారు. అవసరమైనప్పుడు వాటినే కడిగి, వండి, వడ్డిస్తారు. రీసెంట్‌గా ఓ హోటల్‌ను తనిఖీ చేసినప్పుడు.. ఒక దగ్గర ఫినాయిల్ డబ్బాలను, కిరాణా సరుకులను ఒకే చోట నిల్వచేశారు. భలే వారే.. ప్రతీదాన్ని ఇలా తప్పుపడుతూ పోతే ఎలా. కిరాణా సరుకులతో పాటే ఫినాయిల్ డబ్బాలను తెచ్చుకోమా, పక్కపక్కనే పెట్టమా.. అంటారా. సరే.. ఓ రియల్ స్టోరీ షార్ట్‌గా చెబుతా వినండి. ‘ఆడపిల్ల మెచ్యూర్ అయితే తల్లిదండ్రుల్లో ఓ సంతోషం. నా చిన్నతల్లి పెద్దతల్లి అయిందనే ఓ ఆనందం. కాని, ఆ చిన్నతల్లి వయసు ఆరేళ్లే అయితే..! ఆరేళ్లకే మెచ్యూర్ అయితే ఆ తల్లితండ్రుల వ్యథ ఎంతలా ఉంటుంది చెప్పండి. ఆమె సమస్యకు కారణాన్ని అన్వేషిస్తే తెలిసిందేంటంటే.. వాళ్లింట్లో ఎప్పుడూ పురుగుమందుల డబ్బాలు ఉంటాయట. వ్యవసాయ కుటుంబం కదా.. ఎప్పుడూ నిల్వ ఉంటాయి. ఆ చిన్నారి వాటితోనే ఆడుకోవడం, ఎక్కువగా అక్కడక్కడే తిరుగుతుండడం వల్ల ఆ ఎఫెక్ట్‌తో ఆరేళ్లకే మెచ్యూర్ అయిందని తేలింది. అదో అరుదైన కేస్ కూడా. ఇప్పుడు చెప్పండి.. ఓపెన్ చేసి ఉంచిన ఫినాయిల్ డబ్బాల పక్కనే కిరాణా సరుకులు, కూరగాయలను నిత్యం ఉంచేస్తూ, అక్కడే వంట చేస్తుంటే.. అవి తిన్న మనం ఆరోగ్యంగా ఉంటామా? వెజిటేరియన్ ఫుడ్డే కదా అని హోటల్‌కెళ్లి ఆ విషాన్ని ట్రై చేద్దామా..?
ఇంత దారుణమైన ఆహార పదార్ధాలతో, కూరగాయలతో, కుళ్లిన చికెన్‌తో వండుతున్నా.. ఎందుకని అంత టేస్ట్ ఉంటాయవి? తినేటప్పుడు లొట్టలేసుకుని మరీ తింటారు. ఆ టేస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడిదంటే.. అందులో కలుపుతున్న ఫుడ్ కలర్స్. కుళ్లిపోయి, పురుగులు పట్టిన చికెన్‌ను కూడా ఘుమఘుమలాడించే కెమికల్స్ మార్కెట్లో బోలెడు ఉన్నాయి. మనకు తెలియవు ఆ పేర్లు. హోటల్, రెస్టారెంట్ వాళ్లకి బాగా తెలుసు. ఇక కుళ్లిన రంగు కనిపించకుండా, అప్పుడే మార్కెట్లోంచి తీసుకొచ్చిన ఫ్రెష్ చికెన్, మటన్, ఫిష్ అనిపించేలా కనిపించడానికి కెమికల్స్ కలిపిన ఫుడ్ కలర్స్ వాడతారు. సో, ఆ టేస్ట్.. వండితే వచ్చింది కాదు. కెమికల్స్ వేసి వేడిచేస్తే వచ్చింది. మీరు చూడండి.. హోటల్‌కి వెళ్లగానే ఆర్డర్ వెంటనే మీ టేబుల్ మీదకు రాదు. సాయంత్రం అవగానే తినడానికి హోటల్‌కు వస్తారని తెలిసీ ఎందుకని రెడీగా ఉంచరు. ఎందుకని ఆర్డర్ చేసిన పావుగంటకు గానీ టేబుల్ మీదకు రాదు..? ఎందుకంటే.. ఐటమ్స్ అన్నీ వేడివేడిగా ఉండాలి కాబట్టి. ఆ వేడి మీద అది కుళ్లినా పెద్దగా తెలీదు కాబట్టి. అది కాస్తా చల్లారిందో ఆ బండారం ఏంటో బయటపడుతుంది కాబట్టి.
దయచేసి.. కేవలం హైదరాబాద్‌లోనే ఇలా ఉంటుందనే భ్రమలో ఉండొద్దు. విజయవాడలో సుబ్బయ్యగారి హోటల్‌లో తింటుంటే.. ఇంత పెద్ద జెర్రి వచ్చింది. 100 పర్సెంట్ వెజిటేరియన్ హోటల్‌లో నాన్-వెజ్ ఎంట్రీ. అదిరింది కదూ. మొన్నామధ్య జగిత్యాలలోనూ జెర్రి కనిపించింది. ఉడిపి హోటల్ ఇడ్లీ ఆర్డర్ చేస్తే.. దాంతో పాటు జెర్రీ కూడా వచ్చింది. హైదరాబాద్ అబిడ్స్‌లో తాజ్‌మహల్ హోటల్ చాలా ఫేమస్. అక్కడ కూడా జెర్రి వచ్చింది. పప్పు కలుపుకొని తింటుంటే కనిపించింది. ఇక బొద్దింకలు, బల్లుల గురించి చెప్పాలంటే.. ఈ ఎసిసోడ్ చాలదు.
అందుకే.. జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి కొన్ని హోటల్స్‌లో సడెన్ రైడ్స్ చేశారు. ఆ సమయంలో ఓ డబ్బా తీసి చూపించారు. అది వంటనూనె అట. లిటరల్‌గా ఎలా ఉందంటే.. ఓ బాటిల్‌లో పెట్రోల్ కొట్టించినప్పుడు ఎలాంటి కలర్ ఉంటుందో అలా ఉంది. ఆ ఆయిల్‌తోనే ‘ఒక్కసారేగా’ అని తింటున్న బిర్యానీలు గట్రా చేస్తున్నది. కొన్ని హోటల్స్‌లో వాడుతున్న ఆయిల్‌ను ముట్టుకుంటే.. గ్రీజులా కనిపించింది. అంటే.. ఎన్నిసార్లు మరిగించి మరిగించి తీస్తే అలా గ్రీజులా మారుతుందో చెప్పండి. అలాంటి నూనెతో వండుతారు హోటల్స్ అండ్ రెస్టారెంట్స్‌లో. ఇక ఆ వంట గదిలోని గిన్నెలను చూడాలి మీరు. బహుశా చాలామంది చూసి ఉండరు కదా. చెబుతాను వినండి. పొరపాటున క్లాత్‌తో కాకుండా చేత్తో ఏ మూకుడునో, గిన్నెనో పట్టుకున్నారంటే.. ఆ జిడ్డు వదిలించుకోవాలంటే కనీసం రెండు నిమిషాల సేపు సబ్బుతో రుద్దాలి. ‘బన్నీ నీ సబ్బు స్లోనా ఏంటి’ అని అనొద్దు. ఆ జిడ్డు అలాంటిది మరి. మీరు నమ్మరు గానీ.. తుప్పు పట్టిన గిన్నెల్లో వండుతున్నారు. కంపుకొట్టే కిచెన్‌లో.. బొద్దింకలు-ఎలుకలు తిరిగే వంటగదిలో.. కుళ్లిన, మురిగిన పదార్ధాలతో చేసిన ఆ ఫుడ్‌నే ‘ఒక్కసారేగా’ అని తింటున్నారు చాలామంది. కిచెన్‌లో ఎలాంటి వాతావరణం ఉంటుందో మనకు తెలీదు కదా. అందుకే, కడుపునిండా తిని వస్తుంటాం. ఆ వడ్డించే వ్యక్తి కూడా పద్దతిగా, కంచంలో హెయిర్ పడకుండా హెడ్ క్యాప్ పెట్టుకుని, చాలా నీట్‌గా తీసుకొచ్చి వడ్డిస్తాడు. బహుశా.. అతని మనసులో మాట వినే వరం మనకు ఉండి ఉంటే.. ఏమని వినిపిస్తుందో తెలుసా. ‘కుళ్లిన మాంసాన్ని, నాలుగు కెమికల్స్ వేసి వండి, వేడివేడిగా వడ్డిస్తుంటే ఎలా లొట్టలేసుకుని తింటున్నారో’ అని అనుకుంటాడు. ఎందుకంటే.. అతనికి తెలుసు కదా.. అది ఫ్రెష్షో కాదో.
హోటల్స్‌లో ఇంత దారుణంగా వండుతుంటే.. అధికారులేం చేస్తున్నారు? ప్రజల ఆరోగ్యం పట్టదా ప్రభుత్వానికి? అని ప్రశ్నించాలనుంది కదా. అక్కడికే వస్తున్నాం.
హోటల్స్‌లో ఇంత దారుణ పరిస్థితులుంటే.. అధికారులు ఏం చేస్తున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకుందాం. అంతకంటే ముందు.. ఈ ఫుడ్ బిజినెస్ ఎంత పెద్దదో తెలుసుకుందాం. హైదరాబాద్ అనేది ఇండియాలోనే sixth largest food services market. 74వేల 807 రెస్టారెంట్స్ ఉన్నాయి సిటీలో. ఆ రెస్టారెంట్స్ టర్నోవర్ ఏడాదికి 10వేల 161 కోట్ల రూపాయలు. ఇండియావైడ్‌గా ఈ ఫుడ్ బిజినెస్ మార్కెట్ వాల్యూ 5 లక్షల 70వేల కోట్ల రూపాయలు. మరో నాలుగేళ్లలో ఈ మార్కెట్ 7 లక్షల 70వేల కోట్ల రూపాయలకు పెరుగుతుందని అంచనా. అంటే.. హైదరాబాద్‌లో ఫుడ్ బిజినెస్ ఇంకెంత పెరుగుతుందో చూడండి. ఇంత పెద్ద వ్యవస్థని రెగ్యులేట్ చేయగలమా? 74వేలకు పైగా రెస్టారెంట్లలో తనిఖీలు సాధ్యమా? అందులోనూ.. హైదరాబాద్‌లో 23 మంది ఫుడ్ ఇన్‌స్పెక్టర్స్ ఉండాల్సింది, 19 మందే ఉన్నారు. జీహెచ్‌ఎంసీలో 6 జోన్లు, 30 సర్కిళ్లు ఉన్నాయ్. సర్కిల్‌కు ఒకరు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉండాల్సింది 19 మంది ఉన్నారు. మ్యాన్ పవర్ తక్కువగా ఉన్నా సరే.. టాస్క్‌ఫోర్స్ బృందాలు ఈమధ్య గట్టిగానే తనిఖీలు చేస్తున్నాయి. ఈమధ్య 500 హోటల్స్‌లో రైడ్స్ చేస్తే.. అందులో 90 శాతం హోటల్స్‌లో ఫుడ్ సరిగా లేదని తేలింది. ఇంత తక్కువ స్టాఫ్ ఉన్నా సరే.. 2021లో 12వేల 375 రైడ్స్ చేస్తే, 2022లో 17వేల 209 రైడ్స్, 2023లో 14వేల 889 రైడ్స్, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 9వేల 886 రైడ్స్ చేశారు. ప్రస్తుతం ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’ పేరుతో అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఇయర్ హైదరాబాద్ రెస్టారెంట్స్‌పై 2వేల 735 కంప్లైంట్స్ వస్తే.. అందులో 2వేల 128 కంప్లైంట్లకు రియాక్ట్ అయ్యారు. ఒక్క హైదరాబాద్‌లోనే 1474 కోర్టు కేసులు ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి రిజిస్టర్ అయ్యాయి. వాటిలో 283 క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. షాకింగ్ మ్యాటర్ ఏంటంటే.. ఏపీ, తెలంగాణకు కలిపి ఏకైక ఫుడ్ ల్యాబోరేటరీ ఉంది. వాళ్లు ఎన్నని శాంపిల్స్ టెస్ట్ చేయగలరు? ఏదైనా కంప్లైంట్ వెళితే.. ఆ కేసు తేలడానికి ఏడాదిన్నర నుంచి రెండేళ్లు పడుతోంది. సో, అధికారులను, ప్రభుత్వాన్ని అని లాభం లేదు. అఫ్‌కోర్స్ వాళ్లు కూడా స్ట్రిక్ట్‌గా పనిచేయాల్సిందే. కాకపోతే.. మన జాగ్రత్తే మనకు శ్రీరామరక్ష.
2022లో ఓ సర్వే చేశారు. ఇండియాలోని 19 మెయిన్ సిటీలను సర్వే చేస్తే.. కల్తీ ఆహారంలో టాప్ ప్లేస్‌లో ఉన్నది హైదరాబాదే. 62 శాతం హోటల్స్.. గడువుతీరి, కుళ్లిన ఆహారాన్ని కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు తేలింది. ఇక.. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో 120కే బిర్యానీ, 100కే తిన్నంత బిర్యానీ అని బోర్డులు చూస్తుంటాం. రేటు తక్కువ కదా అని తినేస్తాం. కానీ, చాలా వాటిలో ఎలాంటి చికెన్ పెడతారో తెలుసా. హైదరాబాద్‌కి ప్రతి రోజు కొన్ని టన్నుల కొద్దీ వేస్ట్ చికెన్ వస్తుంటుంది. చెన్నై, బెంగళూరు నుంచి డైరెక్టుగా చార్మినార్ సెంటర్‌కు వచ్చి, అక్కడి నుంచి సిటీ మొత్తానికి డెలివరీ అవుతుంది. ఆ వేస్ట్ చికెన్ కాస్ట్ ఎంతో తెలుసా. కిలో 30 రూపాయలు. 30 రూపాయలకు మూడు కోడిగుడ్లు కూడా రావడం లేదు, 30కే కిలో చికెన్ ఎలా అమ్ముతున్నారు? ఎందుకంటే అది వేస్ట్ చికెన్ కాబట్టి. నిప్పుల మీద, లేదా హై-టెంపరేచర్‌లో వేయించి పెడితే.. బహుబాగుందని తినేస్తున్నారు. 120కే బిర్యానీ అనగానే ఆరగించేస్తున్నారు. రోజు గడవగానే మళ్లీ వేస్ట్ చికెన్ దిగుమతి అవుతుంటుంది. మళ్లీ 120 బిర్యానీ ప్యాక్ చేసుకుంటారు. చాలాబాగుందని తినేస్తారు. ఇదీ జరుగుతున్నది.
ఇక అల్లంవెల్లుల్లి పేస్ట్, సాసెస్, మయోనైజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరికి స్వీట్స్, ఐస్‌క్రీమ్ తినే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మొన్ననే.. ఉప్పల్‌లోని మూసీ రివర్ బెడ్ దగ్గర AVD కంపెనీలో తయారుచేస్తున్న ఐదున్నర టన్నుల స్వీట్స్ సీజ్ చేశారు. అక్కడే బాత్‌రూమ్, అక్కడే స్నానాలు, వాటి పక్కనే స్వీట్లు, కారాబూందీ తయారు చేస్తున్నారు. చూస్తే.. తినలేం. అంత అపరిశుభ్ర వాతావరణం అది. అక్కడి నుంచి సిటీకి స్వీట్స్ సప్లై అవుతుంటాయి. అందుకే, సీజ్ చేశారు. ఇక బ్రాండెడ్ కాని ఐస్‌క్రీమ్స్ జోలికి వెళ్లొద్దు. చాలా వరకు జరుగుతున్నదేంటంటే.. ఒక్కోసారి తిన్నవెంటనే ఆ ఎఫెక్ట్ కనిపించదు. కొందరికి వెంటనే వాంతులు, విరేచనాలు రావొచ్చు. కొంతమందిలో ఒకట్రెండు రోజుల తరువాత ఆ ఎఫెక్ట్ బయటకు కనిపించొచ్చు. ఒక్కోసారి హాస్పిటల్‌కి తీసుకెళ్లే లోపే పరిస్థితి విషమించి చనిపోవచ్చు. అందుకే, ఏం కాలేదు కదా అనో, ‘ఒక్కసారేగా’ అనో తింటే.. ఫ్యామిలీని రిస్క్‌లో పెట్టినట్టే.
ఇక కల్తీ గురించి చూద్దాం. మన మంతెన గారు.. రోజుకు ఐదు లీటర్ల నీళ్లు తాగమంటున్నారు. ఇప్పుడున్న జబ్బులకి రోజుకు గుప్పెడు టాబ్లెట్లు వేసుకుంటున్న వాళ్లున్నారు. ఆ మందుల నుంచి శరీరాన్ని శుభ్రం చేయాలంటే నీళ్లు కాస్త ఎక్కువగానే తాగాలి. చాలామందికి ఓ అపోహ. ఇంటికి వేయించుకునే వాటర్ క్యాన్‌లో అయితేనే మినరల్ వాటర్ ఉంటాయని. కాని, అది మినరల్ వాటర్ కాదు.. జనరల్ వాటర్. కిన్లే, బిస్లరీ వంటి బ్రాండెడ్ కంపెనీల పేర్లలో స్పెల్లింగ్ అటుఇటు మార్చి మార్కెట్లో అమ్మేస్తున్నారు. చాలామందికి మినరల్ వాటర్ అంటే మీనింగ్ తెలీదు. వాటర్ క్యాన్‌లో నింపేదంతా మినరల్ వాటర్ కాదు. మినరల్ వాటర్‌కు Total Dissolved Solids అనే కొలమానం ఉంటుంది. TDS 75కి మించి ఉంటేనే ఈ నీటిని తాగాలి. కాని, ఆ స్టాండర్డ్స్ లేకుండానే నీళ్లు నింపి అమ్మేస్తున్నారు. అలా చేస్తున్నందుకే కాచిగూడలో కింగ్ ఆక్వా వాటర్ ఫ్యాక్టరీని సీజ్ చేశారు. 4 లక్షల విలువ చేసే 20వేల లీడర్ల వాటర్ బాటిళ్లను సీజ్ చేశారు. ఇలాంటి వాటర్ ఒక్క గుటక వేసినా గుట్టుక్కుమనడమే.
మొన్ననే.. గోకవరంలో కల్తీ టీ రాకెట్ గుట్టు రట్టు చేసింది టీవీ9. అసలు తేయాకు లేకుండానే టీపొడి తయారుచేశారు. చింతపిక్కలు, జీడి ముక్కలను పొడి చేసి, ఫ్లేవర్ కోసం బేకింగ్ సోడా, ఇతర కెమికల్స్ కలిపి అమ్మేస్తున్నారు. ఇప్పటికే గోకవరం నుంచి ఎన్నో ప్రాంతాలకు ఈ నకిలీ టీపొడి సప్లై అయింది. ఆ టీ తాగి ఎంతమంది జబ్బు పడి ఉంటారో.
సో, సొసైటీలో దేన్నీ నమ్మడానికి లేదిప్పుడు. కీడు ఎంచి మేలు ఎంచాలి అనే సామెత ఊరికనే అనలేదు. తింటే ఏం ప్రమాదం వస్తుందో అని భయపడడమే మేలు. అన్నిటికీ మించి.. బయట తినకపోవడం ఉత్తమోత్తమం. వీలైనంత వరకు ఇంట్లో తయారుచేసుకుంటేనే బెటర్. అది బ్రేక్‌ఫాస్ట్ అయినా.. లంచ్, డిన్నర్ అయినా. ‘ఒక్కసారేగా’ అని రిస్క్ చేస్తే మాత్రం.. అట్నుంచి అటే ఆస్పత్రి బెడ్ ఎక్కవచ్చు, దురదృష్టం వెంటాడితే ప్రాణం పోనూ వచ్చు. సో, బీ కేర్ ఫుల్.