BCCI: పాక్ వక్రబుద్ధికి దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ.. పీఓకేలో ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ రద్దు
ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ విషయంలో పాకిస్థాన్‌కు ఐసీసీ దిమ్మతిరిగే షాకిచ్చింది. భారత్ రిక్వెస్ట్‌తో పాకిస్థాన్ కుటిల యత్నాలకు చెక్ పెట్టింది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో పాక్ క్రికెట్ బోర్డు నిర్వహించ తలపెట్టిన ఛాంపియన్స్ ట్రోఫీ టూర్‌ను క్యాన్సిల్ చేసింది. పాక్ వక్రబుద్ధిపై బీసీసీఐ.. ఐసీసీని సంప్రదించడంతో కీలక నిర్ణయం తీసుకుంది.
వచ్చే ఏడాది జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీలో విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్రోఫీ అధికారిక షెడ్యూల్‌ను ఐసీసీ ఇంకా ప్రకటించనప్పటికీ.. ట్రోఫీ టూర్‌ను మాత్రం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే.. ట్రోఫీని ముందుగా పాకిస్థాన్‌కు పంపగా.. పాక్ క్రికెట్ బోర్డు దేశవ్యాప్త టూర్ షెడ్యూల్ ప్రకటించింది. శనివారం నుంచి ఇస్లామాబాద్‌లో ట్రోఫీ టూర్ ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది. అయితే.. షెడ్యూల్‌లో పీఓకేలోని స్కర్దు, హుంజా, ముజఫరాబాద్ ప్రాంతాలను పాక్ చేర్చడం వివాదానికి దారి తీసింది. భారత్‌ను కవ్వించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దాయాది దేశంలో టీమ్‌ఇండియా పర్యటించేది లేదని బీసీసీఐ స్పష్టం చేసిన నేపథ్యంలో పాక్ ఈ రూపంలో తన వక్రబుద్ధిని బయటపెట్టింది.
హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించాలని భారత్ డిమాండ్
ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో పాక్ కుటిల యత్నాలపై భారత్ అలెర్ట్ అయింది. పాక్‌కు చెక్ పెట్టేందుకు సత్వరమే స్పందించి.. ఐసీసీ ముందు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీనిపై రియాక్ట్ అయిన ఐసీసీ.. పీఓకే టూర్‌ను రద్దు చేసింది. దాంతో.. అంతర్జాతీయ వేదికలపై పాక్ పరువు పోయినట్లు అయింది. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లను పాకిస్థాన్‌లోని లాహోర్, రావల్పిండి, కరాచీ వేదికగా నిర్వహించాల్సి ఉంది. అయితే.. ఈ టోర్నీ కోసం పాకిస్థాన్‌కు వెళ్లేదే లేదని ఐసీసీకి బీసీసీఐ తేల్చి చెప్పింది. అదేసమయంలో.. హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించాలని భారత్ కోరుతుండగా.. అంగీకరించేది లేదని పీసీబీ మొండిగా వ్యవహరిస్తోంది. దాంతో.. ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ప్రకటన ఆలస్యమవుతోంది.
టోర్నీ వేదిక మార్చినా పాక్ నిష్క్రమించే చాన్స్
వాస్తవానికి.. సెక్యూరిటీ రీజన్స్‌తో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌కు వెళ్లకూడదని భారత్ ముందు నుంచీ గట్టిగానే నినదిస్తోంది. అయితే.. భారత ప్రభుత్వం అనుమతిస్తే టీమిండియా పాకిస్థాన్‌కు వెళ్తుందని బీసీసీఐ వైస్ ప్రెసిడెండ్ రాజీవ్ శుక్లా గతంలో ప్రకటించారు. దాంతోపాటు.. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ పద్ధతి నిర్వహించాలన్న డిమాండ్ భారత్ నుంచి ఉండగా.. దానికి సంబంధించి ఎలాంటి చర్చలు జరగలేదని కొద్దిరోజుల క్రితం పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ప్రకటించారు. కానీ.. ఇప్పుడు ఏకంగా .. పీఓకేలో ఛాంపియన్స్ ట్రోఫీ టూర్‌ను ఐసీసీ రద్దు చేయడంతో పాక్‌కు షాక్ తగిలిగింది. ఆయా పరిణామాల నేపథ్యంలోఒకవేళ పాకిస్థాన్ చివరిక్షణంలో వైదొలిగితే ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించేందుకు సౌతాఫ్రికా, యూఏఈ ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన.. టోర్నమెంట్ వేదికను ఐసీసీ మార్చినా.. పాకిస్థాన్ ఏకంగా టోర్నీ నుంచే నిష్క్రమించే చాన్స్ కూడా లేకపోలేదన్న టాక్ నడుస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..