HYDRA: చేతులు కలిపిన హైడ్రా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్… సాటిలైట్ సమాచారంతో కబ్జాదారులకు ఇక చుక్కలే
సాటిలైట్ సమాచారం తో చెరువులు ప్రభుత్వ స్థలాలు, రోడ్లు, కబ్జాలకు కళ్లెం వేయడానికి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSE)తో హైడ్రా ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పంద పత్రాలపై హైడ్రా కమీషనర్ ఏవి రంగనాథ్, ఎన్ఆర్ఎస్సి డైరెక్టర్ ప్రకాశ్ చౌహాన్ సంతకాలు చేశారు. ఓఆర్ ఆర్ పరిధిలో భూముల వివరాలు అందరికీ అందుబాటులోకి తీసుకురాడానికి...

సాటిలైట్ సమాచారం తో చెరువులు ప్రభుత్వ స్థలాలు, రోడ్లు, కబ్జాలకు కళ్లెం వేయడానికి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSE)తో హైడ్రా ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పంద పత్రాలపై హైడ్రా కమీషనర్ ఏవి రంగనాథ్, ఎన్ఆర్ఎస్సి డైరెక్టర్ ప్రకాశ్ చౌహాన్ సంతకాలు చేశారు. ఓఆర్ ఆర్ పరిధిలో భూముల వివరాలు అందరికీ అందుబాటులోకి తీసుకురాడానికి హైడ్రా కసరత్తు ప్రారంభించిందని రంగనాథ్ చెప్పారు. ఎక్కడ చెరువు ఉంది? ఆ చెరువు విస్తీర్ణం ఎంత? కాలువలు, నాలాల పరిస్థితి ఏంటి..? అనే సమాచారంతో పాటు ప్రభుత్వ భూములు, పార్కులకు సంబంధించి సరైన హద్దులతో సమాచారాన్ని హైడ్రా సేకరిస్తుందన్నారు.
ప్రభుత్వ, ప్రజావసరాలకు ఉద్దేశించిన భూముల వివరాలతో పాటు.. చెరువుల హద్దులు అందుబాటులో ఉంటే ఆక్రమణలకు ఆస్కారం లేకుండా ఉంటుందని హైడ్రా కమిషన్ రంగనాథ్ తెలిపారు. చెరువుల ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్లకు సంబంధించి హద్దుల విషయంలో ఎలాంటి అపోహలకు ఆస్కారం లేకుండా సరైన సమాచారం అందించడమే హైడ్రా ముందున్న లక్ష్యమని అన్నారు. 1970వ సంవత్సరంలో సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేసిన టోపో షీట్లు, కెడెస్ట్రియల్ మ్యాప్స్, రెవెన్యూ రికార్డులు, చెరువులకు సంబంధించిన సమాచారంతో పాటు ఎన్ ఆర్ ఎస్ సీ శాటిలైట్ ఇమేజీలతో సమగ్ర సమాచారం అందుబాటులోకి తీసుకురావడమే హైడ్రా లక్ష్యంగా చెప్పారు.
NRSC సహకారం ఎలా ఉంటుంది?
విపత్తుల నిర్వహణ, నీటి వనరుల రక్షణ కోసం జియో ఆధారిత జియోస్పేషియల్ డేటా మద్దతు, సాంకేతిక సహకారం హైడ్రాకు అందుతుంది. రిమోట్ సెన్సింగ్ & GIS సాంకేతికతను వినియోగించి తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(టీసీయూఆర్) కోసం భౌగోళిక డేటాబేస్‌లను సమగ్రపరిచే భౌగోళిక పోర్టల్ అభివృద్ధితో పాటు జియోస్పేషియల్ డేటాబేస్ సృష్టికి NRSC సాంకేతిక మద్దతును HYDRAA బృందానికి అందిస్తుంది.
భువాన్ పోర్టల్‌లో ఉన్న TCUR పరిధిలో విపత్తు నిర్వహణ మరియు నీటి వనరుల రక్షణకు సంబంధితంగా ఉండే అన్ని వారసత్వ సమాచారాన్ని ఈ ఒప్పందం ప్రకారం NRSC అందించడానికి సిద్ధంగా ఉంటుంది. కొత్త ‘జియోస్పేషియల్ డేటా పాలసీ – 2023’ కు అనుగుణంగా ‘భూనిధి’ పోర్టల్‌లో ఉన్న అన్ని చారిత్రక భారతీయ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహ డేటా TCUR ప్రాంతాన్ని కవర్ చేసే మార్గదర్శకాలు అందుబాటులోకి వస్తాయి.
హై-రిజల్యూషన్ ఉపగ్రహ డేటా, వైమానిక ఫోటోగ్రఫీ, డిజిటల్ ఎలివేషన్ మోడల్స్ మొదలైనవి ఎన్ ఆర్ ఎస్ సీ ద్వారా HYDRAA కు అందుతాయి. ఉపగ్రహం / వైమానిక వనరుల నుంచి సంబంధిత డేటాను తయారు చేయడం, వాటి ఏకీకరణ, ఆస్తి నిర్వహణ / పర్యవేక్షణ కు సంబంధించిన సమాచార సేకరణలో హైడ్రాకు ఎన్ ఆర్ ఎస్ సీ నుంచి అందుతుంది. NRSC కి చెందిన ‘నేషనల్ డేటాబేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్’ (NDEM) వెబ్ పోర్టల్‌కు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది. ఇది ఇంటిగ్రేటెడ్ ఏరో-స్పేస్ ఆధారిత విపత్తు డేటాను ఉన్న స్థితిలోనే విజువలైజేషన్ చేయడానికి వీలు కల్పిస్తుంది.
ఔటర్ రింగ్ రోడ్ (ORR) వరకు ఉన్న ప్రాంతంతో పాటు GHMC చుట్టూ ఉన్న 27 మునిసిపాలిటీలు/కార్పొరేషన్ల పరిధిలో చెరువులు, ప్రభుత్వ భూములు, పార్కులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావడానికి ఎన్ ఆర్ ఎస్ సీ – హైడ్రా సంయుక్తంగా కృషి చేస్తాయి.