AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంజన్న సన్నిధిలో ఆకలితో అలమటిస్తున్న వానరాలు.. కొండగట్టులో కోతుల అవస్థలు!

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో కోతుల సందడి ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ అంజనేయస్వామి వారు కొండపైన కొలువై ఉన్నారు. చుట్టూ పచ్చని చెట్లు, అటవీ ప్రాంతం కావడంతో చాలా యేళ్లుగా ఇక్కడ కోతుల సంఖ్య పెరుగుతునే ఉంది. ఎటు చూసిన కోతులు సంచరిస్తాయి. అయితే క్రమ క్రమంగా చెట్లు అంతరించిపోవడంతో కోతుల జనావాసాల్లోకి వస్తున్నాయి.

అంజన్న సన్నిధిలో ఆకలితో అలమటిస్తున్న వానరాలు.. కొండగట్టులో కోతుల అవస్థలు!
Monkeys In Kondagattu
G Sampath Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Apr 22, 2025 | 5:13 PM

Share

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో కోతుల సందడి ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ అంజనేయస్వామి వారు కొండపైన కొలువై ఉన్నారు. చుట్టూ పచ్చని చెట్లు, అటవీ ప్రాంతం కావడంతో చాలా యేళ్లుగా ఇక్కడ కోతుల సంఖ్య పెరుగుతునే ఉంది. ఎటు చూసిన కోతులు సంచరిస్తాయి. అయితే క్రమ క్రమంగా చెట్లు అంతరించిపోవడంతో కోతుల జనావాసాల్లోకి వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కోతుల ఆహారం కోసం గతంలో కొండ కింద మంకీ ఫుడ్ కోర్టును ఏర్పాటు చేశారు. కానీ ఒక్క పండ్ల మొక్క నాటలేదు. దీంతో గుడి ప్రాంతంలో సంచరిస్తున్న వానరాలు ఆహారం కోసం వేట కొనసాగిస్తున్నాయి. భక్తులు ఏమైనా తీసుకొస్తే లాక్కెళ్తున్నాయి. అంతేకాకుండా.. అప్పుడప్పుడు దాడులకు దిగుతున్నాయి. కోతులకు కడుపు నింపేందుకు దేవస్థానం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఆకలితో అల్లాడిపోతున్నాయి కోతులు.

జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వాం దేవస్థానానికి ప్రతి రోజూ పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ఇతర రాష్ట్రాల నుంచీ.. ఇక్కడికి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. ఇక్కడ కొండపైన కొలువై ఉన్న అంజనేయస్వామి ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ చాలా యేళ్లుగా కోతులు ఉన్నాయి. అయితే.. గతంలో.. కొండపైన భారీ వృక్షాలు.. వివిధ రకాల పండ్ల చెట్లు ఉండటంతో.. ఎలాంటి సమస్య రాలేదు. అయితే అటవీ విస్తీర్ణం తగ్గడంతో పాటు పండ్ల చెట్లు కనుమరుగువుతున్నాయి. దీంతో కోతులన్నీ ఇక ఆలయానికి చేరుకుంటున్నాయి. మొత్తం ఆలయ పరిసర ప్రాంతాల్లోనే కోతులు సంచరిస్తున్నాయి. 15 యేళ్లుగా కోతులు భక్తులను ముప్పితిప్పలు పెడుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే కోతుల ఆహారం కోసం గతంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. కొండ కింద.. మంకీ ఫుడ్ కోర్టును ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ రకాల పండ్ల మొక్కలు పెంచి.. వాటిని అక్కడికి తరలిస్తామని నిర్ణయం తీసుకున్నారు. కానీ, కేవలం బోర్డు మాత్రమే ఏర్పాటు చేశారు. తరువాత ఇక్కడ ఎలాంటి పండ్ల మొక్కలు నాటలేదు. ఆహారం కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కోతులన్నీ కొండపైన తిష్ట వేస్తున్నాయి. కొండ సమీపంలో చెట్లు ఉన్నా.. అధికంగా కలప చెట్లు ఉంటాయి. పండ్ల చెట్లు లేవు. దీని కారణంగా భక్తులను వానరాలు టార్గెట్ చేస్తున్నాయి. కడుపు నింపుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాయి. భక్తుల చేతిలో ఏం ఉంటే.. అవి ఎత్తుకొని వెళ్తున్నాయి.

ఇక్కడ ప్రసాదం తీసుకోవాలంటే.. భక్తులు భయపడుతున్నారు. అంతేకాకుండా చాలా మంది భక్తులు స్వామి వారి సన్నిధిలో గడుపుతారు. వంట చేసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంది. ఆహార పదార్థాలు ఎత్తుకొని వెళ్తున్నాయి. భక్తులు చేతిలో కర్ర పట్టుకొని కాపాలా ఉంటున్నారు. ముఖ్యంగా కొండగట్టులో ఎలాంటి పండ్ల చెట్లు లేకపోవడంతో భక్తులు ఇచ్చే ఆహారంపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఎండకాలంలో.. ఆహారం కోసం మరింత ఇబ్బంది పడుతున్నాయి.

అయితే, కొంత మంది భక్తులు.. ఇక్కడికి వచ్చి వివిధ రకాల పండ్లు ఇక్కడికి వచ్చి కోతులకు పెడుతున్నారు. కానీ.. అ ఏమాత్రం సరిపోవడం లేదు. సహజంగానే హనుమాన్ ఆలయాల వద్ద ఎక్కువగా కోతులు ఉంటాయి. వాటికి కడుపు నింపేందుకు అధికారులు ఎలాంటి ఆలోచన చేయడం లేదని భక్తులు మండిపడుతున్నారు. పెద్ద ఎత్తున పండ్ల మొక్కలు నాటి.. కోతుల జోన్ ఏర్పాటు చేసి వాటికి ఆహారాన్ని అందించాలని భక్తులు కోరుతున్నారు. ప్రతి రోజూ ఇక్కడ కోతులు రంగం చేస్తున్నాయి. ఒక్కసారి కోతి పైకి వస్తే.. చేతిలో ఏం ఉన్న వదిలిపెట్టి వెళ్తారు. గతంలో చేతిలో ఉన్న బ్యాగ్‌లు, సెల్‌పోన్లు ఎత్తుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. వాటిని మళ్లీ కోతుల నుంచీ తీసుకోవడానికి భక్తులు నానా తంటాలు పడాల్సి వస్తుంది.

అయితే.. మంకీ ఫుడ్ కోర్టును అభివృద్ధి చేసి, భారీగా పండ్ల మొక్కలు పెంచితే తప్ప కొంత మేరకు భక్తులకు బాధలు తప్పేలా లేవు. లేదంటే.. భయం.. భయంగానే భక్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ కోతులు ఎక్కువగా ఉన్నాయని, చేతిలో ప్రసాదం పట్టుకుంటే ఎత్తుకొని వెళ్తున్నాయని భక్తులు అంటున్నారు. చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్తున్నామని చెబుతున్నారు. పిల్లలు భయపడుతున్నారని అంటున్నారు. కోతుల కోసం.. పెద్ద ఎత్తున పండ్ల మొక్కలు నాటి, వాటికి ఆహారాన్ని అందించాలని భక్తులు కోరుతున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..