ఎయిర్‌పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్ మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.. తెలంగాణ ప్రభుత్వం. ఆరాంఘర్-బెంగుళూరు హైవే, కొత్త హైకోర్టు మీదుగా విమానాశ్రయానికి మెట్రో లైన్ ఖరారు చేసింది. కారిడార్-4లో భాగంగా నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకూ 36.6 కిలోమీటర్ల మార్గానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎయిర్ పోర్ట్ కారిడార్‌లో 1.6 కిలోమీటర్ల మెట్రో లైను భూగర్భం నుంచి వెళ్లనుంది. ఈ మార్గంలో ఎయిర్ పోర్ట్ స్టేషన్ సహా మొత్తం 24 మెట్రో స్టేషన్లు ఉంటాయి.
మెట్రో కారిడార్-5 రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి కోకాపేట్ నియోపోలిస్ వరకు బయో డైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ రోడ్, నానక్ రామ్ గూడ జంక్షన్, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ నియోపోలిస్ మీదుగా నిర్మిస్తారు. ఇది మొత్తం ఎలివేటెడ్ కారిడార్. ఇందులో దాదాపు 8 స్టేషన్లు ఉంటాయి. కారిడార్-6లో ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణ్ గుట్ట వరకు గ్రీన్ లైన్ నిర్మిస్తారు. కారిడార్-7లో మార్గం ముంబై హైవేపై రెడ్ లైన్‌కు కొనసాగింపుగా నిర్మిస్తున్నారు. ఇది ప్రస్తుతం ఉన్న మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి స్టార్టయి..పటాన్‌చెరు వరకు నిర్మిస్తారు. 13.4 కిలోమీటర్ల ఈ మార్గంలో 10 స్టేషన్లు ఉంటాయి. కారిడార్-8 విజయవాడ హైవేపై ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కి.మీ మార్గం నిర్మిస్తారు. ఈ పూర్తి ఎలివేటెడ్ కారిడార్‌లో దాదాపు 6 స్టేషన్లు ఉంటాయి.
వివిధ ప్రత్యామ్నాయాల గురించి లోతైన చర్చల తర్వాత, ముఖ్యమంత్రి మెట్రో రెండో దశ కారిడార్‌ల విస్తృత కాంటూర్ లను ఆమోదించారు, అవి క్రింది విధంగా ఉన్నాయి:
కారిడార్ IV: నాగోల్ -RGIA (ఎయిర్ పోర్ట్ కారిడార్) 36.6 కి.మీ
కారిడార్ V : రాయదుర్గ్ -కోకాపేట్ నియోపోలిస్ 11.6 కి.మీ
కారిడార్ VI: ఎంజీబీఎస్ – చంద్రాయన్ గుట్ట (ఓల్డ్ సిటీ కారిడార్) 7.5 కి.మీ
కారిడార్ VII: మియాపూర్ – పటాన్ చెరు 13.4 కి.మీ
కారిడార్ VIII: ఎల్ బి నగర్ – హయత్ నగర్ 7.1 కి.మీ
కారిడార్ IX : RGIA – ఫోర్త్ సిటీ (స్కిల్ యూనివర్సిటీ) 40 కి.మీ
మొత్తం 116.2 కి.మీ.
ప్రస్తుతం 3 కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర హైదరాబాద్‌లో మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి. 116.2 కిలోమీటర్లలో 32 వేల 237 కోట్ల అంచనా వ్యయంతో రెండో దశ పనులు చేపట్టనున్నారు. రెండో దశ కూడా పూర్తయితే మొత్తం 9 కారిడార్లలో 185 కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటులో ఉండనుంది. మరోవైపు 8 వేల కోట్ల అంచనాతో ఫ్యూచర్ సిటీకి మెట్రో సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..