హైదరాబాద్, జులై 5: హైదరాబాద్ మహా నగరంలో మాదక ద్రవ్యాల వినియోగం నానాటికీ పెచ్చుమారి పోతుంది. యువతతోపాటు విద్యార్ధులు కూడా దీని బారీన పడుతున్నారు. తాజాగా కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో గంజాయి కలకలం రేపింది. మెడికల్ కాలేజీ వద్ద జూనియర్ డాకర్టకు గంజాయి విక్రయిస్తుండగా ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తి పాత నేరస్తుడిగా పోలీసులు గుర్తించారు. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సుల్తాన్ బజార్ పోలీసులు సంయుక్తంగా నిందితుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న నేరస్తుడిని పెడ్లర్ సురేశ్ సింగ్‌గా అధికారులు గుర్తించారు. గతంలో ఇతగాడిపై ఏకంగా 5 కేసులు నమోదై ఉన్నట్ల అధికారులు తెలిపారు. అసలేం జరిగిందంటే..
ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద కె మణికందన్, వి అరవింద్ అనే ఇద్దరు జూనియర్ డాక్టర్లు శుక్రవారం ఉదయం గంజాయి కొనుగోలు చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో డ్రగ్స్ పెడ్లర్ సురేశ్ సింగ్ నుంచి వారు గంజాయి తీసుకుంటుండగా సుల్తాన్ బజార్ పోలీసులకు పట్టుబడ్డారు. పట్టుబడిన ఇద్దరు జూనియర్ డాక్టర్లకు టెస్ట్‌లో పాజిటివ్ రావడంతో వారిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఇద్దరు జూనియర్ డాక్టర్లతో పాటు గంజాయి పెడ్లర్ సురేశ్ సింగ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరిని కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం వీరికి రిమాండ్ విధించింది. నిందితుల నుంచి 80 గ్రాముల గంజాయి, 2 మొబైల్ ఫోన్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అలాగే మెడికల్ కాలేజీలో ఇతర విద్యార్ధులు ఎవరైనా గంజాయి తీసుకుంటున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో నలుగురు జూనియర్ డాక్టర్లు కూడా గంజాయి తీసుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.