Hyderabad Rains: భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ అలర్ట్..
హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వచ్చే 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్‌ఎంసీ, హైడ్రా, పోలీస్, విద్యుత్, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ క్యాచ్‌మెంట్ ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షిస్తూ, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు, రహదారులపై నీరు చేరే పరిస్థితులు ఏర్పడ్డాయి. వచ్చే 24 గంటల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. మిగతా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.. హైదరాబాద్‌లో సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ ఇంచార్జి మంత్రి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను అప్రమత్తం చేశారు. జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, హైడ్రా, విద్యుత్, పోలీస్, రెవెన్యూ తదితర లైన్ డిపార్ట్‌మెంట్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిపై సమీక్షించారు. వర్షాల కారణంగా నగరంలో ఎక్కడా నీరు నిలిచిపోకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అన్ని లైన్ డిపార్ట్‌మెంట్లు పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ క్యాచ్‌మెంట్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదై జంట జలాశయాలు నిండే పరిస్థితి ఏర్పడితే గేట్లు తెరిచి మూసీ నదిలోకి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
జలాశయాల గేట్లు తెరిచే పరిస్థితి ఏర్పడితే జీహెచ్‌ఎంసీ, విద్యుత్ శాఖ, హైడ్రా, పోలీస్, రెవెన్యూ తదితర శాఖలకు ముందస్తు సమాచారం అందించి, మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
వినాయక చవితి నేపథ్యంలో ప్రత్యేక పర్యవేక్షణ
వినాయక చవితి ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో వర్షాల కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని పర్యవేక్షించాలని మంత్రి తెలిపారు. గణేష్ మండపాలు, నిమజ్జన ప్రాంతాలు, రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
డీ-సిల్టింగ్ పూడిక, డెబ్రిస్‌ను వెంటనే తొలగించాలి..
మ్యాన్‌హోల్స్, నాలాలు తదితర ప్రాంతాల్లో చేపట్టిన డీ-సిల్టింగ్ పనుల్లో వెలువడిన పూడిక, మట్టి, రోడ్లపై ఉన్న డెబ్రిస్‌ను వెంటనే తొలగించాలని మంత్రి ఆదేశించారు. వాటిని రోడ్లపై లేదా నాలాల సమీపంలో ఉంచడం వల్ల వర్షపు నీటితో తిరిగి నాలాల్లోకి చేరి నీటి ప్రవాహానికి ఆటంకం కలిగే అవకాశం ఉందని, అందువల్ల ఎక్కడి పూడికను అక్కడే వదిలేయకుండా తక్షణమే తరలించాలని స్పష్టం చేశారు.
ఎమర్జెన్సీ టీమ్స్, ఎయిర్‌టెక్ యంత్రాలను సిద్ధంగా ఉంచాలి..
ఎయిర్‌టెక్ యంత్రాలు, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్‌ను పూర్తిస్థాయిలో అప్రమత్తం చేయాలని మంత్రి సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా అవసరమైన సంఖ్యలో ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేసి, వారికి అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అధికారులు కేవలం కార్యాలయాల్లో సమీక్షలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని మంత్రి స్పష్టం చేశారు.
ప్రజలకు నిరంతరం అలర్ట్‌లు ఇవ్వాలి
భారీ వర్షాల సమయంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేలా సమర్థవంతమైన అలర్ట్ మెకానిజాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. వర్షపు నీరు నిలిచే ప్రాంతాలు, ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రమాదకర ప్రాంతాలు, మూసీ పరివాహక ప్రాంతాలపై ప్రత్యేకంగా పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలే కీలకమని మంత్రి పేర్కొన్నారు. “అలెర్ట్‌గా ఉందాం.. అలెర్ట్‌గా ఉంచుదాం. ప్రజల భద్రత కోసం అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రతి సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలి” అని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
