TGSRTC: హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ దసరా గిఫ్ట్.. ఈ బస్సుల్లో టికెట్ ఛార్జీలు భారీగా తగ్గింపు..
హైదరాబాద్ ప్రజలకు టీజీఎస్‌ఆర్టీసీ దసరా గిప్ట్ ప్రకటించింది. ఈ బస్సుల్లో టికెట్ ఛార్జీలను ఏకంగా 40 శాతం మేర తగ్గించారు. దీంతో రూ.150 మేర ఒకేసారి టికెట్ ధరలు తగ్గాయి. ప్రయాణికులకు మరింత మెరుగైన కనెక్టివిటీ కల్పించేందుకు ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్ ప్రజలకు టీజీఎస్‌ఆర్టీసీ దసరా రానున్న క్రమంలో శుభవార్త అందించింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు తిరుగుతున్న పుష్పక్ బస్సుల్లో ఛార్జీలకు సంబంధించి ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పుష్పక్ బస్సుల్లో ఛార్జీలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఏకంగా ఛార్జీలను 40 శాతం వరకు తగ్గిస్తున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంచూరి శ్రీధర్ ప్రకటన జారీ చేశారు. బుధవారం నుంచే ఈ చార్జీలను అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ తగ్గింపు తర్వాత ఏయే ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే బస్సుల్లో ఛార్జీలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.
తగ్గించిన చార్జీలు ఇవే..
లింగంపల్లి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు నడుస్తున్న పుష్పక్ బస్సుల్లో ఇప్పటివరకు చార్జీలు రూ.350గా ఉండగా.. ఇప్పుడు రూ.200కి తగ్గించారు. ఇక శిల్పారామం, గచ్చిబౌలి, కొత్తగూడ నుంచి ఎయిర్‌పోర్ట్ బస్సుల్లో రూ.350 నుంచి రూ.150కి తగ్గించినట్లు వెల్లడించారు. ఇక అల్విన్ ఎక్స్‌రోడ్ నుంచి మొన్నటివరకు రూ.350 చార్జీ ఉండగా.. ఇప్పుడు రూ.200కు తగ్గించారు. అలాగే మియాపూర్ ఎక్స్‌రోడ్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లే పుష్పక్ బస్సులో చార్జీ రూ. 350 ఉండగా.. రూ.250కు తగ్గించారు. జేబీఎస్-శంషాబాద్ ఎయిర్పోర్ట్, జేఎన్‌టీయూ-ఎయిర్‌పోర్ట్ పుష్పక్ బస్సుల్లోనూన రూ.350 నుంచి రూ.200కి తగ్గించారు. మొత్తాన్నికి అన్ని రూట్లలో రూ.150 మేర టికెట్ ధరలు తగ్గించారు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ప్రయాణికులకు ఛార్జీల భారం తగ్గనుంది.
చౌక ధరకే ఎయిర్ పోర్ట్ ప్రయాణం
ఇక జేబీఎస్–మెహదీపట్నం, జేబీఎస్–ఆరాంఘర్ మార్గంలో కూడా కొన్ని బస్సుల్లో టికెట్ చార్జీలను రూ.100 మేర తగ్గించారు. దీంతో ప్రయాణికులకు జర్నీ ఖర్చు తగ్గనుంది. ప్రైవేట్ క్యాబ్‌లు, ట్యాక్సీలలో ఎయిర్‌పోర్టుకు వెళ్లాలంటే అధిక చార్జీలు ఉంటాయి. అదే ఆర్టీసీ బస్సుల్లో తక్కువ ధరతో ప్రయాణించవచ్చు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణం అందించేందుకు టీజీఎస్‌ఆర్టీసీ ఈ మార్పులు చేసింది. కుటుంబంతో కలిపి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేవారికి మరింత ఆదా అవుతుంది. ఇటీవల శంషాబాద్ విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి పెరగడం, పుష్పక్ బస్సుల్లో డిమాండ్ కారణంగా ఛార్జీలను సవరించారు. దీని వల్ల ఎయిర్‌పోర్ట్‌కు ప్రజా రవాణా మెరుగుపడనుంది. పుష్పక్ బస్సుల్లో ఏసీ సౌకర్యం కూడా ఉంటుంది. కాగా ఇటీవల రవాణశాఖ కామన్ పాస్‌ను విడదుల చేసింది. ఈ పాస్ ద్వారా మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. విడివిడిగా టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. రోజువారీ పాస్ ధర రూ.400గా ఉండగా.. నెలవారీ పాస్ ధర రూ.8 వేలుగా ఉంది. మెట్రో స్టేషన్లు, బస్టాండ్లలో ఈ పాస్ తీసుకోవచ్చు.
