Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో పెయిడ్‌ పార్కింగ్‌పై పెల్లుబికిన ప్రజాగ్రహం.. వెనక్కి తగ్గిన ఎల్‌అండ్‌టీ.. ట్వీట్‌ వైరల్

|

Aug 25, 2024 | 11:53 AM

హైదరాబాద్‌లోని నాగోల్‌, మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ ఆవరణలోని వాహనాల పార్కింగ్‌ ఫీజుల (పెయిడ్‌ పార్కింగ్‌) విషయంలో ఎల్‌అండ్‌టి యూటర్న్‌ తీసుకుంది. హైదరాబాద్‌ మెట్రో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మెట్ర స్టేషన్ల వద్ద పెయిడ్‌ పార్కింగ్‌ విధానాన్ని అమలు చేయాలన్న నిర్ణయంపై ప్రయాణికుల సమస్యలను పరిష్కరించే వరకు అమలును వాయిదా వేస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది..

Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో పెయిడ్‌ పార్కింగ్‌పై పెల్లుబికిన ప్రజాగ్రహం.. వెనక్కి తగ్గిన ఎల్‌అండ్‌టీ.. ట్వీట్‌ వైరల్
Hyderabad Metro
Follow us on

హైదరాబాద్‌, ఆగస్టు 25: హైదరాబాద్‌లోని నాగోల్‌, మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ ఆవరణలోని వాహనాల పార్కింగ్‌ ఫీజుల (పెయిడ్‌ పార్కింగ్‌) విషయంలో ఎల్‌అండ్‌టి యూటర్న్‌ తీసుకుంది. హైదరాబాద్‌ మెట్రో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మెట్ర స్టేషన్ల వద్ద పెయిడ్‌ పార్కింగ్‌ విధానాన్ని అమలు చేయాలన్న నిర్ణయంపై ప్రయాణికుల సమస్యలను పరిష్కరించే వరకు అమలును వాయిదా వేస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆగస్టు 25 నుంచి నాగోల్‌లో, సెప్టెంబర్‌ 1 నుంచి మియాపూర్‌ మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్‌ లాట్‌లలో పెయిడ్‌ పార్కింగ్‌ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం పట్ల ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. పార్కింగ్ అటెండర్లు, హైదరాబాద్ మెట్రో సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ‘పెయిడ్‌ పార్కింగ్‌’ రద్దు చేయకపోతే నాగోల్‌ మెట్రో స్టేషన్‌ వద్ద ధర్నా చేస్తామని ప్రయాణికులు హెచ్చరించారు. దీంతో ఎల్‌అండ్‌టీ వెనక్కి తగ్గింది.

రెండు గంటల బైక్ పార్కింగ్‌కు రూ.10, 12 గంటల వరకు కార్ పార్కింగ్‌కు రూ.120 వరకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే కొత్త పార్కింగ్ ఫీజులను ప్రవేశపెట్టడంపై పలువురు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఛార్జీలు విధించడం వల్ల చాలా మంది ప్రయాణికులు అసంతృప్తికి గురయ్యారు. పైగా పార్కింగ్ ఛార్జీలను “పార్క్ హైదరాబాద్” అనే యాప్ ద్వారా మాత్రమే చెల్లించాలని హుకూం జారీ చేశారు. మరోవైపు గూగుల్ ప్లే స్టోర్‌లో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే కారిడార్‌-1 (ఎల్బీనగర్‌-మియాపూర్‌), కారిడార్‌-3 (నాగోల్‌- రాయదుర్గం) మార్గంలో ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆ సమస్య అలా ఉండగానే.. కొత్తగా నాగోల్‌, మియాపూర్‌ మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్‌ లాట్‌లలో ఒకేసారి భారీ ఎత్తున పెయిడ్‌ పార్కింగ్‌ ఫీజులను నిర్ణయించి, అమలు చేస్తామని ప్రకటించడంతో ప్రయాణికులంతా ఆందోళన చెందారు. ఈనెల 14న మెట్రోస్టేషన్‌లో నిరసన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మెట్రో రైళ్లలో అధికంగా ఐటీ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులే రాకపోకలు సాగిస్తున్నారు. నాగోల్‌ నుంచి రాయదుర్గం వెళ్లాలంటే ప్రతి రోజూ రానుపోను రూ. 120 వరకు మెట్రో చార్జీ అవుతుండగా, కార్‌ పార్కింగ్‌ చేస్తే మరో రూ. 120, మెట్రోస్టేషన్‌ నుంచి ఆఫీసుకు వెళ్లేవరకు మరో రూ. 30 నుంచి 40ల దాకా ఖర్చవుతుంది. ఇలా ఒక్క రోజు రవాణా చార్జీలే రూ. 270 నుంచి రూ.300ల దాకా అవుతుండటంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. ఇది ప్రయాణికులకు తలకు మించిన భారమే అవుతుంది. ఈ క్రమంలోనే ఎల్‌అండ్‌టీ పెయిడ్‌ పార్కింగ్‌ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎక్స్‌ ఖాతాలో పోస్టు పెట్టింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.