Hyderabad Crime: ‘నువ్వు చచ్చిపో! నేను మరో పెళ్లి చేసుకుంటాను’
కోవిడ్ మహమ్మారి కారణంగా టెక్ కంపెనీలన్నీ తమ ఎంప్లాయిస్‌కు వర్క్ ఫ్రం హోం షురూ చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఇంటి నుంచి పని చేసే విధానం ఈ కాపురం పాలిట..
Hyderabad Techie suicide: కోవిడ్ మహమ్మారి కారణంగా టెక్ కంపెనీలన్నీ తమ ఎంప్లాయిస్‌కు వర్క్ ఫ్రం హోం షురూ చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఇంటి నుంచి పని చేసే విధానం ఈ కాపురం పాలిట యమపాశమైంది. అత్తమామలతోపాటు, కట్టుకున్న భార్య తరచూ వేధిస్తుండటంతో మనస్తాపానికి గురైన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం రాజుపల్లి గ్రామానికి చెందిన కొండా రాకేష్ (28) హైదరాబాద్‌లోని హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రాకేష్ గత ఫిబ్రవరిలో వరంగల్ జిల్లా సంగెం మండలం ఎలుకుర్తిహవేలికి చెందిన దేవులపల్లి నిహారిక (24)తో పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. రాకేష్‌కు వర్క్ ఫ్రం హోం ఇవ్వడంతో ఇంటి నుంచే పనిచేస్తుండేవాడు. కొంత కాలం సజావుగా ఉన్నా భార్య నిహారికకు పల్లెటూరులో ఉండటం ఇష్టంలేక హైదరాబాద్‌కు వెళ్దామని భర్తను తరచూ పోరు పెట్టేది. వర్క్ ఫ్రం హోం పూర్తికాగానే హైదరాబాద్‌కు వెళ్దామని రాకేష్ చెప్పినా రోజూ ఇదే విషయమై భార్యభర్తలిరువురూ వాదులాడుకునేవారు. దీంతో 5 నెలల గర్భవతైన నిహారిక పుట్టింటికి చేరింది. ఏమైందో ఏమోకానీ గత కొద్ది రోజుల కిందట నీహారిక భర్త రాకేష్‌కు వీడియోకాల్ చేసి నువ్వు చనిపోతే నేను వేరేపెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీనికితోడు అత్తామామలు చీటికిమాటకి సూటిపోటి మాటలతో వేధించేవారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాకేష్ సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులకు సమాచారం అందడంతో సూసెడ్ నోట్ ఆధారంగా మృతుడి భార్యతో పాటు అత్తా మామలైన అరుణ, శంకర్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసధికారి ఒకరు మీడియాకు తెలిపారు.