Hyderabad: లంగర్‌హౌస్ గోనెసంచిలో డెడ్ బాడీ కేసులో విస్తుపోయే విషయాలు
లంగర్ హౌజ్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని.. సీసీటీవీ ఫుటేజీ సహాయంతో అనుమానితులను రాజు, స్వరూప అనే అనుమానితులుగా గుర్తించారు, వీరు తమ వికలాంగుడైన సోదరుడు అశోక్ క్యాన్సర్‌తో మరణించిన తరువాత మృతదేహాన్ని ముక్కలుగా చేసి పారవేసినట్లు అనుమానిస్తున్నారు. అంత్యక్రియలు చేయడానికి వారి వద్ద డబ్బు లేదని సమాచారం.
హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. గోనెసంచిలో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. లంగర్ హౌజ్ ప్రాంతంలో రెండు గోనెసంచుల్లో ముక్కలుగా నరికిన డెడ్‌బాడీ లభించింది. ఎక్కడో చంపి, శరీరాన్ని ముక్కలుగా చేసి రెండు గోనెసంచుల్లో కుక్కారు. వాటిని లంగర్ హౌజ్ ప్రాంతంలో ఫుట్ పాత్ మీద పెట్టి వెళ్లారు. ఓ ఆటోలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు, గోనెసంచులను దించి..రోడ్డు పక్కన ఫుట్ పాత్ మీద పెడుతుండడం స్థానికులు చూశారు. కాసేపటికి వాటినుంచి రక్తం కారుతుండడంతో మూటవిప్పి చూడటంతో మనిషి శరీర భాగాలు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
స్థానికులిచ్చిన సమాచారం, సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. కాళీ మందిర్‌కు చెందిన అశోక్ మద్యానికి బానిసై ఆరోగ్యం పాడైపోయిందని… దాంతో అశోక్ అన్న అతన్ని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించినా ఫలితం దక్కలేదని.. అశోక్ అనారోగ్యంతో చనిపోయాడని నిందితులు చెబుతున్నారు. దాంతో దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతోనూ ఇద్దరూ డెడ్‌బాడీని ముక్కలుగా నరికి గోనెసంచుల్లో కట్టి, లంగర్‌హౌస్ మిలట్రీ ఏరియా సమీపంలో పడేసినట్లు నిందితులు ఎంక్వైరీ చెప్పుకొచ్చారు. నిందితులైన రాజు, స్వరూపలను అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.
బాపూఘాట్ నుంచి లంగర్ హౌజ్ కు వచ్చే ప్రాంతంలో, మిలట్రీ ఏరియా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పది రోజుల క్రితం కూడా ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఓ మహిళను చంపి గోనెసంచితో మృతదేహాన్ని ముక్కలుగా చేసి పెట్టి వెళ్లారు. వరుస ఘటనలతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..