Hyderabad: ఓల్డ్ సిటీలో విచిత్ర పరిస్థితులు.. స్మశానాల్లో క్షుద్రపూజలు.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు

అసలే పాతబస్తీ.. చూడ్డానికెంతో గంభీరంగా ఉంటుంది. ఆపై భయం కొలిపే స్మశానాలు. వీటిలో అంతులేని నిశ్శబ్దం. ఈ సైలెన్స్ లోనూ కొందరు బ్లాక్ మేజిక్ వైలెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఓల్డ్ సిటీ క్షుద్ర పూజల వివరాలేంటో తెలుసుకుందాం పదండి.

Hyderabad: ఓల్డ్ సిటీలో విచిత్ర పరిస్థితులు.. స్మశానాల్లో క్షుద్రపూజలు.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు
Black Magic
Follow us

|

Updated on: May 30, 2022 | 9:24 AM

హైదరాబాద్ పాత బస్తీ స్మశానాల్లో క్షుద్ర పూజల కలకలం చెలరేగుతోంది. ఖబరస్తాన్ అంటే ప్రశాంతంగా ఉంటుందని పేరున్నా.. అక్కడి నిశ్శబ్దం కూడా భయపెడుతుంది.  ఇక్కడ కొన్ని బొమ్మలకు మేకులు దించి.. ఆ పక్కనే కోడిగుడ్లు పెట్టారు. వాటి మీద ఏవేవో క్షుద్ర రాతలు రాశారు. అంతేకాదు దారాలు చుట్టిన కుండలు ఉండటం.. చూసి హడలెత్తి పోతున్నారు కొందరు.  ఇక్కడి చెట్ల కింద, సమాధుల్లో గోతులు తీసి..ఇలాంటి వస్తువులను పూడ్చి పెట్టడం చూసి.. స్మశానాల్లోకి వస్తున్నవారు ఠారెత్తిపోతున్నారు.  ఇక్కడి స్మశానాల్లో ఇలాంటి చిన్నపిల్లల బొమ్మలు.. వాటికి పేర్లు, ఆపై క్షుద్రమంత్రాలు.. బొమ్మల వెనక మేకులు దించిన భయానకమైన వాతావరణం కనిపించడంతో ఒక్కొక్కరికీ గుండెల్లో గుబులు రేగుతోంది. మరీ ముఖ్యంగా గత వారం రోజుల నుంచీ ఇక్కడీ చేతబడులకు సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయ్. దీంతో స్మశానాలకు ఏదో ఒక పని మీద వచ్చేవారు బెంబేలెత్తిపోతున్నారు. మతాధికారులు, స్మశానాల ఇంఛార్జీలు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

గతంలో తామెన్నడూ ఇలాంటివి చూడలేదనీ.. ఇప్పుడే ఇలాంటి చిల్లంగి చేష్టలను గమనిస్తున్నామనీ..  ఇకపై ఇలాంటివి లేకుండా చూడాలని కోరుకుంటున్నారు. అప్పటికీ తాము రాత్రిళ్లు ఇలాంటి మంత్రగాళ్లను గుర్తించే యత్నం చేస్తున్నామనీ.. అయినా సరే తమ కన్ను కప్పి.. తమ పని తాము చేసుకెళ్తున్నారనీ.. ఇకనైనా ఇలాంటి బాణామతి- చేతబడి- చిల్లంగి వంటి క్షుద్ర పూజలు చేసేవారిని గుర్తించాలంటే.. సీసీ కెమెరాలు అమర్చడం వల్ల మాత్రమే సాధ్యమవుతుందని సూచిస్తున్నారు కొందరు. మరి చూడాలి.. స్మశాన నిర్వాహకులు ఈ దిశగా చర్యలు తీసుకుంటారా? లేక ఎప్పటిలాగానే లైట్ తీస్కుంటారా తెలియాల్సి ఉంది.

నూర్ మహ్మద్, టీవీ9 ప్రతినిధి, హైదరాబాద్