Annapurna Bhojanam : కొవిడ్ నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పది రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయించడంతో గ్రేటర్ హైదరాబాద్ లోని నిరాశ్రయులు, చిరువ్యాపారులు, బీద వారికి అన్నపూర్ణ కేంద్రాల ద్వారా రోజూ 45 వేల మందికి భోజన సౌకర్యాన్ని జీహెచ్ఎంసీ అందిస్తోంది. నగరంలో ప్రస్తుతం ఉన్న 150 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా నగరంలోని అన్నార్తులకు రోజు ఐదు రూపాయల భోజనాన్ని జీహెచ్ఎంసీ కల్పిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకై రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. ఎక్కడ ఉన్న ప్రజలు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్తక వ్యాపార సంస్థలు, విద్యాలయాలు, పరిశ్రమలు మూసివేయడంతో ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. దీంతో ఇబ్బంది పడుతున్న వలస కార్మికులు, చిరుద్యోగులు, రోజువారి కూలీలు, నిరాశ్రయులు, వసతి గృహాలలో ఉంటున్న విద్యార్థులు, ఉద్యోగులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రస్తుత లాక్ డౌన్ లో మరిన్ని అన్నపూర్ణ కేంద్రాలను తెరచి అవసరమైన వారికందరికి అన్నపూర్ణ భోజనాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో ప్రస్తుతం ఉన్న కేంద్రాలకు అదనంగా 100 అన్నపూర్ణ కేంద్రాలు నగరంలో ప్రారంభ మయ్యాయి. మొత్తం 250 కేంద్రాల ద్వారా ప్రతి రోజూ 45 వేల మందికి అన్నపూర్ణ భోజనం అందిస్తున్నారు.
ఇవాళ గురువారం నాడు నగరంలోని పలు సర్కిళ్లలో అదనపు అన్నపూర్ణ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. దీనితో, నగరంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ముఖ్యంగా కూలీలు, విద్యార్థులు, చిరువ్యాపారులు, చిరు ఉద్యోగులకు నాణ్యమైన సమతుల పోషకాహారాన్ని వేడివేడిగా ఈ అన్నపూర్ణ భోజన పథకం ద్వారా అందిస్తున్నారు. కాగా, నేడు అన్నపూర్ణ భోజన కేంద్రాలను జీహెచ్ ఎంసీ జోనల్, డిప్యూటీ కమీషనర్లు సందర్శించి సక్రమంగా పనిచేసేలా చర్యలు చేపట్టారు. ప్రధాన ఆసుపత్రులు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, కూలీల అడ్డాలు, జంక్షన్లు ఉన్న ప్రాంతాలలో అన్నపూర్ణ కేంద్రాలు నడుస్తున్నాయి. ప్రతి భోజనంలో 450 గ్రాముల అన్నం, 100 గ్రాముల పప్పు, సాంబార్, పచ్చడి తప్పనిసరిగా ఉండేవిధంగా మెనును అమలు చేస్తున్నారు. సమతుల పోషక పదార్థాలతో అందిస్తున్న అన్నపూర్ణ ఉచిత భోజనం పట్ల వలస కార్మికులు, నిరాశ్రయులు, విద్యార్థులు, చిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆకలి తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ చొరవను అభినందిస్తున్నారు.
Read also : Free Covid treatment : షాపూర్ నగర్ మల్లారెడ్డి కొవిడ్ కేర్ సెంటర్లో ఉచిత వైద్య, ఆహార, మందుల సేవలు