భూములు కావవి.. ఖజానా నింపే అక్షయపాత్రలు..! యస్..! కోకాపేట భూములు బంగారు గనుల్లా మారిపోయాయి. అందుకే ఆ భూములను దక్కించుకునేందుకు బడావ్యాపారులు క్యూ కడుతున్నారు. అసలు ఎకరం భూమి 100 కోట్లకు పైగా ధర పలకడానికి కారణం ఏంటి..? దాని క్రేజ్ వెనుక రీజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఓవైపు చారిత్రక చార్మినార్ వెలుగు జిలుగులు… మరోవైపు తళుకులీతున్న ఆకాశహర్మ్యాలు. ఇంకోవైపు అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు.. ఆకాశాన్నంటే భవనాల్లో ఐటీ కంపెనీలు.. విదేశాల తరహాలో స్కైవేలు, హరితహారంతో పరుచుకున్న పచ్చందాలు. వెరసీ ప్రపంచమంతా ఇప్పుడు హైదరాబాద్ వైపే చూస్తోంది. హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటుంది. భాగ్యనగరం గురించి కలలు కంటుంది. అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులకు హైదరాబాద్‌నే తమ గమ్యస్థానంగా భావిస్తున్నాయంటే… భాగ్యనగరం ఖ్యాతి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి హైదరాబాద్ గురించి కోకాపేట ల్యాండ్స్ మళ్లీ మాట్లాడుకునేలా చేశాయి.
హైదరాబాద్ భూమికి ఎంత విలువ ఉందో మరోసారి చాటి చెప్పిన వేలం ఇది. దేశ రాజధాని ఢిల్లీ, దేశ వాణిజ్య రాజధాని ముంబై లాంటి మహా నగరాలే కాదు.. మన రాజధాని మహా నగరం భాగ్యనగరి కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్ అనిపించుకుంది. హైదరాబాద్‌లో సౌకర్యాలు గ్లోబల్ సిటీని తలపిస్తున్నాయో లేదో తెలీదు కానీ భూముల ధరలు మాత్రం గ్లోబల్ సిటీలను మైమరిపిస్తున్నాయి. తాజాగా కోకాపేట సమీపంలో ఎకరం భూమి అక్షరాల 100 కోట్ల రూపాయలు పలికిన ఘటన దేశంలోనే పేరుమోసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం ఔరా అని ముక్కున వేలేసుకునేలా చేసింది. ఈ డైలాగ్స్ గుర్తున్నాయిగా..? ‘ఆ… కోకాపేటలో భూమి అమ్మితే.. లెక్కలేనంత డబ్బు వస్తుందని తులసి సినిమాలో కోకాపేట ఆంటీ అప్పుడెప్పుడో చెప్పగా.’. ఇప్పుడు అది నిజమైంది.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వేలంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి కోకాపేట్ భూములు. నియోపోలిస్ లేఅవుట్‌లో ఒక్క ఎకరం ధర వంద కోట్ల 75లక్షల రూపాయలు పలికి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. ప్లాట్ నెంబర్ 10లో 3.6 ఎకరాలకు వేలం నిర్వహిస్తే… ఒక్కో ఎకరం వంద కోట్లు దాటేసి దుమ్ముదులిపింది. మొత్తం 45.33 ఎకరాలకు వేలం నిర్వహించగా ప్రభుత్వానికి 3వేల 319కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. మార్నింగ్ సెషన్‌లో 6, 7, 8, 9 ప్లాట్లకు ఆక్షన్ నిర్వహించగా హాట్ కేకుల్లా కొనేశాయి రియల్ ఎస్టేట్ సంస్థలు. ఎకరం ధర 68కోట్లకు తగ్గకుండా అమ్ముడుపోయింది. అసలు ఏ ప్లాట్‌లో ఏ రేట్ పలికాయో పరిశీలిస్తే.. ప్లాట్ నెంబర్ 6లో ఎకరం ధర రూ.73కోట్లు పలికింది. ప్లాట్ నెంబర్ 7లో ఎకరం ధర రూ.75.50కోట్లు, ప్లాట్ నెంబర్ 8లో ఎకరం భూమి రూ.68కోట్లు, ప్లాట్ నెంబర్ 9లో రూ.75.25కోట్లు పలికింది.
ఇక, సెకండ్ సెషన్‌లో 10, 11, 11 ప్లాట్స్‌లో భూములకు వేలం జరిగింది. ఈవినింగ్ సెషన్‌లోనే కోకాపేట భూములు సరికొత్త రికార్డులు సృష్టించాయ్. చరిత్రను తిరగరాస్తూ ఎకరం ధర ఏకంగా వంద కోట్లు దాటేశాయ్. దాంతో, దేశంలోకెల్లా అత్యంత ఖరీదైన భూమి కోకాపేటదే అని తేలిపోయింది. ప్లాట్ నెంబర్ 10లో ఎకరం భూమి రూ.100.75కోట్లు పలికింది. ప్లాట్ నెంబర్ 11లో రూ.67.25కోట్లు. ప్లాట్ నెంబర్ 14లో ఎకరం రూ.70కోట్లు పలికింది.
నియోపోలీస్ ఫేజ్-2లో ఎకరం భూమి కనీస బిడ్డింగ్ ధరను 35కోట్లగా నిర్ణయించింది ప్రభుత్వం. ఈ లెక్కన సుమారు 16వందల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. కానీ, ప్రభుత్వ అంచనాలను తలకిందులు చేస్తూ పోటీపడ్డాయ్ రియల్ ఎస్టేట్ సంస్థలు. పైగా రికార్డుస్థాయిలో ఎకరం భూమి ధర వంద కోట్లు దాటేయడం సంచలనంగా మారింది. హైదరాబాద్ చరిత్రలోనే ఇది అత్యంత అధిక ధర అంటున్నాయి మార్కెట్ వర్గాలు. ఎకర భూమిని వంద కోట్ల 75లక్షల రూపాయలకు కొనుగోలుచేసి రికార్డు సృష్టించింది రాజ్‌పుష్పా ప్రొపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. మొత్తం 45.33 ఎకరాలకు వేలం నిర్వహించగా ప్రభుత్వానికి 3వేల 319కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. 6, 7, 8, 9, 10, 11, 14 ప్లాట్స్‌లోని భూములు… ఒక్కొటీ ఒక్కో ధరకు అమ్ముడుపోయాయ్. మొత్తంగా తులసీ సినిమాలో కోకాపేట ఆంటీ… స్థలం అమ్మిన డబ్బులతో ఒక్కసారిగా ధనికురాలైన పాత్రతో కామెడీ చేస్తూ నవ్వులూ పూయించింది. కానీ.. అది మాత్రం కామెడీ కాదు.. అక్షరాలా నిజమని ఇప్పుడు నిరూపితమైంది.