Hyderabad: TGPSC గ్రూప్ 1 అభ్యర్ధుల ర్యాలీలో తోపులాట.. బండి సంజయ్, RS ప్రవీణ్ అరెస్ట్
లోయర్‌ట్యాంక్‌బండ్ వద్ద గ్రూప్ 1 అభ్యర్ధులు చేపట్టిన ర్యాలీలో ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీలో పాల్గొన్న బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు పలువురు నేతలను అరెస్ట్ చేసి వాహనాల్లో తరలించారు..
హైదరాబాద్, అక్టోబర్ 19: హైదరాబాద్‌లోని లోయర్‌ట్యాంక్‌బండ్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్ 1 అభ్యర్థులు చేపట్టిన ర్యాలీలో గందరగోళం చోటు చేసుకుంది. కేంద్రమంత్రి బండి సంజయ్‌తో కలిసి సచివాలయానికి గ్రూప్ 1 అభ్యర్థులు ర్యాలీగా వెళ్తుండగా.. ర్యాలీలో పాల్గొనేందుకు బీఆర్‌ఎస్ నేతలు కూడా వచ్చారు. శ్రీనివాస్‌గౌడ్, RS ప్రవీణ్, దాసోజుకు నిరసన సెగ వెళ్లువెత్తింది. గ్రూప్ 1 అభ్యర్థుల ర్యాలీలోకి బీఆర్ఎస్ నేతలు రావడంతో బీజేపీ నేతలు వారిని అడ్డుకున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. బీఆర్‌ఎస్ నేతలను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. దీంతో గ్రూప్-1 అభ్యర్థుల ర్యాలీ రెండుగా చీలిపోలింది.
కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ చౌరస్తాకు వెళ్లారు. గ్రూప్-1 అభ్యర్థులతో మాట్లాడి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం చలో సచివాలయానికి పిలుపునిచ్చారు. గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి సచివాలయం వైపు ర్యాలీగా బయలుదేరారు. వీరి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయానికి వెళ్లి సీఎంను కలుస్తానని స్పష్టం చేసిన బండి సంజయ్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు తప్పుకోవడంతో ర్యాలీగా సెక్రటేరియట్ వైపునకు కదిలారు బండి సంజయ్. ‘ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించాలని, జీవో 29ను రద్దు చేయాలని’ బండిసంజయ్ డిమాండ్ చేశారు. 29 జీవో ఎందుకు తీసుకొచ్చారు? రిజర్వేషన్ల వ్యవస్థను రద్దు చేయదలుచుకున్నారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రేవంత్ పాలన నిజాంను తలపిస్తోంది. ప్రభుత్వం మొండిపట్టు వీడాలి. గ్రూప్ 1 అభ్యర్థులపై పోలీసుల లాఠీచార్జ్ సరికాదు. కోర్టును కూడా ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది. హైకోర్టు తీర్పును గౌరవించాల్సిందేనని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దీంతో సచివాలయానికి ర్యాలీగా వెళ్తున్న బండి సంజయ్‌ని మళ్లీ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద మళ్లీ పోలీసులు అడ్డుకుని, ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను కారులో ఎక్కించుకుని పోలీసులు తీసుకెళ్లారు. దీంతో పోలీసుల వాహనాన్ని గ్రూప్-1 అభ్యర్థులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, గ్రూప్-1 అభ్యర్థుల మధ్య తోపులాట జరిగింది. గ్రూప్-1 అభ్యర్థులను పోలీసులు చెదరగొట్టారు.
మరోవైపు తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర బీఆర్‌ఎస్ నేతలను వరుసగా పోలీసులు అరెస్ట్ చేశారు. 29 జీవోను రద్దు చేసి తీరాలని శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఏ పార్టీతో సంబంధం లేదు. ‘రాజకీయాలు కాదు, విద్యార్థుల భవిష్యత్ చూడాలని అన్నారు. విద్యార్థుల పక్షాన అన్ని పార్టీలు పోరాటం చేస్తాయన్నారు. ప్రభుత్వం విద్యార్థులతో వెంటనే చర్చించాలని’ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో లోయర్‌ట్యాంక్‌బండ్‌లోని ఇందిరాపార్క్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనలతో హైదరాబాద్ అట్టుడుకింది. అశోక్‌నగర్ టు లోయర్ ట్యాంక్‌బండ్ ర్యాలీలతో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు హోరెత్తించారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అనంతరం బీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్‌గౌడ్, శ్రవణ్, ఆర్‌ఎస్ ప్రవీణ్‌లను కూడా అరెస్ట్ చేశారు. ఇక గ్రూప్ 1 అభ్యర్థుల మెరుపు ధర్నాతో లోయర్ ట్యాంక్‌బండ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ దద్దరిల్లింది. గ్రూప్ వన్ అభ్యర్థులకు మద్దతుగా వెళ్లిన కేంద్రమంత్రి బండి సంజయ్‌ని.. బీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్ గౌడ్, శ్రవణ్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.