Hyderabad Rains: నగరంలో దంచికొడుతున్న వాన.. నిమిషాల్లో తడిసిముద్దైన భాగ్యనగరం!

హైద‌రాబాద్ న‌గ‌రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్యాహ్నాం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో హైదరాబాద్ తడిసి ముద్దైంది. కుండపోత వర్షంతో రోడ్లన్న జలమయంగా మారాయి.దీంతో రోడ్లపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Hyderabad Rains: నగరంలో దంచికొడుతున్న వాన.. నిమిషాల్లో తడిసిముద్దైన భాగ్యనగరం!
Telangana Rains

Updated on: May 21, 2025 | 11:40 PM

రానున్న రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళా తీరాన్ని తాకనుండడంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌ నగరంలో మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భాగ్యనగరం తడిసిముద్దైంది. నగరంలోని ప్రధాన ప్రాంతాలైన పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌,షేక్‌పేట్‌, మాదాపూర్, గచ్చిబౌలి, సికింద్రాబాద్, బేగంపేట అమీర్‌పేట, ఉప్పల్, రామంతాపూర్, మేడిపల్లి, బోడుప్పల్ సహ ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌లో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లలోకి నీరు చేరుకుంది. రోడ్లన్ని జలమయంగా మారాయి.

ఇక సాయంత్రం పూట కూడా వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందరికీ ఆఫీస్ వదిలే సమయం కావడంతో వాహనాలన్ని ఒక్కసారిగా రోడ్డుపైకి చేరుకున్నాయి.ఈ కారణంగా కొన్ని ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కొన్ని చోట్ల గంటల తరబడి ట్రాఫిక్‌లోనే వెయిట్‌ చేశారు. ఇక వర్షాల పట్ల అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు, రంగంలోకి దిగారు. రోడ్లపై భారీగా నీరు నిలిచిన ప్రాంతాల్లో చర్యలు చేపట్టారు. నీటిని తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులకు సహకరించారు.

అయితే నగరంలో ఇంకా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రానున్న మూడు రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాలపై ఎప్పటికప్పుడూ సమీక్షలు జరుపుతూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. రోడ్లపై నీరు, విద్యుత్‌ అంతరాయం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..