హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో మళ్లీ లొల్లి షురూ అయ్యింది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా కొనసాగుతున్న అజారుద్దీన్ పదవీకాలం సెప్టెంబర్ 26 వ తేదీకే ముగిసిందని మాజీ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, ఇప్పటివరకూ తిరిగి ఎన్నికలు నిర్వహించకుండా కాలాయాపన చేస్తున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే ఇవాళ హెచ్‌సీఏ మాజీ సభ్యులంతా కలిసి ఉప్పల్ స్టేడియంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 160 మంది సభ్యులు హాజరయ్యారు. జనవరి 10న ఎన్నికలు జరుపుతామని హెచ్‌సీఏ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. జి.సంపత్‌ను ఎన్నికల అధికారిగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
పదవీకాలం ముగిసినా హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్, ఇంకా పదవిలో కొనసాగుతారని HCA మాజీ అధ్యక్షుడు జి.వినోద్ మండిపడ్డారు.కొత్తగా ఎన్నికలు నిర్వహించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారాయన. క్రికెట్ క్లబ్‌ల కార్యదర్శులు ఎన్నికల అధికారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలిపారు.
హెచ్‌సీఏ సభ్యులు సమావేశం పెట్టకుండా స్టేడియం బయటే అడ్డుకున్నారని ఆరోపించారు మాజీ సెక్రటరీ శేషు నారాయణ.జనరల్ బాడీ లోపల సమావేశం పెట్టుకోవడానికి అనుమతించలేదని మండిపడ్డారు. హెచ్‌సీఏ మెంబర్స్‌ను అజార్ అండ్ టీమ్ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని, ఇటీవలి టిక్కెట్ స్కామ్స్ విషయంలో అజార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హెచ్‌సీఏలో కొనసాగుతున్న వివాదంపై అజారుద్దీన్ మళ్లీ ఇప్పటివరకూ స్పందించలేదు. అయితే ఈ లొల్లి ఎటువైపు దారి తీస్తుంది..? మరీ అజార్ అండ్ టీమ్ రిజైన్ చేస్తారా..? హెచ్‌సీఏ ఎలక్షన్స్ జరుగుతాయా? అనేది వేచిచూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..