BJP MLA Raja Singh: రెండు వేల కోట్లు ఇస్తే పదవికి రాజీనామా చేసేస్తా: ఎమ్మెల్యే రాజాసింగ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టబోతోన్న పాదయాత్రకు 'ప్రజా సంగ్రామ యాత్ర'గా పేరు పెట్టారు. హైదరాబాద్‌లోని చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ఇవాళ గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్..
Telangana BJP MLA Rajasingh: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టబోతోన్న పాదయాత్రకు ‘ప్రజా సంగ్రామ యాత్ర’గా పేరు పెట్టారు. హైదరాబాద్‌లోని చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ఇవాళ గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్, బీజేపీ నేతలు బాబు మోహన్, డాక్టర్ చంద్రశేఖర్ పూజలు చేసి.. పాదయాత్ర పేరును ప్రకటించారు. 2023 ఎన్నికలు జరిగే వరకు విడతలవారీగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుని ‘ప్రజా సంగ్రామ యాత్ర’ కొనసాగుతుందని ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ సందర్భంగా తెలిపారు.
ఈ సందర్భంగా రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోషామహల్ నియోజకవర్గానికి రెండు వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఖర్చు చేసే ప్రతి పైసా ప్రజల సొమ్మేనని చెప్పిన రాజాసింగ్.. ఈటల రాజేందర్ ప్రజాసేవకుడని.. అతన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇలాఉండగా, ఆగస్టు 24 న భాగ్యలక్ష్మి ఆలయం నుంచే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఆరంభం కానుంది. హుజురాబాద్ వరకు పాదయాత్ర కొనసాగుతుంది.
వాస్తవానికి ఆగస్టు 9 నే పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉన్నా.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేపథ్యంలో తన ఎంపీలకు బీజేపీ విప్ జారీచేయడం వల్ల ఎంపీ బండి సంజయ్ తప్పనిసరిగా ఢిల్లీలో ఉండిపోవాల్సి వచ్చింది. కీలక బిల్లులను ప్రవేశపెట్టడం వల్ల సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ పాదయాత్రను ఆగస్టు 24 నుంచి చేపట్టాలని నిర్ణయించారు.
కాగా, కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ఈనెల 16 నుంచి తెలంగాణ రాష్ట్రంలో యాత్ర నిర్వహించబోతున్నారు. ఆ కార్యక్రమంలోనూ పాల్గొనాల్సి ఉండటంతో సంజయ్ పాదయాత్ర వాయిదా పడింది. కేంద్రంలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఈనెల 16న రాష్ట్రానికి వస్తున్న కిషన్‌రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద భారీగా కిషన్ రెడ్డికి స్వాగతం పలుకబోతున్నారు.
Read also: Fake Challans: ఫేక్ చలానాలతో రిజిస్టేషన్ల కుంభకోణంపై సీఎం జగన్ సీరియస్.. రివ్యూలో హాట్ కామెంట్స్