AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Golconda Stepwells: యునెస్కో గుర్తింపుతో కాలరెగరేస్తున్న16వ శతాబ్దం నాటి మెట్లబావి.. చారిత్రక సంపదకు గుర్తింపుతో సర్వత్రా హర్షం

గోల్కొండ కోట నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణం ఉంది. 106 ఎకరాల్లో విస్తరించిన కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ లో 16 సమాధులు, 23 మసీదులు, ఆరు బావులు ఉన్నాయి.

Golconda Stepwells: యునెస్కో గుర్తింపుతో కాలరెగరేస్తున్న16వ శతాబ్దం నాటి మెట్లబావి.. చారిత్రక సంపదకు గుర్తింపుతో సర్వత్రా హర్షం
Bansilalpet Stepwell
Surya Kala
|

Updated on: Nov 29, 2022 | 6:50 PM

Share

యునెస్కో ఆసియా-పసిఫిక్‌ అవార్డ్స్‌ ఫర్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ కన్జర్వేషన్‌ విభాగంలో హైదరాబాద్ లోని కుతుబ్‌షాహీ మెట్ల బావులకు అవార్డ్‌ ఫర్‌ డిస్టింక్షన్‌ పురస్కారం లభించింది. కాకతీయులు, కుతుబ్ షాహీల కాలం నాటి మెట్లబావులు ఆనాడు నీటి నిల్వ, తాగునీటి వనరులుగా వెలుగొందాయి. కాలక్రమేణా చాలా బావులు కనుమరుగు కాగా.. మరికొన్ని చెత్తచెదారాలతో పూడుకుపోయాయి. అందులో కొన్ని బావులను గుర్తించి ఎన్జీవో సంస్థల సహకారంతో వాటి పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో ఇటీవల అత్యంత అద్భుతంగా పునర్వైభవం సంతరించుకున్న బన్సీలాల్ పేట్ మెట్లబావితో పాటు కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణంలోని పెద్ద మెట్లబావి కూడా ఉంది.

గోల్కొండ కోట నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణం ఉంది. 106 ఎకరాల్లో విస్తరించిన కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ లో 16 సమాధులు, 23 మసీదులు, ఆరు బావులు ఉన్నాయి. వర్షపు నీటి నిల్వ, జల సంరక్షణ కోసం ఆ కాలంలోనే ఆరు బావులను అద్భుతమైన రీతిలో నిర్మించారు. ఇక్కడ ఉన్న ఈ పెద్ద మెట్ల బావి భారీ వర్షాలతో ఓ పక్క భాగం కూలిపోయి పూర్తిగా పూడుకుపోగా… 2013లో ఆగాఖాన్‌ ట్రస్ట్‌ సహకారంతో దీన్ని పునరుద్ధరించారు. ఈ బావి నుంచి మోట ద్వారా నీళ్లు పైకి తోడేందుకు ప్రత్యేక నిర్మాణం చేపట్టారు. రెండు వైపుల నుంచి బావిలోని నీటి వద్దకు చేరుకునేలా మెట్ల నిర్మాణం చేశారు.

ఆనాడు ఈ బడా బావి నుంచి నీళ్లను ఎలా తోడేవారు, వాటిని ఎలా వినియోగించేవారో చూస్తే అబ్బురమనిపిస్తుంది. 16వ శతాబ్దం నాటి ఈ బావి అడుగడుగునా కనిపించే నిర్మాణ శైలి సృజనాత్మకతకు అద్దం పడుతుంది. ఈ నిర్మాణం పర్షియన్ శైలిలో చేశారు. మెట్ల బావి నుంచి ఏనుగులతో నీటిని తోడించేవారు. దీనికోసమే బావి లోపలకు వెళ్లేలా మెట్లను నిర్మించారు. ఈ బావిలో 37 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ సాంస్కృతిక కట్టడాలకు పునర్వైభవం తేవడంతో పాటు, జల సంరక్షణ కోసం నాడు అవలంబించిన విధానాలను పరిరక్షించి, అప్పటి ఇంజినీరింగ్‌ నైపుణ్యాన్ని కళ్లకు కడుతోంది ఈ బడా బావి. ఇంతటి చారిత్రక సంపదకు ప్రపంచ గుర్తింపు రావడం.. మరుగున పడ్డ మరిన్ని చారిత్రక కట్టడాలు వెలుగులోకి వచ్చేందుకు దోహదపడనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..