Domakonda Fort: రాజఠీవికి నిలువెత్తు నిదర్శనం దోమకొండ కోట.. యునెస్కో ఆసియా-పసిఫిక్ అవార్డుకి ఎంపిక
దోమకొండ కోట తెలంగాణలోని ప్రాచీన సంస్థానాల్లో ఒకటి. మెగా హీరో రాంచరణ్ - ఉపాసన పెళ్లితో దోమకొండ కోట దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. ఈ కోటను సందర్శించేందుకు చుట్టు పక్కల రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారు
తెలంగాణ చారిత్రక వైభవానికి మరోసారి ప్రపంచ గుర్తింపు దక్కింది. శిలలపై శిల్పాలు చెక్కిన ఈ గడ్డపై విరాజిల్లిన చారిత్రక కట్టడాలను యునెస్కో ఆసియా-పసిఫిక్ అవార్డులు వరించాయి. అందులో హైదరాబాద్‌లోని గోల్కొండ మెట్ల బావి, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ కోట ఉన్నాయి. గోల్కొండ కోట సమీపంలోని బడా బావిని భళారే అంటూ కీర్తించిన యునెస్కో మరోవైపు కోటంటే కోటా కాదూ అంటూ దోమకొండ కోట వైభవాన్ని కూడా గానం చేసింది.
2022 సంవత్సరానికి గాను ఆసియా-పసిఫిక్ అవార్డ్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అవార్డుకు వివిధ దేశాల నుంచి 287 ప్రతిపాదనలు రాగా అందులో ఆరు దేశాలకు చెందిన 13 ప్రాజెక్ట్‌లను యునెస్కో ఎంపిక చేసింది. వీటిలో ఇండియా నుంచి నాలుగు ఉండగా అందులో తెలంగాణ నుంచి రెండు చారిత్రక కట్టడాలు యునెస్కో జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. అంతర్జాతీయ గుర్తింపుతో తెలంగాణ గత కాలపు ఘన కీర్తి బావుటాను ప్రపంచం ఎదుట సగర్వంగా ఎగురవేస్తోంది దోమకొండ కోట. 18వ శతాబ్దంలో నిర్మించిన ఈ కోటలో అనేక అద్భుత కట్టడాలు ఉన్నాయి. మమ్మల్ని తలెత్తి చూడాల్సిందే అన్నంత ఠీవిగా చూస్తుంటాయి దోమకొండ కోట బురుజులు. లోపలకు అడుగు పెడితే చరిత్ర పేజీలు కళ్ల ముందు తిరుగుతాయి.
దోమకొండ కోట తెలంగాణలోని ప్రాచీన సంస్థానాల్లో ఒకటి. ఈ కోటలో మహాదేవుని ఆలయం ఉంది. కాకతీయుల కాలంలో ఆలయానికి రాణి రుద్రమదేవి వచ్చి పూజలు చేసి వెళ్లినట్లు శాసనంలో ఉంది. కామినేని వంశస్తులు మరమ్మతులు చేపట్టిన తర్వాత వారి రాజఠీవికి నిలువెత్తు నిదర్శనంగా మారింది దోమకొండ కోట. ఆసియా-పసిఫిక్ కల్చరల్ కన్జర్వేషన్‌కు సంబంధించి యునెస్కో అవార్డు రావడంతో దోమకొండ కోట మరింత పర్యాటక శోభను సంతరించుకునే అవకాశం ఉంది. కామినేని వంశస్తులు దానికి తగిన సహకారం అందిస్తున్నారు.
మెగా హీరో రాంచరణ్ – ఉపాసన పెళ్లితో దోమకొండ కోట దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. ఈ కోటను సందర్శించేందుకు చుట్టు పక్కల రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. దోమకొండ కోట శోభను మరింత పెంచుతోంది వెంకట భవన్. దోమకొండ కోటను సంరక్షిస్తున్న కామినేని అనిల్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు గ్రామస్తులు.
యునెస్కో గుర్తింపుతో పర్యాటక స్థలంగా దోమకొండ మరింత ప్రాచుర్యం పొందే అవకాశం ఉందంటున్నారు గ్రామస్తులు. యునెస్కో గుర్తింపుతో తెలంగాణ చారిత్రక కట్టడాలు కాలరెగరేసి ప్రపంచ పటంలో చోటు దక్కించుకుంటుంటే మరిన్ని చారిత్రక, సాంస్కృతిక వైభవ చిహ్నాలు వెలుగులోకి వచ్చేందుకు ఆస్కారం ఉంటుందని చరిత్రకారులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..