వనితలను వరించిన బల్దియా పీఠం.. భాగ్యనగర ప్రథమ పౌరురాలుగా గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీగా శ్రీలత

రాజకీయ, సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని వ్యూహత్మకంగా వ్యవహరించిన గులాబీ బాస్‌ కేసీఆర్‌ చివరి నిమిషంలో ఇద్దరు మహిళలకు గ్రేటర్ హైదరాబాద్‌ను అప్పగించారు.

  • Balaraju Goud
  • Publish Date - 1:32 pm, Thu, 11 February 21
వనితలను వరించిన బల్దియా పీఠం.. భాగ్యనగర ప్రథమ పౌరురాలుగా గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీగా శ్రీలత

మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్‌లోనే కొనసాగింది. పాఠశాల విద్య హైద‌రాబాద్‌లోని హోలీ మేరి స్కూల్‌లో పూర్తిచేశారు. రెడ్డి ఉమెన్స్‌ కాలేజీలో ఇంటర్‌, భారతీయ విద్యాభవన్‌లో జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. సుల్తాన్‌ ఉల్‌ లూమ్‌ లా కాలేజీలో న్యాయవిద్యను అభ్యసించారు.

వివాహానంతరం ఆమె 18 ఏండ్లపాటు అమెరికాలో ఉన్నారు. ఆ సయమంలో ఉత్తర కరోలినాలోని డ్యూక్‌ యూనివర్సిటీ కార్డియాలజీ డిపార్ట్‌మెంట్‌లో రిసెర్చ్‌ అసిస్టెంట్‌గా పనిచేశారు. 2007లో అమెరికా పౌరసత్వాన్ని వదులుకొని భారత్‌కు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి ఆమె రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున బంజారాహిల్స్‌ కార్పొరేటర్‌గా భారీ విజయం సాధించారు. డివిజన్‌ అభివృద్ధికి తనవంతుగా కృషిచేశారు.

గద్వాల విజయలక్ష్మి(బంజారాహిల్స్‌)

వయస్సు: 56

భర్త: బాబీరెడ్డి

విద్యార్హత: ఎల్‌ఎల్‌బీ

కులం: మున్నూరు కాపు (బీసీ)

ఇక, డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన మోతె శ్రీల తార్నాక డివిజన్ నుంచి తొలిసారిగా కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమం తొలినాళ్ల నుంచి క్రీయాశీలకంగా వ్యవహరించిన మోతె శోభన్‌రెడ్డి భార్య శ్రీలత. ట్రేడ్ యూనియన్ నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు శోభన్ రెడ్డి. కాగా శ్రీలత కూడా టీఆర్ఎస్ పార్టీ భర్త శోభన్‌రెడ్డికి అండగా నిలిచింది. పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు.

మోతె శ్రీలత(తార్నాక‌)

వయస్సు: 49

భర్త: మోతె శోభన్‌రెడ్డి

పిల్లలు: రాజీవి, శ్రీతేజస్వి

విద్యార్హత: బీఏ

వృత్తి : 20 ఏండ్లుగా బొటిక్ నిర్వ‌హ‌ణ‌

రాజకీయ అనుభవం: కొంతకాలంపాటు టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.